T20 WC 2024: వరల్డ్ కప్‌ జట్టులో హార్దిక్‌.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా

వరల్డ్ కప్‌ జట్టులో కొందరు యువ క్రికెటర్లకు అవకాశం రాలేదు. అనుకోకుండా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ జట్టులోకి వచ్చాడు. అతడి ఎంపికపై విమర్శలు వస్తున్నాయి.

Updated : 17 May 2024 10:08 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) కోసం భారత్‌ ప్రకటించిన జట్టుపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా వైస్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) ఎంపిక వెనుక ఒత్తిడి కీలక పాత్ర పోషించిందనే వ్యాఖ్యలు వినిపించాయి. ఐపీఎల్‌లో విఫలమైనప్పటికీ అతడిని తీసుకోవడం సరైంది కాదనే సూచనలు వచ్చాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్‌ సెలక్టర్ అజిత్‌ అగార్కర్‌కు పాండ్యను ఎంపిక చేయడం అసలు ఇష్టం లేదనే కథనాలు సోషల్ మీడియాలోనూ హల్‌చల్ చేశాయి. ఈ క్రమంలో బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా స్పందించారు. 

‘‘సెలక్షన్‌ కమిటీ ప్రకటించిన జట్టు సమతూకంగా ఉంది. సెలక్టర్లు కేవలం ఐపీఎల్‌ ఫామ్‌పైనే దృష్టి పెట్టలేదు. విదేశాల్లో సదరు ఆటగాడికి ఉన్న అనుభవంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నా. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు వినిపించాయి. కఠిన పిచ్‌లు ఉండే విండీస్ - యూఎస్‌ఏలో పొట్టి కప్‌ జరగనుంది. అనుభవంతోపాటు యువ క్రికెటర్లను ఎంపిక చేశాం. ఇందులో బీసీసీఐ కార్యదర్శిగా నా పాత్ర కేవలం సమాచారం ఇవ్వడం వరకే ఉంటుంది. కెప్టెన్‌, కోచ్‌, సెలక్షన్ కమిటీ నిర్ణయం మేరకే జట్టును ఎంపిక చేస్తాం’’ అని జైషా స్పష్టం చేశారు. 

అప్పుడు అగార్కర్‌ ఏమన్నాడంటే? 

టీ20 ప్రపంచ కప్‌ కోసం జట్టును ప్రకటించిన తర్వాత కొద్ది రోజులకు సెలక్షన్‌ కమిటీ చీఫ్‌ అజిత్‌ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హార్దిక్‌ ఎంపికపై వచ్చిన ప్రశ్నలకు అగార్కర్ స్పందిస్తూ.. ‘‘పేస్‌ ఆల్‌రౌండర్‌ విభాగంలో ఎక్కువ ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో పాండ్యను ఎంపిక చేయక తప్పలేదు. శివమ్‌ దూబె కూడా జట్టులో ఉన్నాడు. అతడికి విదేశాల్లో పెద్దగా అనుభవం లేదు’’ అని వెల్లడించాడు. ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబయి జట్టును నడిపిస్తున్న హార్దిక్‌ పాండ్య ఇటు బ్యాటింగ్‌, అటు బౌలింగ్‌లో గొప్ప ప్రదర్శనేమీ చేయలేకపోతున్నాడు. మరోవైపు పాండ్యను వరల్డ్ కప్‌ జట్టులోకి తీసుకున్నప్పటికీ.. అన్ని మ్యాచుల్లోనూ ఆడిస్తారనే గ్యారంటీ లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని