Jasprit Bumrah: ఏ విషయమైనా.. ఎవరికీ అతిగా చెప్పేందుకు ప్రయత్నించను: జస్‌ప్రీత్ బుమ్రా

ప్రాక్టికల్‌గా ఉండేందుకు ఇష్టపడే జస్‌ప్రీత్ బుమ్రా తన జూనియర్లకు అవసరమైన సమాచారం మాత్రమే ఇస్తాడు. అయితే, ఎలాంటి ప్రశ్న అడిగినా స్పందిస్తానని.. అతిగా మాత్రం బదులివ్వనని బుమ్రా వ్యాఖ్యానించాడు.

Published : 01 Jun 2024 14:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) భారత్‌ పేస్‌ విభాగాన్ని నడిపించడంలో జస్‌ప్రీత్ బుమ్రాదే (Jasprit Bumrah) కీలక పాత్ర. ఐపీఎల్ 2024 సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రా ‘వికెట్ల’ వేట కొనసాగాలని అభిమానుల ఆకాంక్ష. ఇవాళ బంగ్లాదేశ్‌తో టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ క్రమంలో జస్‌ప్రీత్ బుమ్రా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సిరాజ్‌, అర్ష్‌దీప్‌ వంటి పెద్దగా అనుభవం లేని పేసర్లతో కలిసి బుమ్రా ఈసారి ప్రపంచ కప్‌ ఆడుతున్నాడు. వారికి ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తారా? అనే ప్రశ్నకు బుమ్రా సమాధానం ఇచ్చాడు. 

‘‘ఎవరికైనా సరే అతిగా చెప్పడం చేయకూడదు. నా కెరీర్‌లో నేర్చుకున్న అంశమిదే. సాయం కోసం మన వద్దకు వచ్చేవారిని.. వారికున్న అనుమానాలు అడిగేందుకు అవకాశం ఇస్తా. ఏమీ అడగకుండా ఎక్కువగా సమాచారం ఇవ్వకూడదు. అలాచేస్తే.. వారిపై మరింత ఒత్తిడి పెట్టినట్లు అవుతుంది. ఇప్పుడు అమెరికాలో అడుగుపెట్టినవారంతా అదృష్టవంతులే. అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకొనేందుకు ఇదొక చక్కటి అవకాశం. వారికి కావాల్సినంత మేర సమాచారం ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. క్రికెట్ ప్రయాణంలో వారు నేర్చుకుంటూ ముందుకెళ్తారు. సమస్యలకు పరిష్కారం కోసం సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరు’’ అని తెలిపాడు. 

గేమ్‌ను ఆస్వాదించడం వల్లే.. 

‘‘వెన్ను నొప్పి కారణంగా చాన్నాళ్లు మైదానానికి దూరంగా ఉన్నా. మళ్లీ అడుగుపెట్టాక మ్యాచ్‌ను ఆస్వాదించడం అలవర్చుకున్నా. నేను అనుకున్నట్లు సరైన ప్రాంతంలో బౌలింగ్‌ చేయగలిగా. కొన్ని అంశాలు మనం అనుకున్నట్లు జరగవు. వాటిని పక్కన పెట్టేసి ఆటపైనే దృష్టిసారించా. గాయం నుంచి కోలుకున్నాక మళ్లీ కొత్తగా గేమ్‌ను ప్రారంభించా. నాకు క్రికెట్‌ అంటే ప్రాణం. ఫలితం ఎలా ఉన్నాసరే శాయశక్తులా ప్రయత్నం మాత్రం చేస్తా. ఆటను ఆస్వాదించడం వల్ల అనవసరంగా పడే ఒత్తిడిని తగ్గించుకోగలం. యార్కర్లను పక్కాగా వేసేందుకు చాలా కష్టపడ్డా. టెన్నిస్ బాల్, రబ్బర్ బాల్‌తో క్రికెట్‌ ఆడి ఇక్కడికి వచ్చా. స్నేహితులతో కలిసి సమ్మర్‌ క్యాంప్స్‌లో ఆడేటప్పుడు ఎక్కువగా యార్కర్లను వేయడంపైనే ప్రాక్టీస్ చేసేవాడిని. వికెట్లను తీయడంపైనే నా దృష్టి ఉంటుంది. ఫాస్ట్‌ బౌలింగ్‌తోపాటు వైవిధ్యంగా బంతులేయాలి. ఇప్పటికీ యార్కర్లపై సాధన చేస్తుంటా. ప్రతీది మనం మెరుగు కావడానికి కీలకం’’ అని బుమ్రా వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని