Team India Head Coach: ‘‘ఐపీఎల్‌లో కంటే భారత కోచ్‌గా 1000 రెట్ల రాజకీయాలు ఎదుర్కోవాలి’’

టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌ పదవి కోసం వేట మొదలైంది. రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్తవారిని నియమించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది.

Updated : 24 May 2024 10:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియా జట్టు శిక్షణ బాధ్యతలను నిర్వర్తించిన జస్టిన్‌ లాంగర్..  టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ పదవి రేసులోనూ ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తర్వాత ఈ పదవిని చేపట్టేందుకు లాంగర్‌తోపాటు స్టీఫెన్ ఫ్లెమింగ్‌, గౌతమ్ గంభీర్‌ పేర్లు బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు లాంగర్‌ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ తనకు ఓ కీలక విషయాన్ని చెప్పినట్లు అతడు వెల్లడించాడు. 

‘‘ఆస్ట్రేలియా జట్టుకు నాలుగేళ్లపాటు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించా. చాలా అలసిపోయా. జాతీయ టీమ్‌ను నడిపించడం తేలికైన విషయం కాదు. దీని గురించి కేఎల్ రాహుల్‌తో మాట్లాడా. ఆ సందర్భంలో ‘నువ్వు ఐపీఎల్‌ జట్టు కోచ్‌గా ఎంత ఒత్తిడి, రాజకీయాలను ఎదుర్కొని ఉంటావో.. భారత ప్రధాన కోచ్‌గా వాటికి 1000 రెట్లు అధికంగా తట్టుకోవాల్సి ఉంటుంది’ అని చెప్పాడు. అది మంచి సలహాగా భావిస్తున్నా. నేను కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉంటుందని ఊహించా’’ అని లాంగర్‌ తెలిపాడు. ద్రవిడ్‌ తర్వాత ఈ బాధ్యతలు చేపట్టేవారు 2027 వన్డే ప్రపంచ కప్‌ వరకు కోచ్‌గా కొనసాగాలి. సంవత్సరంలో దాదాపు 10 నెలల పాటు భారత జట్టుకే సమయం వెచ్చించాల్సి ఉంటుంది. 

నలుగురు స్పిన్నర్ల ఎంపిక మంచిదే: గ్రేమ్ స్వాన్

టీ20 ప్రపంచ కప్‌ జూన్ 2 నుంచి (భారత కాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది. బీసీసీఐ ఇప్పటికే టీమ్‌ఇండియా స్క్వాడ్‌ను ప్రకటించింది. ఇందులో నలుగురు స్పిన్నర్లకు చోటు కల్పించింది. కొందరు మాజీలు ఇది సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానిస్తుండగా.. మరికొందరు మాత్రం సమర్థించారు. ఇలాంటి వారిలో ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్‌ స్వాన్ ఉన్నాడు. ‘‘భారత సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం బాగుంది. నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం మంచిదే. కరేబియన్‌ పిచ్‌లపై స్లో బౌలర్లే కీలక పాత్ర పోషిస్తారు’’ అని వ్యాఖ్యానించాడు. భారత జట్టులో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ స్పిన్‌ ఆల్‌రౌండర్లు కాగా.. కుల్‌దీప్‌ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ స్పెషలిస్ట్‌ స్పిన్‌ బౌలర్లుగా ఎంపికైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని