Yash Thakur: యశ్ ఠాకూర్‌.. ధోనీలా మారదామని వచ్చి.. పేసర్‌గా అదరగొట్టి!

లఖ్‌నవూ పేస్‌ బౌలర్లు పెను సంచలనంగా మారారు. ఇదివరకు మయాంక్‌ యాదవ్ తన ఫాస్ట్‌తో బెంబేలెత్తించగా.. తాజాగా యశ్ ఠాకూర్‌ అదరగొట్టాడు.

Published : 08 Apr 2024 16:20 IST

ప్రత్యర్థి ఎదుట లక్ష్యం 164 పరుగులు.. తొలి వికెట్‌కు అర్ధశతకం బాది ఊపు మీదున్నారు ఆ జట్టు ఓపెనర్లు.. అప్పుడొచ్చాడు ఓ యువ పేసర్.. కీలకమైన వికెట్‌ను తీసి తన జట్టుకు జోష్‌ తెచ్చాడు. ఐదు వికెట్లతో మ్యాచ్‌నే మలుపు తిప్పేశాడు.. అతడే యశ్‌ ఠాకూర్. ఇప్పుడు పేసర్‌గా మనముందున్న యశ్‌కు తొలుత ధోనీని చూసి వికెట్‌ కీపర్‌ అవుదామని ఉండేదట.. కానీ, కోచ్‌ సూచనతో పేసర్‌గా మారాల్సి వచ్చింది. ఈ కుర్రాడి గురించి ఆసక్తికర విశేషాలివీ.. 

ఉమేశ్‌ ఆదర్శం..

అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్న యశ్‌ ఠాకూర్‌కు భారత పేసర్ ఉమేశ్‌ యాదవ్‌ ఆదర్శమని పలు సందర్భాల్లో చెప్పాడు. దేశవాళీ క్రికెట్‌లో విదర్భకు ఆడేటప్పటినుంచి ఉమేశ్‌ బౌలింగ్‌ యాక్షన్‌ను యశ్‌ అనుసరించేవాడు. అతడిలానే బంతులను సంధించడం ప్రారంభించాడు. అయితే, క్రికెట్‌ కెరీర్‌ తొలి నాళ్లల్లో యశ్ వికెట్‌ కీపర్‌ అవుదామని భావించాడు. దానికి కారణం ఎంఎస్ ధోనీ.. అతడిని చూసే ప్రాక్టీస్‌ చేయడం కూడా ప్రారంభించాడు. అప్పుడప్పడు నెట్స్‌లో బౌలింగ్‌ కూడా చేస్తుంటాడు. అలా బంతులను విసురుతున్న యశ్‌ను విదర్భ మాజీ కెప్టెన్, కోచ్‌ ప్రవీణ్‌ హింగనికర్ చూశాడు. ఫాస్ట్‌ బౌలర్‌గా మారమని సూచించాడు. 

రూ. 45 లక్షలకే.. 

తన కోచ్‌ సూచన మేరకు పేసర్‌గా అవతారం ఎత్తిన యశ్‌ ఠాకూర్‌ అందులోనూ సత్తా చాటాడు. డొమిస్టిక్‌లో విదర్భ తరఫున 22 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన యశ్‌ 67 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు దేశవాళీలో 48 టీ20ల్లో 69 వికెట్లు తీసిన అనుభవం ఉంది. దీంతో గతేడాది ఐపీఎల్‌ సీజన్‌కు ముందు జరిగిన వేలంలో లఖ్‌నవూ రూ.45 లక్షలు వెచ్చించి దక్కించుకుంది. ఆ సీజన్‌లో 9 మ్యాచుల్లో 13 వికెట్లు తీశాడు. 9.08 ఎకానమీతో బౌలింగ్‌ చేశాడు. ఇప్పుడీ ఎడిషన్‌లోనూ మంచి ఆరంభమే దక్కింది. మూడు మ్యాచుల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. 

తొలి బౌలర్‌ అతడే.. 

గుజరాత్‌తో మ్యాచ్‌లో పవర్‌ప్లే చివరి ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చాడు. శుభ్‌మన్‌ గిల్‌ను బౌల్డ్‌ చేసిన యశ్ ఠాకూర్‌.. లఖ్‌నవూకు తొలి బ్రేక్‌ ఇచ్చాడు. మరో పేసర్ మాయంక్‌ యాదవ్‌ గాయం కారణంగా మైదానం వీడటంతో నవీనుల్‌ హక్‌తో కలిసి యశ్‌ పేస్‌ భారాన్ని మోశాడు. మధ్యలో బిష్ణోయ్, కృనాల్ పాండ్య వికెట్లు తీసి లఖ్‌నవూకు బ్రేక్‌ ఇచ్చినా.. కీలకమైన బ్యాటర్లను ఔట్ చేసి స్వల్ప స్కోరు మ్యాచ్‌లో లఖ్‌నవూను పైచేయిగా నిలిపాడు. గిల్‌తోపాటు విజయ్ శంకర్, రాహుల్‌ తెవాతియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్‌ వికెట్లను తీశాడు. కేవలం 30 పరుగులను మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ఫైఫర్ తీసిన తొలి బౌలర్‌గా అవతరించాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి మెయిడిన్‌ చేయడం విశేషం. అందులో డేంజరస్‌ బ్యాటర్ రషీద్‌ ఖాన్‌ వికెట్‌ కూడా ఉంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు’ను సొంతం చేసుకున్నాడు. 

-ఇంటర్నెట్ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని