Kane Williamson: ‘పిచ్‌ మార్పు’ వివాదం.. కేన్‌ విలియమ్సన్‌ కీలక వ్యాఖ్యలు

పిచ్‌పై వస్తున్న విమర్శలను న్యూజిలాండ్ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్ కొట్టి పడేశాడు. వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) తొలి సెమీస్‌ ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగా జరిగిన సంగతి తెలిసిందే.

Published : 16 Nov 2023 10:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) తొలి సెమీస్ సందర్భంగా చివరి నిమిషంలో పిచ్‌ను మార్చినట్లు బీసీసీఐపై (BCCI) మీడియా వేదికగా ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఇప్పటికే ఐసీసీ వివరణ ఇచ్చింది. తాజాగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా దీనిపై స్పందించాడు. ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగానే భారత్-కివీస్‌ తొలి సెమీస్‌ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ ‘పిచ్‌ వివాదం’పై కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘పిచ్‌ విషయంలో మాకెలాంటి ఇబ్బంది లేదు. ఈ పిచ్‌ మ్యాచ్‌ల కోసం వినియోగించినట్లు ఉంది. అయినా సరే చాలా బాగుంది. ఇరు జట్లకూ అనుకూలంగానే వ్యవహరించింది. తొలి అర్ధభాగంలో టీమ్‌ఇండియా బ్యాటర్లు దూకుడుగా పరుగులు రాబట్టారు. పరిస్థితులకు తగ్గట్టుగా వారు ఆటతీరును మార్చుకున్నారనిపిస్తోంది. అయితే, నాకౌట్‌ దశలో ఇలా ఇంటిముఖం పట్టడం బాధగా ఉంది. గత ఏడు వారాలుగా అద్భుతమైన ప్రయాణం సాగించాం. చిన్న చిన్న జ్ఞాపకాలు గుర్తుండిపోతాయి. అంతేకాకుండా నాణ్యమైన జట్టు చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నాం. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్‌ఇండియా అత్యుత్తమంగా కనిపిస్తోంది. 

ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తూ భారత్‌ టైటిల్‌ కోసం సిద్ధమైంది. గత ఓటముల నుంచి నేర్చుకుని ముందుకు సాగడం ఎంతైనా అవసరం. ఇప్పుడు టీమ్‌ఇండియా అదే చేస్తోంది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి లేకుండా దూసుకుపోతోంది. అప్రతిహతంగా సెమీస్‌కు చేరిన ఆ జట్టును ఓడించడం సవాల్‌తో కూడుకున్నదే. అయినా, మా ఆటగాళ్లు చివరి వరకు శ్రమించారు. వరుసగా విజయాలు సాధించిన భారత్‌ ఫైనల్‌లోనూ ఇదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుందనడంలో సందేహం లేదు’’ అని కేన్‌ విలియమ్సన్‌ వ్యాఖ్యానించాడు. టీమ్‌ఇండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత భారత్‌ 397/4 స్కోరు చేయగా.. అనంతరం న్యూజిలాండ్ 327 పరుగులకు ఆలౌటైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని