Lucknow X Chennai: అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్‌, డికాక్.. చెన్నైపై లఖ్‌నవూ ఘన విజయం

ఐపీఎల్‌ 2024లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ 8 వికెట్ల తేడాతో గెలిచింది. 177 పరుగుల లక్ష్యాన్ని లఖ్‌నవూ 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.  

Updated : 20 Apr 2024 00:00 IST

లఖ్‌నవూ: ఐపీఎల్‌ 2024లో చెన్నై (Chennai) వరుస విజయాలకు బ్రేక్‌ పడింది. సొంతమైదానంలో లఖ్‌నవూ (Lucknow) 8 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత చెన్నై 176 పరుగులకే కట్టడి చేసిన లఖ్‌నవూ.. అనంతరం 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (82: 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), డికాక్‌ (54 : 43 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌) చెలరేగి ఆడారు. చెన్నై బౌలర్లు ఈ మ్యాచ్‌లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, పతిరన ఒక్కో వికెట్ తీశారు. 

చెలరేగిన రాహుల్‌, డికాక్‌..

177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూకు ఓపెనర్లు రాహుల్‌ (KL Rahul), డికాక్‌ (De Kock) తొలి వికెట్‌కు 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి ఓవర్‌లో కేవలం 3 పరుగులు తీసిన లఖ్‌నవూ.. ఆతర్వాత రెచ్చిపోయింది. పవర్‌ ప్లే ముగిసే సరికి 54 పరుగులతో నిలిచింది. ఇద్దరు బ్యాటర్లు నిలకడగా ఆడతూ ఇన్నింగ్స్‌ నిర్మించారు. అడపాదడపా ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగారు. ఈ క్రమంలో 10 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 89 పరుగులు చేసింది. జడేజా వేసిన 11వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన రాహుల్‌ 31 బంతుల్లో అర్ధశతకం చేశాడు. మరోవైపు డికాక్‌ ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి హాఫ్‌ సెంచరీ చేశాడు. వీరిద్దరిని ఔట్‌ చేయడానికి చెన్నై బౌలర్లు విపరీతంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ జోడిని ముస్తాఫిజుర్‌ 134 పరుగుల వద్ద విడదీశాడు. 15వ ఓవర్‌ చివరి బంతికి డికాక్‌ కీపర్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మరో 27 పరుగుల తర్వాత పతిరన వేసిన 18వ ఓవర్‌ తొలిబంతికి జడేజా అద్భుతంగా క్యాచ్‌ పట్టడంతో రాహుల్‌ వెనుదిరిగాడు. అప్పటికే లఖ్‌నవూ విజయం ఖాయమైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టాయినిస్‌ (8*)తో కలిసి పూరన్‌ (23: 12 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌) లాంఛనాన్ని ముగించాడు.      

తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57*: 40 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌) అజింక్యా రహానె (36: 24 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌), మొయిన్‌ అలీ (30: 20 బంతుల్లో 3 సిక్స్‌లు) పరుగులు చేశారు. చివర్లో ధోనీ (28: 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) విరుచుకుపడ్డాడు.  లఖ్‌నవూ బౌలర్లలో కృనాల్‌ పాండ్య 2, మోసిన్‌ ఖాన్‌, యశ్‌ ఠాకూర్‌, రవి బిష్ణోయ్‌, స్టాయినిస్‌ ఒక్కో వికెట్ తీశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని