Jasprit Bumrah: పవర్‌ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్‌ప్రీత్ బుమ్రా

పంజాబ్‌పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు.

Updated : 19 Apr 2024 12:11 IST

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌పై నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చిన ముంబయి స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మూడు వికెట్లను పడగొట్టాడు. అతడు వేసిన తొలి ఓవర్‌లోనే సామ్‌ కరన్, రిలీ రొసోవ్‌ను ఔట్ చేశాడు. ఈ సీజన్‌లో అతడు తొలిసారి పవర్‌ ప్లేలో రెండు ఓవర్లు వేయడం గమనార్హం. బుమ్రాను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ పవర్‌ ప్లేలో తన పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘మేం ముందుగా అనుకున్నదానికంటే చాలా ఉత్కంఠగా మ్యాచ్‌ ముగిసింది. పంజాబ్‌ యువ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. టీ20ల్లో బ్యాటర్లదే పైచేయి. బౌలర్లకు చాలా కఠినమైన ఫార్మాట్‌. టైమ్‌ నిబంధనలతోపాటు ఇంపాక్ట్‌ రూల్‌ కూడా బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించడానికి కారణం. లోతైన బ్యాటింగ్‌ ఉండటం వల్ల బౌలర్లు వైవిధ్యంగా ప్రయత్నించాల్సి ఉంది. మ్యాచ్‌ ఆరంభంలో బంతి ఎక్కువగా స్వింగ్‌ అవుతుంది. పవర్‌ ప్లేలో కనీసం రెండు ఓవర్లు వేస్తేనే ఫలితం రాబట్టేందుకు అవకాశం ఉంటుంది. డెత్‌ ఓవర్లపై మా బౌలర్లకు ఎక్కువగా సూచనలు చేయను. ఆ సమయంలో వారే ఛాన్స్‌ తీసుకొనేందుకు వదిలేయాలి’’ అని బుమ్రా వ్యాఖ్యానించాడు. 

అశుతోష్ సూపర్: గెరాల్డ్‌ కోయిట్జీ

‘‘బోర్డుపై మంచి స్కోరే ఉంచాం. బౌలింగ్‌లో శుభారంభమే లభించింది. త్వరగా మ్యాచ్‌ను ముగిస్తామని భావించా. క్రికెట్‌ ఎలాంటి ఫన్నీ గేమ్‌ అనేది మరోసారి రుజువైంది. పంజాబ్‌ మిడిల్‌ఆర్డర్‌ చాలా బాగా ఆడింది. అశుతోష్‌ను ఔట్‌ చేయడంతోనే మేం మ్యాచ్‌పై తిరిగి పట్టు బిగించాం. చివరి ఓవర్లలో సరైన వ్యూహంతో బంతులేశాం. ఫలితం రాబట్టగలిగాం. నవతరం క్రికెటర్‌గా ఎలాంటి పాత్రనైనా పోషించడానికి సిద్ధంగా ఉండాలి. గతంలో నేను ఎక్కువగా పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేయలేదు. ఈ సారి మాత్రం దానిని పూర్తిగా ఆస్వాదించా. మిడిల్‌, డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేయడం చాలా ఇష్టం. కీలక సమయంలో వికెట్లు తీయడం బాగుంటుంది’’ అని ముంబయి బౌలర్‌ కోయిట్జీ తెలిపాడు. 

కొద్దిలో మ్యాచ్‌ను చేజార్చుకున్నాం: కరన్

‘‘ప్రస్తుత సీజన్‌లో మేం మరోసారి స్వల్పతేడాతో మ్యాచ్‌ను కోల్పోయాం. యువ ఆటగాళ్లు అశుతోష్, శశాంక్‌ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్‌లను చూశాం. ఇలా చివర్లో మ్యాచ్‌ను చేజార్చుకోవడమే చాలా బాధగా ఉంటుంది. ఆరంభంలో వికెట్లను కోల్పోవడమే మా ఓటమికి ప్రధాన కారణం. అశుతోష్, శశాంక్‌ మాలో ఆత్మవిశ్వాసం నింపారు. పేస్‌ బౌలింగ్‌లోనూ భారీ షాట్లు కొట్టడం అభినందనీయం. మాకు మంచి రోజులు వస్తాయనే నమ్మకం ఉంది. తదుపరి మ్యాచుల్లో విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌ రేసులోకి వస్తాం’’ అని పంజాబ్‌ కెప్టెన్ సామ్ కరన్ వ్యాఖ్యానించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని