Kolkata vs Hyderabad: రైడర్స్‌ విజయాలకు సన్‌రైజర్స్‌ ‘ఫైనల్’ చెక్‌ వేసేనా?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగుల్లో అదొకటి. దాదాపు రెండు నెలలపాటు సాగిన ఈ మెగా టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారమే ‘ఫైనల్‌’ మ్యాచ్‌. 

Updated : 25 May 2024 13:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తొలి క్వాలిఫయర్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకొనే మంచి అవకాశం హైదరాబాద్‌ ఎదుట నిలిచింది. ఇదే సీజన్‌లో కోల్‌కతా చేతిలో రెండుసార్లు ఎదురైన పరాభవాలకు ‘ఫైనల్‌’ విజయంతో చెక్ పెట్టేందుకు సన్‌రైజర్స్ సిద్ధమవుతోంది. ఆదివారం ‘చెపాక్‌’ వేదికగా కోల్‌కతా - హైదరాబాద్‌ జట్ల మధ్య ఐపీఎల్ 17వ ఎడిషన్‌ టైటిల్‌ పోరు జరగనుంది. 

‘మూడు’ ఎవరికి? 

  • గౌతమ్ గంభీర్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫైనల్‌కు చేరుకుంది. పాట్ కమిన్స్‌ నాయకత్వంలోని హైదరాబాద్‌ టైటిల్‌ రేసులో నిలిచింది.
  • ఐపీఎల్‌లో కోల్‌కతా రెండుసార్లు విజేతగా నిలిచింది. హైదరాబాద్‌ కూడా ఒకసారి సన్‌రైజర్స్‌గా, మరొకసారి డెక్కన్ ఛార్జర్స్‌గా టైటిల్‌ను దక్కించుకుంది. 
  • దాదాపు పాతిక కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్‌ (3/34) కీలక సమయంలో ఫామ్‌లోకి రావడం కోల్‌కతాకు కలిసొచ్చే అంశం. ఆ జట్టులోని ప్రతి ఒక్కరూ విజయం కోసం కంట్రిబ్యూషన్‌ చేస్తున్నారు.
  • హైదరాబాద్‌ గత కొన్ని మ్యాచుల్లో ఓపెనింగ్‌ ఇబ్బందిగా మారింది. ఆరంభంలో దూకుడుగా ఆడే క్రమంలో ట్రావిస్ హెడ్, అభిషేక్‌ శర్మలో ఒకరు త్వరగా పెవిలియన్‌కు చేరుతున్నారు. ‘పవర్‌ ప్లే’లో 125 పరుగులు చేసిన ప్రదర్శనను మరోసారి పునరావృతం చేస్తే  విజయం పక్కా. 
  • చెపాక్‌ పిచ్‌ స్పిన్నర్లకు సహకరిస్తుందని ‘రెండో క్వాలిఫయర్‌’ మ్యాచ్‌లో తేలింది. దీంతో కేకేఆర్‌ స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్‌ చక్రవర్తిలతో హైదరాబాద్‌ ఆటగాళ్లకు ముప్పు తప్పదు. కాసేపు కుదురుకుంటేనే పరుగులు చేయడం సులువుతుంది. 
  • ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్, వన్డే ప్రపంచ కప్‌.. ఇప్పుడు ఐపీఎల్‌ ఫైనల్‌కు తన జట్టును చేర్చిన కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ నిలిచాడు. ఆ రెండింట్లో విజేతగా నిలపగా.. ఇప్పుడు కూడా టైటిల్‌ను అందిస్తే హ్యాట్రిక్‌ సొంతమవుతుంది. 
  • కోల్‌కతా - హైదరాబాద్ ఇప్పటి వరకు 27సార్లు ముఖాముఖిలో తలపడ్డాయి. కేకేఆర్‌ 18, ఎస్‌ఆర్‌హెచ్‌ 9 మ్యాచుల్లో గెలిచాయి. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో నైట్‌రైడర్స్‌దే విజయం.
  • తొలి క్వాలిఫయర్‌లో హైదరాబాద్‌ బౌలింగ్‌ను చిత్తు చేయడంలో కోల్‌కతా బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ - వెంకటేశ్‌ అయ్యర్ కీలక పాత్ర పోషించారు. హాఫ్‌ సెంచరీలు సాధించారు. ఓపెనర్ సునీల్ నరైన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. 
  • గత 8 మ్యాచుల్లో ఆరుసార్లు చెపాక్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. అయితే, దీంతో టాస్‌ నెగ్గే టీమ్‌ బ్యాటింగ్‌కే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ. అయితే, వర్షం పడే సూచనలూ ఉన్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
  • ఒకవేళ వర్షం కారణంగా ఆదివారం మ్యాచ్ రద్దైనా.. రిజర్వ్‌డే ఉంది. అప్పుడూ జరగకపోతే మాత్రం కోల్‌కతా విజేతగా నిలుస్తుంది. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ కంటే కోల్‌కతాకే ఎక్కువ పాయింట్లు ఉండటం వల్ల విజేతను అలా తేలుస్తారు. 

తుది జట్లు (అంచనా)

కోల్‌కతా: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేశ్‌ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రి రస్సెల్, రమణ్‌దీప్‌ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్‌ చక్రవర్తి

హైదరాబాద్‌: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్‌ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియస్కాంత్, నటరాజన్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని