‘భారత్‌లో ధోనీ క్రేజ్‌ని చూసి ఆశ్చర్యపోయా.. మా స్టేడియంలోనూ 98 శాతం ఆ జెర్సీలే’

భారత్‌లో ధోనీ (MS Dhoni)కి ఉన్న క్రేజ్‌ చూసి ఆశ్చర్యపోయానని లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ కోచ్‌ జస్టిన్ లాంగర్‌ అన్నాడు.

Published : 25 May 2024 17:27 IST

ఇంటర్నెట్ డెస్క్: ఈసారి చెన్నై సూపర్‌కింగ్స్‌ ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా ఆ స్టేడియాలు సింహభాగం సీఎస్కే అభిమానులతో నిండిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni). అతడి ఆట చూడటానికే ఎంతోమంది స్టేడియాలకు వస్తారనడంలో సందేహం లేదు. ధోనీ కూడా ఈసారి బ్యాటింగ్‌లో మునపటిలా మెరుపులు మెరిపించాడు. దీంతో ఫ్యాన్స్‌ ఎంతో ఎంజాయ్‌ చేశారు. అయితే, కీలక దశలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓడిపోయి త్రుటిలో ప్లేఆఫ్స్‌ అవకాశాన్ని చేజార్చుకుంది.  ఇక.. భారత్‌లో ధోనీకి ఉన్న క్రేజ్‌ చూసి ఆశ్చర్యపోయానని లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ కోచ్‌ జస్టిన్ లాంగర్‌ (Justin Langer) అన్నాడు. ఐపీఎల్‌ కోసం గత రెండు, మూడు నెలలు భారత్‌లోనే ఉన్న లాంగర్‌ దేశవ్యాప్తంగా ధోనీకి అభిమానులు బ్రహ్మరథం పట్టిన తీరు చూసి ఆశ్చర్యపోయినట్లు ఓ క్రీడా ఛానల్ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు.

‘‘ధోనీకి ఉన్న క్రేజ్‌ గురించి ఇంతవరకు విన్నాను. ఈ సీజన్‌లో మేం (లఖ్‌నవూ) చెన్నై సూపర్‌కింగ్స్‌తో రెండుసార్లు ఆడాం. సీఎస్కే లఖ్‌నవూకు వచ్చినప్పుడు మా స్టేడియానికి (ఎకానా స్టేడియం) దాదాపు 50,000 మంది అభిమానులు వచ్చారు. నిజాయతీగా చెప్పాలంటే అందులో 48,000 మంది ధోనీ జెర్సీ నంబర్‌ 7 ధరించినవారే ఉన్నారు. దీన్ని నేను నమ్మలేకపోయాను. ఆపై మేము చెన్నైకి వెళ్లాము. అక్కడ 98 శాతం కాదు మొత్తం 100 శాతం ధోనీ అభిమానులే. భారత్‌లో ధోనీకి ఉన్న క్రేజ్‌ అసాధారణమైనది. ఇది నమ్మశక్యంగా లేదు’’ అని లఖ్‌నవూ కోచ్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని