KL Rahul - Mayank Yadav: పేస్ సంచలనం మయాంక్‌ గాయంపై కేఎల్ రాహుల్‌ కీలక అప్‌డేట్

కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్‌నవూ తన సొంత మైదానంలో ఓటమిని చవిచూసింది. అన్ని విభాగాల్లో రాణించిన దిల్లీ రెండు పరాజయాల తర్వాత విజయం సాధించింది.

Published : 13 Apr 2024 10:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో లఖ్‌నవూ రెండో ఓటమిని చవిచూసింది. సొంతమైదానం ఏకనా స్టేడియం వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సందర్భంగా తమ పేస్ సంచలనం మయాంక్‌ యాదవ్‌ (Mayank Yadav) గాయంపై లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) బిగ్‌ అప్‌డేట్ ఇచ్చాడు. తమ ఓటమికిగల కారణాలనూ వెల్లడించాడు.

‘‘మయాంక్‌ పరిస్థితి మరీ దారుణంగా ఏమీ లేదు. ఫిట్‌నెస్‌ పరంగా ఫర్వాలేదు. వందశాతం ఫిట్‌గా ఉంటేనే మ్యాచ్‌లో ఆడించాలని అనుకున్నాం. అతడు సిద్ధంగా ఉన్నప్పటికీ.. రిస్క్‌ వద్దని విశ్రాంతినిచ్చాం. మరో రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. తప్పకుండా తిరిగి వచ్చి అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడనే నమ్మకం మాకుంది’’ అని కేఎల్ తెలిపాడు. లఖ్‌నవూ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు.

మేం 20 పరుగులు వెనుకబడ్డాం

‘‘దిల్లీతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ పరంగా వెనుకబడ్డాం. మరో 20 పరుగులు చేయాల్సింది. ఆరంభం బాగున్నా.. సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాం. మొదట్లో సీమర్లకు పిచ్‌ నుంచి సహకారం లభించింది. ఆ తర్వాత స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌ మాపై ఆధిపత్యం ప్రదర్శించాడు. కీలక సమయంలో వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ ఓవర్ తర్వాత స్పిన్‌ పెద్దగా తిరగడం లేదని అనుకున్నాం. నికోలస్ పూరన్ దూకుడుగా ఆడి ఒత్తిడి తెస్తాడని భావించాం. అతడు క్రీజ్‌లో కుదురుకుంటే ప్రమాదకరంగా మారతాడు. కానీ, అలా జరగలేదు. చివర్లో మా కుర్రాళ్లు రాణించారు కాబట్టే ప్రత్యర్థి ఎదుట ఆ లక్ష్యమైనా ఉంచగలిగాం. దిల్లీ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ బ్యాటింగ్ బాగా చేశాడు. పవర్‌ ప్లేలోనే వార్నర్‌ వికెట్‌ను సాధించాం. పంత్ - ఫ్రేజర్‌ మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఆదివారం మ్యాచ్‌ కోసం మేం సిద్ధం కావాలి. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని బరిలోకి దిగుతాం. షెడ్యూల్‌ కూడా కాస్త క్లిష్టంగా ఉంది. ఎండలతో ఆటగాళ్లు త్వరగా అలసిపోతారు. కోల్‌కతాతో మధ్యాహ్నం మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది’’ అని రాహుల్ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని