Mumbai vs Lucknow: చివరి మ్యాచ్‌లో ముంబయిపై లఖ్‌నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు

ఐపీఎల్‌ 2024లో భాగంగా తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ముంబయిపై లఖ్‌నవూ 18 పరుగుల తేడాతో గెలిచింది.  

Updated : 18 May 2024 01:01 IST

ముంబయి: ఐపీఎల్‌ 2024లో భాగంగా లీగ్‌ దశలో తన చివరి మ్యాచ్‌ను లఖ్‌నవూ విజయంతో ముగించింది. ముంబయితో జరిగిన పోరులో ఆ జట్టు 18 పరుగుల తేడాతో నెగ్గింది. 215 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులకు పరిమితం అయింది. రోహిత్‌ శర్మ (68: 38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), నమన్‌ ధీర్‌ (62*: 28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకాలతో చెలరేగారు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌, నవీనుల్‌ హక్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా, కృనాల్‌ పాండ్య, మోసిన్‌ ఖాన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ముంబయి బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్‌కు కొంతసేపు విరామం ఇచ్చారు.  

రోహిత్‌ చెలరేగినా..

215 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన ముంబయి తొలి వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం లభించింది. రోహిత్‌ శర్మ, డేవాల్డ్‌ బ్రెవిస్‌ (23) దూకుడుగా ఆడారు. అయితే స్వల్ప తేడాతో బ్రెవిస్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రోహిత్‌ శర్మ ఔటయ్యారు. దీంతో ముంబయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన హార్దిక్‌ పాండ్య (16), వధేరా (1) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. దీంతో ముంబయి 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 125 పరుగులతో నిలిచింది. మరోవికెట్ పడకుండా ఇషాన్‌ కిషన్‌తో జట్టు కట్టిన నమన్‌ ధీర్‌ మెళ్లిగా ఇన్నింగ్స్‌ నిర్మించాడు. అయితే సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువగా ఉండడంతో ముంబయి ఓటమి దిశగా పయనించింది. చివర్లో నమన్‌ ధీర్‌ చెలరేగినప్పటికీ కేవలం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌(55), పూరన్‌(75) అర్ధశతకాలతో రాణించారు. ముంబయి బౌలర్లలో నువాన్‌ తుషార, పీయుష్‌ చావ్లా చెరో 3 వికెట్లు తీశారు. మొదటి నుంచి ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. దీంతో పవర్‌ప్లే(తొలి 6 ఓవర్లు)లో లఖ్‌నవూ 2 వికెట్లు కోల్పోయి 49 పరుగులే చేసింది. తొలి ఓవర్‌లోనే తుషార బౌలింగ్‌లో పడిక్కల్‌ వికెట్ల ముందు దొరికి డకౌట్‌ అయ్యాడు. ఓ వైపు కెప్టెన్‌ రాహుల్‌ క్రీజులో నిలదొక్కుకొని అర్ధశతకం సాధించాడు. పూరన్‌ (8 సిక్సులు, 5 ఫోర్లు) చెలరేగి ఆడాడు. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సులు(36)సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్టాయినిస్‌(28), ఆయుష్‌ బదోనీ(22*) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లలో దీపక్‌(11), అర్హద్‌ ఖాన్‌(0), కృనాల్‌పాండ్య(12*) పరుగులు చేశారు. 

ఒక్క మ్యాచ్‌తో మూడు జట్లు ఇంటికి..

ఈ ఒక్క మ్యాచ్‌తో లఖ్‌నవూ, దిల్లీ, ముంబయి మూడు జట్లు ఎలిమినేట్‌ అయ్యాయి. 14 మ్యాచ్‌లు ఆడిన లఖ్‌నవూ, దిల్లీ జట్లు 7 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించగా, చెన్నై 14 పాయింట్లతో మెరుగైన నెట్‌రన్‌రేట్‌ కలిగి ఉంది. దీంతో ఈ రెండు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇక ముంబయి కేవలం 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో టోర్నీ ముగించింది. ఇప్పటికే కోల్‌కతా, రాజస్థాన్‌, హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకోగా, మరో స్థానం కోసం చెన్నై, బెంగళూరు పోటీ పడుతున్నాయి. చెన్నై, బెంగళూరు జట్లు శనివారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే నెట్‌రన్‌రేట్‌ ఏ జట్టుకు ఎక్కువుంటే ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు వెళుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు