Chennai Vs Kolkata: అతడే ‘క్రికెట్‌ దళపతి’.. చెన్నై ఫ్రాంచైజీ వెరిఫైడ్‌

గతేడాది ఛాంపియన్‌గా నిలవడంతో రవీంద్ర జడేజాదే కీలక పాత్ర. ఇప్పుడు కోల్‌కతాపై గెలవడంలోనూ అతడే ముఖ్యభూమిక పోషించాడు. 

Updated : 09 Apr 2024 13:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చెన్నై క్రికెట్‌ జట్టులో ఇద్దరిని మాత్రమే ‘తలా’.. ‘చిన్న తలా’ పేర్లతో అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఒకరు ‘కెప్టెన్‌ కూల్’ ఎంఎస్ ధోనీని (MS Dhoni) ‘తలా’ అని, మాజీ ఆటగాడు సురేశ్‌ రైనాను (Suresh Raina) ‘చిన్న తలా’ అంటూ సంబోధించారు. తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకూ (Ravindra Jadeja) చెన్నై ఓ బిరుదును జోడించింది. తొలుత ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ‘దళపతి’ అని ట్వీట్ చేయగా.. దానికి జడేజా స్పందిస్తూ.. అధికారికంగా వెరిఫై చేయాల్సి ఉందని పోస్టు పెట్టాడు. చివరికి చెన్నై ఫ్రాంచైజీ కూడా స్పందించడం విశేషం.. ఇంతకీ అసలేం జరిగిందంటే..? 

కోల్‌కతాపై మూడు వికెట్లు తీసిన జడేజా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ సొంతం చేసుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం జడ్డూతో హర్షా భోగ్లే మాట్లాడుతూ ‘దళపతి’ అని పిలుస్తాడు. ఆ వెంటనే జడేజా ‘‘నాకు ఇంకా ఆ టైటిల్‌ వెరిఫైడ్‌ కాలేదు. తప్పకుండా ఏదో ఒకటి ఇస్తారని ఆశిస్తున్నా’’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత మ్యాచ్‌లో తన ప్రదర్శనపై మాట్లాడాడు. కార్యక్రమంతా ముగిసిన తర్వాత హర్షా భోగ్లే తన ‘ఎక్స్‌’లో ఆసక్తికర పోస్టు పెట్టాడు. ‘‘మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా భారీగా అభిమానులు ఉండటం దేశంలో మరే మైదానంలోనూ ఉండదేమో. అలాంటి అద్భుత మ్యాచ్‌ కార్యక్రమంలో ఉండటం బాగుంది. జడేజాకు ‘క్రికెట్‌ దళపతి’ వెరిఫికేషన్‌ను మీరు చేస్తున్నారా?’’ అని చెన్నై ఫ్రాంచైజీని ట్యాగ్ చేశాడు. కాసేపటికే చెన్నై తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ‘‘క్రికెట్ దళపతిగా వెరిఫైడ్‌’’ అంటూ సమాధానం ఇచ్చింది. దానికి జడేజా స్పందిస్తూ ‘ధన్యవాదాలు’ అంటూ పోస్టు పెట్టాడు.

ధోనీ ఎవరికీ చెప్పడు: ఐపీఎల్‌ మాజీ ఆటగాడు

ఐపీఎల్‌లో రెండేళ్లపాటు చెన్నైపై నిషేధం పడిన సంగతి తెలిసిందే. అప్పుడు రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ తరఫున ధోనీ ఆడాడు. ఆసీస్‌ క్రికెటర్ స్టీవ్‌స్మిత్ నాయకత్వంలో ఒక సీజన్‌ ఆడటం విశేషం. ఆ జట్టులో మాజీ ఆటగాడు డాన్‌ క్రిస్టియన్ ఉండేవాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధోనీ వ్యూహాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ప్రణాళికలను ఎవరికీ చెప్పకుండా అమలు చేసేస్తాడని పేర్కొన్నాడు. ‘‘మేం 12 లేదా 13 ఓవర్ల సమయంలో వికెట్‌ నష్టపోతే.. నేను లేదా స్టోక్స్‌ లేదా మరొకరు క్రీజ్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉంటాం. కానీ, ధోనీ మాత్రం అప్పటికే రెడీ అయి అలా వెళ్లిపోయేవాడు. ఎవరికీ చెప్పకుండా బ్యాటింగ్‌కు దిగేసేవాడు. స్మిత్ లేదా కోచ్‌ ఫ్లెమింగ్‌కు కూడా ఒక్కోసారి తన ప్రణాళికలను అతడు చెప్పేవాడు కాదు. జట్టు విజయాలపై ధోనీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రత్యర్థిని కట్టడి చేయడానికి వ్యూహాలను పన్నుతూనే ఉంటాడు’’ అని డాన్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని