Sreesanth: ‘ఫిక్సర్‌’ వ్యాఖ్యలు.. శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు

మైదానంలో భారత మాజీ క్రికెటర్లు ప్రవర్తించిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో లీగ్‌ నిర్వాహకులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.

Updated : 08 Dec 2023 11:57 IST

ఇంటర్నెట్ డెస్క్: లెజెండ్‌ లీగ్ క్రికెట్ (LLC) మ్యాచ్‌ సందర్భంగా.. తనను ‘ఫిక్సర్‌’ అని గౌతమ్‌ గంభీర్‌ పేర్కొన్నాడంటూ ఆరోపణలు చేసిన భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌కు లీగల్‌ నోటీసులు జారీ అయ్యాయి. గంభీర్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడంతో ఎల్‌ఎల్‌సీ నిర్వాహకులు ఈ మేరకు శ్రీశాంత్‌కు నోటీసులిచ్చారు. డిసెంబర్‌ 6న ఇండియా క్యాపిటల్స్‌, గుజరాత్ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తున్న తనను ఉద్దేశించి గంభీర్‌ తీవ్ర పదజాలం వాడినట్లు శ్రీశాంత్ వీడియోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎల్‌ఎల్‌సీ మేనేజ్‌మెంట్ అసహనం వ్యక్తం చేసింది. టీ20 టోర్నమెంట్‌లో ఆడే కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించినందుకు శ్రీశాంత్‌కు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. పెట్టిన వీడియోలను తొలగిస్తేనే.. అతడితో మాట్లాడతామని ఎల్‌ఎల్‌సీ స్పష్టం చేసింది. ఈ వివాదానికి సంబంధించి ఫీల్డ్‌ అంపైర్‌ నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొంది.

శ్రీశాంత్‌ మరో పోస్టు వైరల్‌..

రెండు రోజుల కిందట ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిన ఘటన మరువకముందే శ్రీశాంత్ చేసిన మరో పోస్టు వైరల్‌గా మారింది. గురువారం ఎల్‌ఎల్‌సీ రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ సందర్భంగా ఇండియా క్యాపిటల్స్‌ కెప్టెన్ గౌతమ్ గంభీర్‌ను మణిపాల్ టైగర్స్‌ ఆటగాడు అమితోజ్‌ సింగ్‌ రనౌట్‌ చేశాడు. దీంతో అమితోజ్‌ను ప్రశంసిస్తూ శ్రీశాంత్ ‘‘అద్భుతమైన త్రో చేశావు. వెల్‌డన్‌ అమితోజ్‌’’ అంటూ ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు.

గంభీర్‌ వ్యాఖ్యలపై స్పందించిన శ్రీశాంత్ భార్య 

‘గంభీర్‌ నన్ను ఫిక్సర్‌, ఫిక్సర్‌ అని పిలుస్తూనే ఉన్నాడు. ప్రత్యక్ష ప్రసారమవుతున్న మ్యాచ్‌లో అతను నన్ను ఫిక్సర్‌ అన్నాడు. శాంతపరిచేందుకు ప్రయత్నించిన అంపైర్లతోనూ అతను అలాగే మాట్లాడాడు’’ అని శ్రీశాంత్ తన వీడియోల్లో ఆరోపించాడు.  దానికి సమాధానంగా గంభీర్‌ నవ్వుతూ ఉన్న ఫొటోను షేర్ చేసి ‘‘‘ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించాలని చూసినప్పుడు నవ్వుతూ ఉండాలి’’ అనే శీర్షిక పెట్టాడు. ఈ ఘటనపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి స్పందించారు. ‘‘భారత జట్టు కోసం ఇద్దరూ కలిసి ఆడాడు. శ్రీశాంత్‌ను గంభీర్‌ ఇలాంటి మాటలు అనడం షాక్‌కు గురి చేసింది. అతడి స్థాయిని దిగజార్చుకుని మరీ ఇలా వ్యాఖ్యానించడం దారుణం. శ్రీశాంత్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కూడా చాన్నాళ్లు అయింది. అయినా  అతడి పట్ల మైదానంలో ఇలాంటి ప్రవర్తన సరైంది కాదు’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని