Kolkata Vs Hyderabad: ఔటైన బ్యాటర్‌కు ఫ్లైయింగ్‌ కిస్‌.. కోల్‌కతా స్టార్‌కు భారీ జరిమానా

ప్రత్యర్థి జట్ల ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే భారీ మొత్తం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని క్రికెటర్లకు తెలుసు. అయితే, హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మాత్రం కోల్‌కతా ప్లేయర్‌ ఆ విషయం మరిచినట్లు ఉన్నాడు. 

Published : 24 Mar 2024 10:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించడానికి కారణం యువ బౌలర్‌ హర్షిత్ రాణా. చివరి ఓవర్‌లో హైదరాబాద్‌కు 13 పరుగులు అవసరమైన క్రమంలో కేవలం 8 రన్స్‌ మాత్రమే ఇచ్చి తన జట్టును గెలిపించాడు. కీలకమైన క్లాసెన్‌తోపాటు షహబాజ్‌ వికెట్లను తీశాడు. అంతకుముందు ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్ (32)ను కూడా రాణా ఔట్ చేశాడు. అయితే, మయాంక్‌ పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో రాణా కాస్త అనుచితంగా ప్రవర్తించాడు. నేరుగా అతడికే ప్లైయింగ్‌ కిస్‌ ఇచ్చి సెండాఫ్ పలికాడు. క్లాసెన్ విషయంలోనూ ప్రవర్తనానియమావళిని ఉల్లంఘించాడు. దీంతో ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రకారం అతడికి భారీ జరిమానా పడింది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు కీలక ప్రకటన జారీ చేశారు.

‘‘కోల్‌కతా బౌలర్‌ హర్షిత్ రాణాకు 60 శాతం మ్యాచ్‌ ఫీజ్‌లో జరిమానా పడింది. ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్‌తో మ్యాచ్‌ సమయంలో రాణా ఆర్టికల్ 2.5 లెవల్‌ 1 నేరాలకు పాల్పడ్డాడు. దీంతో మ్యాచ్‌ రిఫరీ ఆదేశాల మేరకు 10 శాతం, 50 శాతం లెక్కన రెండు తప్పిదాలకు జరిమానా విధించాం. మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్’’ అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. 

రాణా తీరు సరికాదు: గావస్కర్

సీనియర్‌ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ ఔటైన తర్వాత హర్షిత్ రాణా ప్లైయింగ్‌ కిస్‌ ఇవ్వడం సరికాదని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. ‘‘అతడు అలా చేయాల్సింది కాదు. ఎవరైనా బ్యాటర్‌ తన బౌలింగ్‌లో సిక్స్‌లు కొట్టి ఇలానే చేస్తే ఎలా ఉంటుంది? క్రికెట్‌లో ఇలాంటి చిల్లర చేష్టలు ఉండకూడదు. అయితే, అతడి వయసు కారణంగా చేసి ఉండొచ్చు. దానిని అర్థం చేసుకోగలను. కానీ, నీ సంబరాలను జట్టుతో చేసుకుంటే బాగుంటుంది. ప్రత్యర్థి పట్ల ఇలాంటి వేషాలు వేయడం మంచిది కాదు’’ అని హితవు పలికాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని