Cricket News: కేన్‌ దంపతులకు మూడో సంతానం.. పంత్‌ పునరాగమనంపై సన్నీ కీలక కామెంట్లు

Published : 28 Feb 2024 15:01 IST

ఇంటర్నెట్ డెస్క్: మూడోసారి తండ్రైన న్యూజిలాండ్‌ స్టార్‌ ప్లేయర్‌ కేన్‌ విలియమ్సన్ (Kane Williamson).. ఐర్లాండ్-అఫ్గాన్‌ టెస్టు వేదికలో మార్పు.. రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న రిషభ్‌ పంత్‌ పునరాగమనంపై భారత క్రికెట్‌ దిగ్గజం కీలక వ్యాఖ్యలు.. ఇలాంటి క్రికెట్ విశేషాలు.. 

ఆడబిడ్డకు జన్మనిచ్చిన కేన్‌ విలియమ్సన్ సతీమణి

న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, అతడి సతీమణి సారా రహీమ్‌ మరోసారి తల్లిదండ్రులయ్యారు. తాజాగా తన చిన్నారిని ఎత్తుకొని ఉన్న ఫొటోను కేన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ దంపతులకు ఇంతకుముందు ఇద్దరు పిల్లలు (మూడేళ్ల కుమార్తె, ఒకటిన్నరేళ్ల కుమారుడు) ఉన్నారు. ‘‘ప్రపంచంలోనే అందమైన చిన్నారికి స్వాగతం. సురక్షితమైన రాక కోసం ఎదురుచూశాం. మున్ముందు ప్రయాణం అద్భుతంగా ఉండనుంది’’ అని కేన్ తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చాడు. 


పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే.. కెప్టెన్సీ ఇవ్వాలి: సునీల్‌ గవాస్కర్

రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న రిషభ్‌ పంత్ ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. వచ్చే 22 నుంచి మొదలయ్యే 17వ సీజన్‌ ఐపీఎల్‌తో క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తాడని తెలుస్తోంది. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడి పాదాలు ఎలా కదులుతున్నాయనేది కీలకం. పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించి వస్తే మాత్రమే దిల్లీ కెప్టెన్సీ అప్పగించాలి. గతంలో ఎలా ఆరోగ్యంగా ఉన్నాడో.. ఇప్పుడూ అలానే ఉండాలి. అప్పుడే మనల్ని ఎంటర్‌టైన్‌ చేయగలడు. బ్యాటింగ్‌లో ఫామ్‌లోకి రావడానికి కాస్త సమయం పడుతుంది. ఇప్పటికే ప్రాక్టీస్‌ ప్రారంభించడం మంచి పరిణామం’’ అని సన్నీ వ్యాఖ్యానించాడు. 


స్కూల్‌ స్పోర్ట్స్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం టెస్టు వేదిక మార్పు

అఫ్గానిస్థాన్‌ - ఐర్లాండ్‌ జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌ ప్రారంభమైంది. కానీ, అనూహ్య పరిణామంతో వేదిక మారడం గమనార్హం. అబుదాబీలో స్థానిక పాఠశాల స్పోర్ట్స్‌ పోటీల నేపథ్యంలో ఇరు జట్ల మధ్య టెస్టు వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తొలుత జయేద్‌ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌ జరగాల్సింది. చివరికి టోలరెన్స్ ఓవల్‌ మైదానం వేదికగా మ్యాచ్‌ జరుగుతోంది. జయేద్‌ స్టేడియంలో 20వేల సీటింగ్ సామర్థ్యం కాగా.. టోలరెన్స్‌లో 12వేలు మాత్రమే. దీనిపై అబుదాబీ క్రికెట్‌, స్పోర్ట్స్‌ హబ్‌ సీఈవో వివరణ ఇచ్చారు. ‘మార్చి 1 నుంచి 3 వరకు స్పోర్ట్స్‌ ఛాంపియన్‌షిప్‌ ఉంది. దీంతో అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డుతో సంప్రదింపులు జరిపి వెంటనే వేదికను మార్చేశాం’’ అని మాట్‌ బుచర్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని