Kidambi Srikanth: శిఖరం నుంచి కిందికి.. గాయాలు, ఫామ్‌ లేమితో కిదాంబి శ్రీకాంత్ సతమతం

ఒకప్పుడు కిదాంబి శ్రీకాంత్‌ (Kidambi Srikanth) రాకెట్‌ పట్టుకుని కోర్టులోకి దిగితే పతకం ఖాయం అనేలా ఉండేది. ఇప్పుడు మ్యాచ్‌ గెలుస్తాడా లేదా అనేలా తయారైంది పరిస్థితి. ఎందుకు, ఏమైంది? 

Published : 24 Aug 2023 12:00 IST

ప్రపంచ పురుషుల బ్యాడ్మింటన్‌లో ఒక భారత షట్లర్ టాప్ 10లోకి రావడాన్ని కూడా విశేషంగా చెప్పుకొనే రోజులవి. అలాంటి సమయంలో ఓ యువ ఆటగాడు అనూహ్య ప్రదర్శనతో వడివడిగా ముందుకు దూసుకెళ్లాడు. ఎవరూ ఊహించని విధంగా ప్రపంచ నంబర్ వన్ అయ్యి సంచలనం సృష్టించాడు. వరుసగా టైటిళ్ల మీద టైటిళ్లు గెలిచాడు. అతడిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తర్వాత ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తాడని అనుకుంటే.. గాయాలు, ఫామ్ లేమి అతణ్ని వెనక్కి లాగేశాయి. ఇప్పుడు అతడి ప్రపంచ ర్యాంకు 19. టైటిళ్లు సాధించడం అటుంచితే.. టోర్నీ ఫైనల్ చేరడం కూడా గగనంగా మారిపోతోంది. ఈ ఉపోద్ఘాతం హైదరాబాదీ షటిల్ సంచలనం కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) గురించే..

విజయం సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం కష్టం అంటారు. కిదాంబి శ్రీకాంత్‌ సమస్య ఇదే. తనపై పెద్దగా అంచనాలు లేనపుడు అతను అద్భుతాలు చేశాడు. అత్యున్నత స్థాయిని అందుకున్నాడు. కానీ పెరిగిన అంచనాలను అందుకోలేక.. ఆ స్థాయిని నిలబెట్టుకోలేక కిందికి పడిపోయాడు. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో అప్పటికే సైనా, సింధు లాంటి మేటి క్రీడాకారులను చూసింది భారత్. సైనా లెక్కకు మిక్కిలి సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించింది. 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది. మరెన్నో విజయాలు సాధించింది.

ఇక సింధు గురించి చెప్పాల్సిన పనే లేదు. సైనా తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్‌లో వేగంగా ఎదిగి ఆమెను మించిన విజయాలు సాధించింది. ఒలింపిక్స్‌లో రజతం సాధించింది. ప్రపంచ ఛాంపియన్ కూడా అయింది. మరెన్నో టైటిళ్లు ఖాతాలో వేసుకుంది. కానీ పురుషుల సింగిల్స్‌లో మాత్రం ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోవడం మన షట్లర్లకు చాలా కష్టంగా ఉండేది. దశాబ్దాల కిందట ప్రకాశ్ పదుకొనే సాధించిన విజయాలనే గొప్పగా చెప్పుకునే వాళ్లం. అలాంటి సమయంలో శ్రీకాంత్ అనూహ్య విజయాలతో దూసుకెళ్లాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాడిగా పేరున్న లిన్ డాన్‌ను ఓడించి 2014 చైనా ఓపెన్‌లో ఛాంపియన్‌గా నిలిచి బ్యాడ్మింటన్ ప్రపంచంలో ప్రకంపనలు రేపాడు. 

ఆ విజయం గాలి వాటం కాదని రుజువు చేస్తూ తర్వాతి రెండు మూడేళ్లలో మరింత గొప్ప ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా 2017లో అతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇండొనేసియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్.. ఇలా ఒకే ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లతో అబ్బురపరిచాడు. అంతేగాక తర్వాతి ఏడాది ఏకంగా ప్రపంచ నంబర్ వన్ అయ్యాడు. దీంతో అతడికి లెజెండరీ స్టేటస్ వచ్చింది. తనపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

వెనక్కి లాగిన గాయాలు

ఆటలో ఎదుగుదల, ర్యాంకింగ్స్‌లో అందుకున్న స్థాయి చూసి శ్రీకాంత్ మరెన్నో గొప్ప విజయాలు సాధిస్తాడని భారత క్రీడాభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. కానీ గాయాలు అతడి కెరీర్‌కు బ్రేక్ వేశాయి. ప్రపంచ నంబర్ వన్ అయిన 2018లోనే అతడి మోకాలికి గాయం అయి కొన్ని నెలలు ఆటకు దూరమయ్యాడు. దాన్నుంచి కోలుకుని పునరాగమనం చేసినా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఫామ్ కోల్పోయాడు. తర్వాత కూడా అతణ్ని గాయాలు వెంటాడాయి. 2017లో ఒకే ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచిన వాడు.. తర్వాతి ఆరేళ్లలో ఇప్పటిదాకా ఆ టోర్నీల్లో ఒక్కటంటే ఒక్క టైటిల్ కూడా గెలవకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. 

2021లో తిరిగి ఫామ్ అందుకుని ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలవడంతో శ్రీకాంత్ గాడిన పడ్డాడని అనుకున్నారు. కానీ, తర్వాత మళ్లీ పతనం చవిచూశాడు. ర్యాంకింగ్స్‌లో అతడి స్థానం పడుతూ పోయింది. ఇంతకుముందులా అతణ్ని ఏ టోర్నీలోనూ ఫేవరెట్‌గా పరిగణించట్లేదు. ప్రణయ్, లక్ష్యసేన్ అతణ్ని దాటి ముందుకు వెళ్లిపోయారు. ప్రస్తుతం శ్రీకాంత్ ర్యాంకు 19 కాగా.. తాజాగా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగి తొలి రౌండ్లోనే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఒకప్పుడు వైభవం చూసిన ఆటగాడు ఈ స్థితికి చేరడం భారత బ్యాడ్మింటన్ ప్రేమికులను నిరాశకు గురి చేస్తోంది. కెరీర్లో ఈ దశ నుంచి శ్రీకాంత్ ఎలా పుంజుకుంటాడో చూడాలి.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని