Jasprit Bumrah: పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా

ఐపీఎల్‌లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్‌ప్రీత్‌ బుమ్రా. అతని బౌలింగ్‌లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు. 

Published : 12 Apr 2024 16:19 IST

టీ20 క్రికెట్ అంటే బ్యాట్స్‌మెన్ అనుకూల ఫార్మాట్. అందులోనూ ఐపీఎల్ (IPL) అంటే పరుగుల వరద పారాల్సిందే. ఇక్కడ ఎలాంటి బౌలర్‌కైనా ఎకానమీని అదుపులో ఉంచడం కష్టమే. కానీ ఒక్క జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మాత్రం ఇందుకు మినహాయింపు. అతడి బౌలింగ్‌లో వికెట్లు  కాపాడుకోవడమే గగనం. షాట్లు ఆడటం అంటే సవాలే.

గురువారం ఐపీఎల్‌లో ముంబయి (Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్ల మధ్య వాంఖడేలో మ్యాచ్. మొదట బెంగళూరు 196 పరుగులు చేసింది. అంత స్కోరును ముంబయి కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది. బెంగళూరు జట్టులో డుప్లెసిస్, పటీదార్, దినేశ్ కార్తీక్.. ముంబయి టీంలో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వీరి ధాటికి ఇరు జట్లలో మిగతా బౌలర్లందరి గణాంకాలు దెబ్బతిన్నాయి. కనీసం రెండు ఓవర్లు వేసిన బౌలర్లలో ఒక్క శ్రేయస్ గోపాల్ (ముంబయి) మాత్రమే 8 ఎకానమీతో సరిపెట్టుకున్నాడు. 

ముంబయి జట్టులో ఆకాశ్ మధ్వాల్ 4 ఓవర్లలో ఏకంగా 57 పరుగులు (ఎకానమీ 14.25) సమర్పించుకుంటే.. కొయెట్జీ 4 ఓవర్లలో 42 పరుగులిచ్చుకున్నాడు. ఇక బెంగళూరు జట్టులో ఏ బౌలరూ 10కి తక్కువ ఎకానమీ నమోదు చేయలేదు. సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఆకాశ్ దీప్‌ ఏకంగా 3.3 ఓవర్లలోనే 55 పరుగులు (ఎకానమీ 15.71) సమర్పించుకున్నాడు. సిరాజ్‌ (12.33), టాప్లీ (11.33)లకు కూడా బ్యాట్స్‌మెన్ బాదుడు తప్పలేదు. కానీ ఈ మ్యాచ్‌లో బుమ్రా గణాంకాలు చూస్తే షాకవ్వకుండా ఉండలేం. 4 ఓవర్లలో కేవలం 21 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఎకనామీ కేవలం 5.25. ఇలా పరుగుల వరద పారిన మ్యాచ్‌లో ఇలాంటి గణాంకాలు నమోదు చేయడం బుమ్రాకే చెల్లింది. మిగతా బౌలర్ల బంతులకు అలవోకగా షాట్లు ఆడిన డుప్లెసిస్, పటీదార్, కార్తీక్.. బుమ్రా బౌలింగ్‌లో మాత్రం జాగ్రత్తగా ఆడారు. అలా కాదంటే వికెట్టే నిలవదు మరి. 

కోహ్లీ సహా అయిదుగురిని పెవిలియన్ చేర్చాడు బుమ్రా. మిగతా బౌలర్లందరూ తేలిపోతే.. బుమ్రా ఒక్కడు ఇలా పొదుపుగా బౌలింగ్ చేయడం ఈ మ్యాచ్‌కే పరిమితం కాదు. ప్రతీ మ్యాచ్‌లో జరిగేది ఇదే. సన్‌రైజర్స్ జట్టు ముంబయిపై 277 పరుగులతో ఐపీఎల్ రికార్డు స్కోరు నమోదు చేసిన మ్యాచ్‌లో కూడా మిగతా బౌలర్లందరూ 12-17 మధ్య ఎకానమీ నమోదు చేస్తే.. బుమ్రా ఓవర్‌కు 9 పరుగుల చొప్పునే ఇచ్చాడు. అతడి స్థాయికి ఆ ఎకానమీ ఎక్కువే. ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో కలిపితే బుమ్రా ఎకానమీ 5.95 మాత్రమే. అతను 11.9 సగటుతో 10 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లున్నారు కానీ.. వాళ్లెవరూ ఎకానమీలో అతడికి దగ్గర్లో లేరు. ఎలాంటి విధ్వంసకర బ్యాటర్లయినా ముంబయితో మ్యాచ్‌ అంటే బుమ్రాను గౌరవించాల్సిందే. అతడి బంతులను ఆచితూచి ఆడాల్సిందే. ఐపీఎల్ మొత్తంలో కూడా అతడి ఎకానమీ 7.33 మాత్రమే కావడం విశేషం. లీగ్‌లో అతను ముంబయి తరఫున 125 మ్యాచ్‌లు ఆడి 22.56 సగటుతో 155 వికెట్లు పడగొట్టాడు.

కప్పు ముంగిట జోష్

ఐపీఎల్‌లో అయినా.. అంతర్జాతీయ క్రికెట్లో అయినా బుమ్రా పూర్తి ఫిట్‌గా ఉంటే ఇలాగే అద్భుతాలు చేస్తాడు. అయితే ఫాస్ట్ బౌలర్లందరిలాగే అతడికీ తరచూ ఫిట్‌నెస్ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. గత రెండేళ్లలో అతను మైదానంలో కంటే బయటే ఎక్కువ సమయం ఉన్నాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ ముంగిట ఫిట్‌నెస్ సాధించడానికి ముందు ఏడాదికి పైగా ఆటకు దూరమయ్యాడు. బుమ్రా అందుబాటులో లేకపోవడం 2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈసారి టీ20 ప్రపంచకప్ ముంగిట బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో కనిపిస్తుండటం, మంచి లయతో బౌలింగ్ చేస్తుండటం టీమ్ఇండియాకు ఉత్సాహాన్నిచ్చే విషయమే. 

ఐపీఎల్‌లో బుమ్రా బౌలింగ్ చూస్తున్న అభిమానులకు.. ప్రపంచకప్పులో అతను అద్భుతాలు చేస్తాడనే ఆశలు కలుగుతున్నాయి. బుమ్రా ఫిట్‌గా ఉన్నాడంటే చాలు ఎప్పుడైనా ఉత్తమ ప్రదర్శనే చేస్తాడు. అయితే అతణ్ని ఎప్పుడూ గాయాల భయం వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఐపీఎల్‌లో గాయం బారిన పడకుండా జాగ్రత్త వహించడం ప్రధానం. బీసీసీఐ కూడా ఈ విషయంలో అతణ్ని పర్యవేక్షిస్తూనే ఉంటుంది. ఇదే ఫిట్‌నెస్, ఫామ్‌ను బుమ్రా టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తే భారత్‌కు ఇక తిరుగుండదు.

- ఈనాడు క్రీడావిభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని