Bengaluru Vs Kolkata: ఈ సీజన్‌లో తొలి జట్టుగా కోల్‌కతా.. ‘500’ క్లబ్‌లోకి సునీల్ నరైన్

ఈ సీజన్‌లో బెంగళూరుకు రెండో ఓటమి ఎదురైంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా చేతిలో పరాజయంపాలైంది.

Updated : 30 Mar 2024 08:10 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో 17వ సీజన్‌లో కోల్‌కతా దూకుడు కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అలవోకగా విజయం సాధించింది. దీంతో ఈ ఎడిషన్‌లో సొంతమైదానం కాకుండా బయటి వేదికల్లో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన తొలి జట్టుగా కోల్‌కతా నిలవడం విశేషం. అలాగే ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు జరగగా.. బెంగళూరు మాత్రమే సొంతమైదానంలో ఓడిపోయింది. కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించిన సునీల్‌ నరైన్‌ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా 500 టీ20లు ఆడిన నాలుగో క్రికెటర్‌గా అవతరించాడు. కీరన్‌ పొలార్డ్ (660), డ్వేన్ బ్రావో (573), షోయబ్‌ మాలిక్ (542) మాత్రమే అతడి కంటే ముందున్నారు. ఈ క్రమంలో మ్యాచ్‌ అనంతరం నరైన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘టీ20ల్లో అద్భుతమైన మైలురాయి అందుకోవడం ఆనందంగా ఉంది. తప్పకుండా మరో 500 మ్యాచ్‌లు (నవ్వుతూ) ఆడతాననే నమ్మకం ఉంది. నాపై నాకున్న విశ్వాసం అలాంటిది. చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్‌ ఆడటం రిలీఫ్‌గా అనిపించింది. జట్టులోని సహచరులతోపాటు సహాయక సిబ్బంది ప్రోత్సాహం మరువలేనిది. ఇప్పటికీ కఠినంగా శ్రమిస్తుంటా. పవర్‌ప్లే చివరి ఓవర్‌ అత్యంత క్లిష్టమైన ఓవర్. శుభారాంభాన్ని కొనసాగించడం సులువైన విషయం కాదు. మ్యాచ్‌ గెలిచినప్పుడు అందులో మన భాగస్వామ్యం ఉంటే ఆ అనుభూతి బాగుంటుంది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికీ పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఉంటుంది’’ అని నరైన్ అన్నాడు. ఓపెనర్‌గా వచ్చిన నరైన్ 47 పరుగులు చేశాడు. అంతకుముందు బౌలింగ్‌లో ఒక వికెట్‌ పడగొట్టాడు. దీంతో అతడికే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

ఇక్కడ రెండు సెషన్లు ప్రాక్టీస్‌ చేశాం: శ్రేయస్‌

‘‘బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు ఈ మైదానంలో రెండు సెషన్లపాటు ప్రాక్టీస్‌ చేశాం. తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఇప్పుడు జట్టుగా రాణించగలిగాం. కొన్ని బంతులు అనుకున్నట్లుగా హిట్టింగ్‌ చేస్తే ఆటోమేటిక్‌గా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రస్సెల్ బౌలింగ్‌ వేసేటప్పుడే ఈ పిచ్‌ ఫాస్ట్‌కు సహకరించదని అర్థమైంది. దీంతో స్లో బంతులతో అతడు ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అప్పటికప్పుడు పిచ్‌ పరిస్థితిపై విశ్లేషించడం అద్భుతం. ఓపెనర్‌గా సునీల్ నరైన్ డేంజరస్ బ్యాటర్. అతడి నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించిందే’’ అని కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ వ్యాఖ్యానించాడు.

వైశాక్‌ చాలా బాగా బౌలింగ్‌ వేశాడు: వెంకటేశ్ అయ్యర్

‘‘కీలకమైన మ్యాచ్‌లో ఫామ్‌ అందుకోవడం బాగుంది. వెన్ను నొప్పి కాస్త ఇబ్బంది పెట్టింది. అయితే, స్కాన్‌ చేసిన తర్వాతనే పరిస్థితిపై ఓ అంచనాకు వస్తా. సునీల్ నరైన్‌ అద్భుత ప్రారంభం ఇచ్చాడు. మ్యాచ్‌ విజయం సాధించడానికి అతడే ప్రధాన కారణం. ఒత్తిడి లేకుండా చేయడంతో మా పని సులువైంది. ఏ ప్లాట్‌ఫామ్‌ అయినా 100 శాతం ఆడేందుకు ప్రయత్నిస్తా. బెంగళూరు బౌలర్ వైశాక్‌ చాలా బాగా బంతులను సంధించాడు. స్లో బంతులతో ఇబ్బంది పెట్టాడు. మా బౌలర్లూ ఇలానే బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేశారు’’ అని కోల్‌కతా బ్యాటర్ వెంకటేశ్‌ అయ్యర్ తెలిపాడు. బెంగళూరుపై వెంకటేశ్ 50 పరుగులు సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు