Bengaluru X Lucknow: నిప్పులు చెరిగిన మయాంక్‌.. బెంగళూరును ఓడించిన లఖ్‌నవూ

సొంతగడ్డపై బెంగళూరును లఖ్‌నవూ 28 పరుగుల తేడాతో ఓడించింది. 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 153 పరుగులకే ఆలౌట్‌ అయింది.  

Updated : 02 Apr 2024 23:58 IST

బెంగళూరు: ఐపీఎల్‌ 2024లో భాగంగా బెంగళూరుతో జరిగిన పోరులో లఖ్‌నవూ 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌట్‌ అయింది. బుల్లెట్‌ వేగంతో బంతులు విసురుతూ ఈ ఐపీఎల్‌లో ఆకర్షణగా నిలిచిన మయాంక్ యాదవ్ రెండో మ్యాచ్‌లోనూ సంచలన బౌలింగ్‌తో అదరగొట్టాడు. మూడు వికెట్లు (3/14) తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. బెంగళూరు బ్యాటర్లలో మహిపాల్ లోమ్రోర్ (33; 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్. రజత్ పటిదార్ (29), విరాట్ కోహ్లీ (22), డుప్లెసిస్ (19) పరుగులు చేశారు. మ్యాక్స్‌వెల్ (0), కామెరూన్ గ్రీన్ (9), అనుజ్ రావత్ (11), దినేశ్‌ కార్తిక్‌ (4) ఘోరంగా విఫలమయ్యారు. లఖ్‌నవూ బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హక్‌ 2, సిద్ధార్థ్‌, యశ్‌ ఠాకూర్‌, స్టాయినిస్‌ తలో వికెట్‌ తీశారు. మయాంక్ యాదవ్ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

18 పరుగులు.. నాలుగు వికెట్లు 

భారీ లక్ష్యఛేదనలో బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని మణిమారన్ సిద్ధార్థ్‌ వీడదీశాడు. అతడు కోహ్లీని ఔట్‌ చేసి ఐపీఎల్‌లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. అక్కడి నుంచి బెంగళూరు పతనం మొదలైంది. మయాంక్ యాదవ్‌ వేసిన ఆరో ఓవర్‌లో  తొలి బంతిని డుప్లెసిస్ ఎదుర్కొని సింగిల్ కోసం పరుగెత్తాడు. పడిక్కల్ చురుకైన ఫీల్డింగ్‌తో వికెట్లపైకి బంతిని విసరడంతో డుప్లెసిస్‌ వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ (0) నికోలస్‌ పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మయాంక్ తన తర్వాతి ఓవర్‌లో అద్భుతమైన బంతితో కామెరూన్‌ గ్రీన్‌ (9)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో 18 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది బెంగళూరు. 

అనుజ్ రావత్ సహకారంతో రజత్ పటిదార్‌ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. అనుజ్‌ను స్టాయినిస్‌ వెనక్కి పంపాడు. కాసేపటికే పటిదార్‌ను మయాంక్‌ ఔట్ చేశాడు. దీంతో బెంగళూరు 103 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. యశ్ ఠాకూర్‌ వేసిన 16 ఓవర్‌లో మహిపాల్ లోమ్రోర్‌  వరుసగా 6,4,6 బాదేయడంతో బెంగళూరు శిబిరంలో ఆశలు చిగురించాయి. నవీనుల్ హక్‌ బౌలింగ్‌లో దినేశ్‌ కార్తిక్‌ కేఎల్ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మయాంగ్‌ దగార్‌ను పూరన్‌ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. కాసేపటికే మహిపాల్ కూడా పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 19 ఓవర్‌లో చివరి రెండు బంతులకు సిరాజ్ (12) సిక్సర్లు బాదాడు. నవీనుల్ వేసిన చివరి ఓవర్‌లో సిరాజ్‌ పూరన్‌కు చిక్కడంతో బెంగళూరు ఆలౌటైంది.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (81; 56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. మార్కస్‌ స్టాయినిస్ (24), కేఎల్ రాహుల్ (20) పరుగులు చేశారు. చివర్లో నికోలస్ పూరన్ (40*; 21 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. బెంగళూరు బౌలర్లలో మ్యాక్స్‌వెల్ 2, రీస్ టాప్లీ, యశ్ దయాల్, సిరాజ్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

మ్యాచ్‌ విశేషాలు

  • ఈ సీజన్‌లో ఆలౌటైన మొదటి జట్టు బెంగళూరే.
  • చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీకిది 100వ టీ20 మ్యాచ్‌. 
  • ఐపీఎల్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న తొలి ఆటగాడిగా యయాంక్ యాదవ్ రికార్డు సృష్టించాడు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు