Sunil Narine: ఓరి‘నరైనో’.. బ్యాటుతో రెచ్చిపోతున్న విండీస్ స్పిన్నర్

ప్రత్యర్థి సొంత మైదానాల్లో దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టడం అతడి ప్రత్యేకత. గత సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపని ఈ కోల్‌కతా ఆటగాడు మళ్లీ బ్యాట్‌తో అదరగొట్టేస్తున్నాడు.

Published : 05 Apr 2024 00:05 IST

సునీల్ నరైన్ (Sunil Narine).. ఈ పేరు చెబితే ఐపీఎల్ జట్లు బెంబేలెత్తిపోతున్నాయి. కానీ ఇప్పుడు భయపడుతోంది అతడి స్పిన్ మాయాజాలానికి కాదు. అతను బ్యాటుతో సాగిస్తున్న విధ్వంసానికి. లోయరార్డర్ బ్యాటర్ అయిన అతను.. ఓపెనర్‌గా వచ్చి రెచ్చిపోతున్న తీరు అనూహ్యం. వరుసగా రెండో మ్యాచ్‌లో అతను బ్యాటుతో జట్టుకు విజయం సాధించిపెట్టడంతో రాబోయే మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లు అతడికి అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రచించాల్సిన పరిస్థితి.

ఐపీఎల్-17 తొలి మ్యాచ్‌లో ఓడినా, రెండో మ్యాచ్ గెలిచిన ఉత్సాహంలో సొంతగడ్డపై మార్చి 29న కోల్‌కతాతో మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది బెంగళూరు. కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్ (83 నాటౌట్) ఆడడంతో ప్రత్యర్థికి 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆర్సీబీ. విజయం తమ జట్టుదే అని బెంగళూరు అభిమానులు ధీమాగా ఉన్నారు. కానీ కోల్‌కతా ఇన్నింగ్స్ మొదలైన అరగంటలో వాళ్లందరూ చల్లబడిపోయారు. స్పిన్ బౌలరైన సునీల్ నరైన్ ఓపెనర్‌గా దిగి కేవలం 22 బంతుల్లోనే 47 పరుగులు చేసి మ్యాచ్‌ను నైట్‌రైడర్స్ వైపు తిప్పేశాడు. ఈ ఇన్నింగ్స్ గాలివాటం కాదని రుజువు చేస్తూ.. తర్వాతి మ్యాచ్‌లో మరింతగా రెచ్చిపోయాడు. విశాఖపట్నంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై నరైన్ ప్రతాపం మామూలుగా లేదు. 39 బంతుల్లోనే 85 పరుగులు సాధించి డీసీని మ్యాచ్‌లో లేకుండా చేసేశాడు. 21 బంతుల్లోనే అతడి అర్ధశతకం పూర్తయింది. నోకియా, ఇషాంత్ శర్మ లాంటి ప్రపంచస్థాయి బౌలర్లకు చుక్కలు చూపించాడు. నరైన్ హిట్టింగ్ చేయడం కొత్తేమీ కాదు కానీ.. కొన్ని షాట్లు ఆడి ఔటైపోతుంటాడు. కానీ ఈ సీజన్లో లాంగ్ ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. దిల్లీపై 13వ ఓవర్ వరకు అతను క్రీజులో నిలిచాడు. ఇంకో రెండు మూడు షాట్లు సరిగా కనెక్ట్ అయి ఉంటే అతడి సెంచరీ కూడా పూర్తయ్యేది. డీసీతో మ్యాచ్ చూశాక అన్ని జట్లూ నరైన్ విషయంలో అప్రమత్తమై ఉంటాయనడంలో సందేహం లేదు. 

ఈ మార్పు వెనుక అతను..

నరైన్ ప్రధానంగా స్పిన్నర్. అతణ్ని వెస్టిండీస్ జట్టులో కానీ, ఐపీఎల్‌లో కానీ ఒకప్పుడు ఎవరూ ఆల్‌రౌండర్‌గా చూసేవారు కాదు. 9, 10 స్థానాల్లో అతను బ్యాటింగ్ చేసేవాడు. అయితే 2017 ఐపీఎల్‌లో అప్పటి కోల్‌కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్.. నరైన్‌తో ఎవ్వరూ ఊహించని ప్రయోగం చేశాడు. తాను ఓపెనర్‌గా తప్పుకుని.. క్రిస్ లిన్‌తో కలిసి ఆ సీజన్లో నరైన్‌తో ఓపెనింగ్ చేయించాడు. ఇది సత్ఫలితాలనే ఇచ్చింది. తన వికెట్‌కు అంతగా ప్రాధాన్యం లేకపోవడంతో నరైన్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ కొన్ని మ్యాచ్‌ల్లో జట్టుకు అదిరే ఆరంభాలనిచ్చాడు. ఆ సీజన్లో ఒక అర్ధసెంచరీ సహా 224 పరుగులు చేశాడు నరైన్. అతడి స్థాయికి అవి ఎక్కువ పరుగులే. ఆ సీజన్లో నరైన్ ఓపెనింగ్ ప్రయోగం ఫలించినా.. తర్వాతి సీజన్‌కు అతను తిరిగి లోయరార్డర్‌కు వెళ్లిపోయాడు. 2018లో గంభీర్ కోల్‌కతా జట్టును వీడి దిల్లీకి వెళ్లిపోవడంతో నరైన్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ పట్టించుకోలేదు. అప్పట్నుంచి కేవలం బౌలర్ పాత్రకే పరిమితం అవుతూ వచ్చాడు. అయితే గత రెండు సీజన్లలో లఖ్‌నవూ జట్టుకు మెంటార్‌గా ఉన్న గంభీర్.. ఈ సీజన్‌కు అదే పాత్రలో నైట్‌రైడర్స్‌కు మారడంతో తన దృష్టి నరైన్ మీద పడింది. ఒకప్పుడు కెప్టెన్‌గా చేసిన ప్రయోగాన్ని మెంటార్‌గా రిపీట్ చేశాడు. ఈసారి ఆ ప్రయోగం ఇంకా గొప్ప ఫలితాలను ఇస్తోంది. నరైన్ స్పిన్‌ బౌలింగ్‌లో ఒకప్పటి మాయాజాలం లేకపోయినా.. బ్యాటింగ్‌లో చెలరేగుతూ జట్టులో తన విలువను పెంచుకుంటున్నాడు. మరి ఈ సీజన్ అంతా నరైన్ మెరుపులు ఇలాగే కొనసాగుతాయేమో చూడాలి.

విండీస్ పట్టించుకుంటుందా?

వెస్టిండీస్‌ క్రికెటర్లలో ఎంత ప్రతిభ ఉన్నా.. ఆ దేశ బోర్డు మాత్రం సరిగా ఉపయోగించుకోదు. గేల్, పొలార్డ్, బ్రావో, రసెల్, నరైన్.. ఇలా ఎందరో మేటి క్రికెటర్ల సేవలను ఆ జట్టు పూర్తి స్థాయిలో వాడుకోలేదు. కాంట్రాక్టులు, జీతాల విషయంలో బోర్డు తమ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించకపోవడంతో చాలా ఏళ్లుగా విండీస్ క్రికెటర్లు ఫ్రాంఛైజీ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశానికి ఆడడం తగ్గించేశారు. లీగ్ క్రికెటర్లో వెస్టిండీస్ క్రికెటర్ల మెరుపులు చూస్తే వీళ్లంతా కలిసి దేశానికి ఆడితే కరీబియన్ క్రికెట్ కథే వేరుగా ఉంటుంది. కానీ బోర్డుతో గొడవ వల్ల ఎప్పుడు ఎవరు వెస్టిండీస్‌ జట్టులో ఉంటారో తెలియని పరిస్థితి. నరైన్ లాంటి మిస్టరీ స్పిన్నర్, విధ్వంసకర బ్యాటర్‌ టీ20ల్లో ఏ జట్టుకైనా ఎంతో విలువ చేకూరుస్తాడు. కానీ అతను 2019 తర్వాత వెస్టిండీస్‌కు ఆడనే లేదు. అయితే ఈ ఐపీఎల్‌లో నరైన్ ప్రదర్శన చూస్తున్న కరీబియన్ అభిమానులకు జూన్‌‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో విండీస్ తరఫునా ఇలాగే మెరుపులు మెరిపిస్తే చూడాలని ఆశ. మరి విండీస్ బోర్డు అతడితో మాట్లాడి జట్టులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందేమో చూడాలి.

- ఈనాడు క్రీడావిభాగం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని