Jarvo: దూసుకెళ్లడం అతడికో సరదా.. జార్వో ఓ చిత్రమైన అభిమాని

టిప్‌టాప్‌గా రెడీ అవుతాడు. భారత క్రికెట్‌ జట్టు జెర్సీ వేసుకుంటాడు. అభిమానిలా ఈలలు వేస్తాడు. గోల చేస్తాడు. ఉన్నట్టుండి మైదానంలోకి దూసుకొస్తాడు. ఆటగాళ్లతో కలిసిపోతాడు. వాళ్లతో కలిసి జాతీయ గీతాలాపనలోనూ పాల్గొంటాడు. అందరిని గందరగోళంలోకి నెడతాడు. చివరికి సెక్యూరిటీ వాళ్లు వచ్చి బలవంతంగా తీసుకెళ్లేవరకు మైదానం వీడడు.. అతడే డానియల్‌ జార్వో (Daniel Jarvo)! ఇంగ్లాండ్‌ యూట్యూబర్‌. క్రికెట్‌ ప్రేమికుడు.

Published : 09 Oct 2023 19:42 IST

టిప్‌టాప్‌గా రెడీ అవుతాడు. భారత క్రికెట్‌ జట్టు జెర్సీ వేసుకుంటాడు. అభిమానిలా ఈలలు వేస్తాడు. గోల చేస్తాడు. ఉన్నట్టుండి మైదానంలోకి దూసుకొస్తాడు. ఆటగాళ్లతో కలిసిపోతాడు. వాళ్లతో కలిసి జాతీయ గీతాలాపనలోనూ పాల్గొంటాడు. అందరిని గందరగోళంలోకి నెడతాడు. చివరికి సెక్యూరిటీ వాళ్లు వచ్చి బలవంతంగా తీసుకెళ్లేవరకు మైదానం వీడడు.. అతడే డానియల్‌ జార్వో (Daniel Jarvo)! ఇంగ్లాండ్‌ యూట్యూబర్‌. క్రికెట్‌ ప్రేమికుడు. మైదానంలోకి దూసుకెళ్లి ఆటకు అంతరాయం కలిగించే చిత్రమైన అభిమాని! గతంలో ఎన్నోసార్లు ఇలా మైదానంలోకి చొచ్చుకొచ్చి ఆటను ఆపేశాడతను. తాజాగా వన్డే ప్రపంచకప్‌కు కూడా జార్వోతో ఇబ్బంది తప్పలేదు. భారత్‌-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన పోరులో అతడు దూసుకొచ్చి కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు.

ఎవరీ జార్వో

బ్రిటన్‌కు చెందిన డానియల్‌ జార్విస్‌ (Daniel Jarvis)కు జార్వో అనేది ముద్దు పేరు. ప్రాంక్స్‌ చేయడం అతడికి గొప్ప సరదా. అంతేకాదు పేరు మోసిన యూట్యూబర్‌ కూడా. 14 ఏళ్ళ క్రితమే యూట్యూబ్‌ ఛానల్‌ను మొదలుపెట్టిన అతడు బాగా విజయవంతం అయ్యాడు. 55 మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకున్నాడు. అతడి ప్రాంక్స్‌.. పేరడీలు బాగా పాపులర్‌ అయ్యాయి. అయితే అది నాణానికి ఒకవైపు! రెండోవైపు అతడో పెద్ద క్రికెట్‌ ప్రేమికుడు. ఫుట్‌బాల్‌ అంటే పడి చచ్చే వీరాభిమాని. ఏదైనా మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు మెల్లగా మైదానంలోకి ప్రవేశించడం.. ఆటగాళ్లతో కరచాలనం చేయడం.. ఫొటోలు దిగడం లాంటివి చేస్తుంటాడు. న్యూజిలాండ్, జపాన్‌ రగ్బీ జట్లతో కలిసి జాతీయ గీతం పాడడం అతడి చేష్టల్లో ఒకటి. ఇక క్రికెట్‌ అంటే అతడికి తగని మక్కువ. ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లు అంటే వాలిపోతాడు. హెడింగ్లీలో జరిగిన మ్యాచ్‌లో పొరపాటున జానీ బెయిర్‌స్టోని ఢీకొట్టి విమర్శల పాలయ్యాడు. రెండేళ్లు ఇంగ్లాండ్‌లో ఏ మైదానంలోకి రాకుండా నిషేధం పడింది. అంతేకాదు జైలు శిక్ష కూడా అనుభవించాడు.

భారత్‌ మ్యాచ్‌కు నాలుగోసారి

టీమ్‌ఇండియా అంటే జార్వోకి గొప్ప సరదా. ఎలాగైనా వీఐపీ టిక్కెట్లు సంపాందించి మైదానంలోకి వచ్చేస్తాడు. భారత జెర్సీ వేసుకుంటాడు. మన జట్టు సిక్స్‌లు, ఫోర్లు బాదినా వికెట్లు తీసినా ప్రోత్సహిస్తాడు. కానీ ఉన్నట్టుండి సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి వచ్చేస్తాడు. ఆటగాళ్లతో కరచాలనం చేస్తాడు. వారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. కోహ్లి, రోహిత్‌లతో ఇలాగే కొన్నిసార్లు మాట్లాడారు. వాళ్లే అతడిని నచ్చజెప్పి వెనక్కి కూడా పంపారు. ఇంగ్లాండ్‌లో టీమ్‌ఇండియా మ్యాచ్‌లు ఆడినప్పుడు మూడుసార్లు జార్వో ఆటకు ఆటంకం కలిగించాడు. దీంతో అతడిని ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లకు రాకుండా నిషేధం విధించారు. ఇక లాభం లేదనుకునే భారత్‌కే వచ్చేశాడీ వీరాభిమాని. ప్రపంచకప్‌లో చెన్నైలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లో మైదానంలోకి దూసుకొచ్చి మళ్లీ వార్తలోకి ఎక్కాడు. కోహ్లితో ఏదో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఈలోగా సెక్యూరిటీ వచ్చి ఎప్పటిలాగే అతడిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. దీంతో ప్రపంచకప్‌లో మిగిలిన ఏ మ్యాచ్‌లకు రాకుండా జార్వోను ఐసీసీ నిషేధం విధించింది. జార్వో రావడం అభిమానులకు ఏదో సరదాగానే అనిపిస్తుంది. కానీ ప్రపంచకప్‌ లాంటి పెద్ద టోర్నీలో ఇంతటి భద్రతా వైఫల్యమా అని కూడా కొందరు సోషల్‌ మీడియాలో విమర్శిస్తున్నారు. కొంతమంది మాత్రం ‘వి మిస్‌ యూ జార్వో’ అని పోస్టులు పెడుతున్నారు.

  - ఈనాడు క్రీడా విభాగం 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని