Archery world cup: జ్యోతి పసిడి మెరుపులు

అంతర్జాతీయ వేదికలపై ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ.. మరోసారి సత్తాచాటింది. ఆర్చరీ ప్రపంచకప్‌ రెండో అంచె పోటీల్లో కాంపౌండ్‌ మహిళల జట్టు స్వర్ణంతో పాటు మిక్స్‌డ్‌ టీమ్‌ రజతం సొంతం చేసుకుంది.

Published : 26 May 2024 03:05 IST

ఆర్చరీ ప్రపంచకప్‌
జట్టు విభాగంలో స్వర్ణం
మిక్స్‌డ్‌ టీమ్‌లో రజతం 

యెచియాన్‌: అంతర్జాతీయ వేదికలపై ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ.. మరోసారి సత్తాచాటింది. ఆర్చరీ ప్రపంచకప్‌ రెండో అంచె పోటీల్లో కాంపౌండ్‌ మహిళల జట్టు స్వర్ణంతో పాటు మిక్స్‌డ్‌ టీమ్‌ రజతం సొంతం చేసుకుంది. శనివారం ఫైనల్లో జ్యోతి, పర్ణీత్‌ కౌర్, అదితి స్వామితో కూడిన భారత మహిళల జట్టు 232-226 తేడాతో తుర్కియే (హజల్, సుజర్, యువ)పై గెలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత అమ్మాయిల జట్టుకు ఇది వరుసగా మూడో ప్రపంచ కప్‌ పసిడి కావడం విశేషం. 57-56తో తొలి రౌండ్‌ను మొదలెట్టిన రెండో సీడ్‌ భారత త్రయం ఆ తర్వాత ఏ దశలోనూ ఏకాగ్రత కోల్పోలేదు. రెండో రౌండ్లో 59-56తో మరింత మెరుగ్గా రాణించింది. మూడో రౌండ్లో 58-58తో స్కోరు సమమైనా అప్పటికే ఓవరాల్‌గా భారత్‌ నాలుగు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. ఇదే జోరు కొనసాగించి చివరి రౌండ్లో 58-56తో విజయాన్ని అందుకుంది. నిరుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నుంచి వరుసగా ఆరు టోర్నీల్లోనూ జ్యోతి, పర్ణీత్, అదితి కలిసి టీమ్‌ స్వర్ణాలు గెలిచారు. మిక్స్‌డ్‌ టీమ్‌ తుదిపోరులో జ్యోతి-ప్రియాన్ష్‌ జోడీ 153-155తో ఒలీవియా-సలివాన్‌ (అమెరికా) చేతిలో పోరాడి ఓడింది. తొలి రౌండ్లో 39-37తో ఆధిక్యం సాధించిన భారత ద్వయం ఆ తర్వాత తడబడింది. వరుసగా 37-39, 39-40, 38-39తో పరాజయం పాలైంది. మరోవైపు కాంపౌండ్‌ పురుషుల వ్యక్తిగత కాంస్య పతక పోరులో ప్రథమేశ్‌ 148-148 (9-10)తో షూటాఫ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ మైక్‌ షులోసర్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు