Ranchi Test: రాంచీ టెస్టు.. బుమ్రాకు విశ్రాంతినిస్తారా?.. కేఎల్‌ వస్తే వెళ్లేది అతనేనా?

ఐదు టెస్టుల సిరీస్‌లో (IND vs ENG) ఇంగ్లాండ్‌పై భారత్ 2-1 ఆధిక్యంలోఉంది. నాలుగో టెస్టు రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టులో మార్పులేంటి? కూర్పు ఎలా ఉండొచ్చు? 

Updated : 19 Feb 2024 14:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తొలి టెస్టులో ఓడినా... రెండు, మూడు టెస్టుల్లో గెలిచి 2 - 1 ఆధిక్యంతో సిరీస్‌ను గెలుచుకునే పనిలో పడింది టీమ్‌ ఇండియా. ఈ క్రమంలో రాంచీలో ఈ నెల 23 నుంచి నాలుగో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌ కోసం జట్టు కూర్పుఎలా ఉండనుంది. ఎవరెవరు విశ్రాంతి తీసుకుంటారు, తుది జట్టులోకి కొత్తగా ఎవరొస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం వర్క్‌ లోడ్‌, ఇంజూరీ మేనేజ్‌మెంట్‌. 

బుమ్రా ఉంటాడా?

భారత జట్టు టెస్టు సిరీస్‌లో ఆధిక్యంలో ఉంది అంటే దానికి కారణం జస్‌ప్రీత్‌ బుమ్రా. విశాఖ టెస్టులో ఘనవిజయం అతని బౌలింగ్‌ వల్లనే అని చెప్పాలి. ఇక మూడో టెస్టులోనూ ఎక్కువ ఓవర్లే వేశాడు. ఈ సిరీస్‌లో మూడు టెస్టుల్లో దాదాపు 81 ఓవర్లు వేశాడు. మొత్తం 17 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ అతడే. దీంతో నాలుగో టెస్టుకు విశ్రాంతినిస్తారని సమాచారం. ఆఖరిదైన ఐదో టెస్టు పిచ్‌ (ధర్మశాల) పేసర్లకు అనుకూలంగా ఉంటుందనే వార్తల నేపథ్యంలో రాంచీ పోరులో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వొచ్చని భోగట్టా. ఆ స్థానంలో జట్టులోకి ముకేశ్‌ కుమార్‌ వస్తాడు. ప్రస్తుతం రంజీల్లో బెంగాల్‌ జట్టుకు ఆడుతున్న అతను రాంచీ టెస్టు నాటికి జట్టులో చేరతాడట. ఒకవేళ రాంచీలోనే టీమ్‌ఇండియా సిరీస్‌ నెగ్గితే.. ఐదో మ్యాచ్‌లోనూ బుమ్రా ఆడకపోవచ్చు. 

వేటు అతనిపైనేనా?

ఫిట్‌నెస్‌ కారణంగా మూడో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ వైద్యబృందం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే నాలుగో మ్యాచ్‌కు వచ్చేస్తాడు. అప్పుడు గత రెండు టెస్టుల్లోనూ విఫలమైన రజత్‌ పటీదార్‌ను తప్పించడం ఖాయం. రెండు టెస్టుల్లో కలిపి 46 పరుగులే చేశాడు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 10 బంతులు ఆడినా పరుగుల ఖాతా కూడా తెరవలేదు. యశస్వి డబుల్‌ సెంచరీ, గిల్, సర్ఫరాజ్‌ హాఫ్‌ సెంచరీలు చేసిన ఇదే పిచ్‌పై ఆడేందుకు పటీదార్‌ ఇబ్బంది పడటం గమనార్హం. దీంతో కేఎల్‌ రాకతో నాలుగో స్థానాన్ని పటీదార్‌ ఖాళీ చేయాల్సిందే. 

జైస్వాల్‌ ఆడతాడా?

సిరీస్‌లో రెండు డబుల్‌ సెంచరీలతో దూకుడు మీదున్న కుర్ర ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ కూడా రాంచీ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టాక వెన్ను నొప్పితో మైదానం వీడాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి డబుల్‌ సెంచరీ చేశాడు. కానీ నాలుగో ఇన్నింగ్స్‌ ఫీల్డింగ్‌ సమయంలో అసౌకర్యంగా కనిపించాడు. దీంతో అతనికి విశ్రాంతినిచ్చి ధర్మశాల టెస్టుకల్లా ఫిట్‌గా ఉంచేలా మేనేజ్‌మెంట్‌ ప్రయత్నాల చేస్తోందని వార్తలొస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఓపెనర్‌గా దేవదత్‌ పడిక్కల్‌ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పటీదార్‌కు మరో ఛాన్స్‌ ఇవ్వాలనుకుంటే ఓపెనర్‌గా పంపి ప్రయోగం చేయొచ్చు. లేదంటే గిల్‌ను పైకి ప్రమోట్‌ చేయొచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని