Hardik Pandya: బుమ్రా ఎక్కడ? తొలి ఓవర్‌ ఎందుకు వేయలేదు? హార్దిక్‌ వ్యూహాలపై మాజీల ఆశ్చర్యం!

కెప్టెన్‌గా తొలిసారి ముంబయిని నడిపిస్తున్న హార్దిక్‌ పాండ్య వ్యూహాలు గొప్పగా లేవనేది ఆ జట్టు అభిమానుల అభిప్రాయం. గుజరాత్‌తో మ్యాచ్‌లో లోటుపాట్లతో ఓటమి పాలైందని విమర్శలు చేశారు.

Updated : 25 Mar 2024 12:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన ముంబయి ఐపీఎల్ 17వ సీజన్‌ను ఓటమితో ప్రారంభించింది. చివరి ఓవర్‌ వరకూ సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. దీంతో హార్దిక్‌ పాండ్య నిర్ణయాలు, వ్యూహాలపై నెట్టింట విమర్శలు రేగాయి. ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (43), డేవాల్డ్ బ్రెవిస్ (46), తిలక్‌ వర్మ (25) కీలక ఇన్నింగ్స్‌లు ఆడినా విజయం మాత్రం దక్కలేదు. తొలుత బౌలర్లను వినియోగించుకున్న తీరుపై మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్, ఇర్ఫాన్ పఠాన్‌, కెవిన్ పీటర్సన్‌ అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్‌ సందర్భంగా కామెంట్రీ చేస్తూ.. బుమ్రా బదులు పాండ్య తొలి ఓవర్‌ వేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. తొలి ఓవర్‌ను స్టార్‌ పేసర్ బుమ్రా కాకుండా కెప్టెన్ హార్దిక్‌ వేశాడు. అతడు సంధించిన 8 బంతుల్లోనే గుజరాత్ ఓపెనర్లు 19 పరుగులు రాబట్టారు. 

కెవిన్‌ పీటర్సెన్.. ‘‘జస్‌ప్రీత్ బుమ్రా ఎందుకు తొలి ఓవర్‌ వేయలేదు?’’

సునీల్ గావస్కర్.. ‘‘ఇది చాలా మంచి ప్రశ్న. బుమ్రా పదునైన బౌలర్’’

దీంతో ఇర్ఫాన్ పఠాన్‌ ట్విటర్ వేదికగా ‘‘బుమ్రా ఎక్కడ?’ అంటూ పోస్టు పెట్టడంతో వైరల్‌గా మారింది. పాండ్య బ్యాటింగ్ ఆర్డర్‌పైనా పఠాన్‌ విమర్శలు గుప్పించాడు. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ను తప్పించుకోవడానికి టిమ్‌ డేవిడ్‌ను ముందు పంపించాడనే అర్థంలో వ్యాఖ్యలు చేశాడు. 

గుజరాత్ ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌ వేసిన బుమ్రా కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీశాడు. వృద్ధిమాన్‌ సాహాను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో బుమ్రా కేవలం 14 రన్స్‌కే 3 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు మొదట బౌలింగ్‌ ప్రారంభించిన పాండ్య మాత్రం వికెట్‌ లేకుండానే 3 ఓవర్లలో 30 పరుగులు సమర్పించాడు. దీంతో హార్దిక్‌ ప్రణాళికలపై విమర్శలు రేగాయి. ఇటువైపు లక్ష్య ఛేదనలోనూ నాలుగు బంతుల్లోనే 11 రన్స్‌ చేసిన హార్దిక్‌.. కీలక సమయంలో ఔట్‌ కావడంతో ముంబయికి ఓటమి తప్పలేదు. 

తీవ్ర నిరుత్సాహానికి గురైన రోహిత్‌.. 

రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్‌తో గాడిలో పడిన జట్టును మిగతా బ్యాటర్లు  వదిలేయడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. రోహిత్ ఔటైన సమయానికి ముంబయి స్కోరు 12.1 ఓవర్లలో 107/3. చివరి 47 బంతుల్లో ఆ జట్టు విజయానికి కావాల్సిన పరుగులు 62. టీ20ల్లో ఈజీగా ఛేదించగల స్కోరే. కానీ, చివరి వరకూ క్రీజ్‌లో ఉండాల్సిన కెప్టెన్ హార్దిక్‌ మాత్రం కీలక సమయంలో ఔటైపోయాడు. దీంతో మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ను వెనుక నుంచి పాండ్య హగ్‌ చేసుకున్నప్పటికీ.. రోహిత్‌ మాత్రం తీవ్ర నిరుత్సాహంతో కనిపించాడు. పాండ్యతో సీరియస్‌గా మాట్లాడుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఆ పక్కనే ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్‌ అంబానీ కూడా ఉన్నారు. రోహిత్‌ కెప్టెన్‌గా లేకపోయినప్పటికీ.. మ్యాచ్‌ సమయంలో హార్దిక్‌తోపాటు సహచరులకు సూచనలు ఇస్తూ కనిపించడం విశేషం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని