Jasprit Bumrah: ఇలాంటి పిచ్‌లపై ఆడాలంటే... ఇంకా చురుగ్గా ఉండాల్సిందే: జస్‌ప్రీత్ బుమ్రా

కొత్తగా తయారు చేసిన పిచ్‌ను త్వరగా అర్థం చేసుకుంటేనే మెరుగైన ప్రదర్శన చేసేందుకు అవకాశం ఉంటుందని భారత పేసర్ బుమ్రా వ్యాఖ్యానించాడు.

Published : 06 Jun 2024 11:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: న్యూయార్క్‌ మైదానం పిచ్‌పై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ భారత పేస్ స్టార్‌ జస్‌ప్రీత్ బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. పిచ్‌ పరిస్థితులను ఎంత త్వరగా అర్థం చేసుకుంటే... అంత మంచిదని పేర్కొన్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా మూడు ఓవర్లలో కేవలం 6 పరుగులను మాత్రమే ఇచ్చి రెండు వికెట్లను తీశాడు. అతడినే ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

‘‘భారత్‌ నుంచి అమెరికా వచ్చి క్రికెట్ ఆడటం భలేగుంది. పిచ్‌ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా ఉండేది. ఇప్పుడు బంతి రెండువైపులా స్వింగ్‌ అవుతోంది. బౌలర్లకు సహకారం లభిస్తున్న వేళ నేనెలాంటి కంప్లైట్ చేయను. టీ20 ఫార్మాట్‌లో ఎంత త్వరగా పరిస్థితులను అలవాటు చేసుకోగలిగితే అంత మంచిది. అందుకే, గేమ్‌లో ఇంకాస్త చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ప్లాన్‌కు అనుగుణంగా బంతులేయడం అత్యంత కీలకం. ఇలాంటి పిచ్‌లపై ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉండాలి’’ అని బుమ్రా వ్యాఖ్యానించాడు. 

పిచ్‌పై బీసీసీఐ ఆందోళన!

అనూహ్యంగా బౌన్స్ అవుతూ.. బ్యాటర్లను ఇబ్బందికి గురి చేసిన పిచ్‌ తీరుపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు స్వల్ప గాయం కావడం వల్ల హాఫ్‌ సెంచరీ తర్వాత మైదానాన్ని వీడాడు. అయితే, అదేమీ తీవ్రమైన గాయం కాదని బీసీసీఐ వైద్య బృందం వెల్లడించింది. కానీ, ఇలాంటి ప్రమాదకరమైన పిచ్‌పై టీ20 మ్యాచ్‌ ఆడటం చాలా కష్టమని ఐసీసీ వద్ద బీసీసీఐ ప్రస్తావించినట్లు సమాచారం. ఇప్పటి వరకైతే అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ‘‘డ్రాప్‌ ఇన్‌ పిచ్‌ చాలా కొత్తగా ఉంది. కొంత పచ్చిక ఉన్నప్పటికీ.. అక్కడక్కడా క్రాక్స్‌ ఉన్నాయి.  సీమ్‌కు అనుకూలంగానే ఉంది. ఇలా కొత్తగా ఏదైనా ట్రాక్‌ను సిద్ధం చేసినప్పుడు ముందుగా టెస్టింగ్‌ కోసం ఇతర మ్యాచ్‌లను నిర్వహించాలి. బేటా వెర్షన్‌లో యాప్‌ను తీసుకొచ్చినట్లు ఉండాలి. కానీ, టీ20 క్రికెట్‌ కోసం ఈ పిచ్‌ తయారు చేసినట్లు అనిపించడం లేదు. దాంతోపాటు మిగతా నాలుగు ట్రాక్‌లూ ఇలాంటివే’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే స్టేడియంలో జూన్ 9న పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని