KL Rahul: గాయమే వరమైందా?పునరాగమనంలో రెచ్చిపోతున్న రాహుల్‌

విరామం తర్వాత మళ్లీ లయ అందుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు ఆటగాళ్లు. కానీ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) కథ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.

Published : 10 Oct 2023 13:13 IST

సాధారణంగా ఒక క్రికెటర్‌కు పెద్ద గాయం అయి, కొన్ని నెలల పాటు ఆటకు దూరమైతే.. పునరాగమనంలో ఇబ్బంది పడతాడు. గాయం నుంచి కోలుకున్నా సరే, దాని ప్రభావం ఆ తర్వాత కూడా కొనసాగుతుంటుంది. మళ్లీ గాయపడతామేమో అన్న భయం వెంటాడి.. ఆటతీరు మీద కూడా ప్రభావం పడుతుంటుంది. విరామం తర్వాత మళ్లీ లయ అందుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు ఆటగాళ్లు. కానీ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) కథ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. గాయం కారణంగా అయిదు నెలల పాటు ఆటకు దూరమైన రాహుల్‌.. పునరాగమనంలో రెచ్చిపోతున్నాడు. కెరీర్‌ ఉత్తమ ఫామ్‌తో ఆశ్చర్యపరుస్తున్నాడు.

8 వన్డేలు.. 7 ఇన్నింగ్స్‌లు.. 402 పరుగులు.. 100.50 సగటు.. ఒక శతకం.. 3 అర్ధశతకాలు.. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన తర్వాత కేఎల్‌ రాహుల్‌ గణాంకాలివి. దీన్ని బట్టే అతను ఎలా చెలరేగిపోతున్నాడో అర్థమవుతుంది. కెరీర్లో ఎప్పుడూ అతను ఇంత నిలకడ చూపించింది లేదు. తనపై అసలేమాత్రం అంచనాలు లేని స్థితిలో అతను గొప్ప ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023)లో భారత్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో రాహులే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కావడం విశేషం. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి భారత్‌ పీకల్లోతు కష్టాల్లో పడిన స్థితిలో కోహ్లితో కలిసి గొప్పగా పోరాడి జట్టును గెలిపించాడు. గెలుపు పరుగులు చేసే వరకు అతను క్రీజును వదల్లేదు. 97 పరుగులతో అజేయంగా నిలిచిన రాహుల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. పరిస్థితులకు తగ్గట్లు అతను మొదట్లో చూపించిన సంయమనం, ఆ తర్వాత సమయోచితంగా షాట్లు ఆడిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్పిన్‌ పిచ్‌పై ఆసీస్‌ ఉత్తమ స్పిన్నర్‌ జంపాను అతను అలవోకగా ఎదుర్కొన్నాడు. ప్రపంచకప్‌ కంటే ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ అతను సత్తా చాటాడు. అతడి సారథ్యంలోనే భారత్‌ వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకుంది. 58 నాటౌట్, 52, 26.. సిరీస్‌లో అతడి స్కోర్లివి. ఇక తన పునరాగమన టోర్నీ అయిన ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌పై 111 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ ఆడాడు రాహుల్‌. శ్రీలంకపైనా 39 పరుగులతో సత్తా చాటాడు. ఇలా తిరిగి జట్టులోకి వచ్చినప్పటి నుంచి అతను నిలకడగా రాణిస్తున్నాడు. నిలకడ లేమితో పాటు స్ట్రైక్‌ రేట్‌ విషయంలో ఒకప్పుడు బాగా విమర్శలు ఎదుర్కొన్న రాహుల్‌.. ఇప్పుడు ఆ విషయంలోనూ గాడిన పడ్డాడు. పునరాగమనంలో అతడి స్ట్రైక్‌ రేట్‌ 92.41గా ఉంది.

విరామం మంచే చేసింది

ఐపీఎల్‌ (IPL)లో లఖ్‌నవూ తరఫున ఆడుతూ రాహుల్‌ ఓ మ్యాచ్‌లో గాయపడ్డాడు. తొడ దగ్గర పెద్ద గాయమే కావడంతో అతను ఐపీఎల్‌ నుంచి వైదొలిగాడు. తర్వాత శస్త్రచికిత్స చేయించుకుని నాలుగు నెలల పాటు జాతీయ క్రికెట్‌ అకాడమీలో గడిపాడు. ఇలా గాయపడ్డానికి ముందు రాహుల్‌ ప్రదర్శన ఆశాజనకంగా లేదు. నిలకడగా రాణించలేక జట్టులో తన స్థానాన్ని అతను ప్రశ్నార్థకం చేసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆశించిన వేగంతో ఆడకపోవడంపైనా విమర్శలు ఎదుర్కొన్నాడు. జట్టు నుంచి అతణ్ని తప్పించాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి ఓ దశలో. ప్రపంచకప్‌ ముంగిట రాహుల్‌ ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొనడంతో అతణ్ని ప్రపంచకప్‌ జట్టులోకి ఎంపిక చేయడం అవసరమా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఆసియా కప్‌ జట్టులోకి ఎంపికయ్యాక కూడా ఫిట్‌నెస్‌ సమస్యలు తిరగబెట్టి అతను తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో అతడి పట్ల వ్యతిరేకత ఇంకా పెరిగింది. కానీ పాక్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అతను అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. గాయం నుంచి కోలుకున్నాక జాతీయ క్రికెట్‌ అకాడమీలో అతను తన బ్యాటింగ్‌ మీద బాగానే శ్రమించినట్లున్నాడు. మానసికంగా కూడా దృఢంగా మారిన సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా విరామం ఆటను సమీక్షించుకోవడానికి బాగానే ఉపయోగపడ్డట్లు కనిపిస్తోంది. రాహుల్‌ ఇదే నిలకడను కొనసాగిస్తే ప్రపంచకప్‌లో భారత్‌కు గొప్ప మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని