Marcus Stoinis: టీ20 ప్రపంచ కప్‌ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్‌నవూ సెంచరీ హీరో

సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్‌నవూ బ్యాటర్ స్టాయినిస్‌ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్‌లో ఉండి విజయతీరాలకు చేర్చాడు.

Updated : 24 Apr 2024 12:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చెన్నైపై సెంచరీతో లఖ్‌నవూ విజయం సాధించడంలో మార్కస్ స్టాయినిస్‌ (124*) కీలక పాత్ర పోషించాడు. గత నెలలోనే ఆసీస్‌ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన అతడు.. ఇప్పుడీ శతకంతో తాను టీ20 ప్రపంచ కప్‌ రేసులో ఉన్నట్లు జట్టు సెలక్టర్లకు సందేశం పంపినట్లైంది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఎక్కువగా సెకండ్‌ డౌన్‌ లేదా మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చిన స్టాయినిస్‌.. తొలిసారి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి అదరగొట్టాడు. చెన్నైతో మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడాడు.

‘‘టీ20ల్లో నాకంటే అద్భుతమైన ఓపెనర్లు చాలా మంది మా జట్టులో ఉన్నారు. ప్రస్తుత సీజన్‌లో నేను తొలిసారి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చా. చెన్నై బౌలర్లలో కొందరిని మాత్రమే టార్గెట్‌ చేసుకున్నాం. మరికొందరి బౌలింగ్‌లో ఆచితూచి ఆడాం. ఓ దశలో నేను బౌండరీలు కూడా కొట్టలేకపోయా. ఆ సమయంలో పూరన్ దూకుడుగా ఆడాడు. టీ20 క్రికెట్‌లో చాలా మార్పులొచ్చాయి. భారీ స్కోర్లు నమోదవుతూనే ఉన్నాయి. ఇక ఇంపాక్ట్‌ ప్లేయర్ రూల్‌తో బౌలర్లపై ఒత్తిడి పెరుగుతోంది. క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్‌ను మిస్‌ అయినందుకు బాధేం లేదు. నాకు ఇప్పటికీ ఆసీస్ హెడ్‌ కోచ్‌తో మంచి సంబంధాలే ఉన్నాయి. మరోసారి జాతీయ జట్టు కప్‌ సాధించడంలో నా భాగస్వామ్యం కూడా ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నా’’ అని స్టాయినిస్‌ తెలిపాడు. సెంచరీ చేసిన స్టాయినిస్‌కే ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది.

14 రన్‌రేట్‌తో పరుగులు చేయాలని తెలుసు: హుడా

‘‘నేను క్రీజ్‌లోకి వచ్చే సమయానికి మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. ప్రతి ఓవర్‌లో కనీసం 14 పరుగులు చేయాలి. ఎటాకింగ్‌ గేమ్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. మరోవైపు స్టాయినిస్‌ కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడేశాడు. వీరుడిలా రెండో ఓవర్‌ నుంచి క్రీజ్‌లో ఉండటం అద్భుతం. మ్యాచ్‌లో విజయం సాధిస్తామనే నమ్మకం 100 శాతం మాలో ఉంది’’ అని దీపక్‌ హుడా వ్యాఖ్యానించాడు. 

మ్యాచ్‌ విశేషాలు మరికొన్ని.. 

  • ఐపీఎల్‌లో లక్ష్య ఛేదన సందర్భంగా ఓ బ్యాటర్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు స్టాయినిస్‌(124*)దే. అంతకుముందు చెన్నైపైనే (2011) పంజాబ్ బ్యాటర్ పాల్ వాల్తాటి 120* పరుగులు చేశాడు.
  • లఖ్‌నవూ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రెండో బ్యాటర్ స్టాయినిస్‌. ముంబయిపై 2022లో క్వింటన్ డికాక్ 140* పరుగులతో అజేయంగా నిలిచాడు. 
  • చెపాక్‌లో 200+ స్కోర్లలో అత్యధిక టార్గెట్‌(211)ను ఛేదించిన జట్టుగా లఖ్‌నవూ నిలిచింది. అంతకుముందు బెంగళూరుపై (2012లో) చెన్నై 206 పరుగులను ఛేదించింది.
  • ఐపీఎల్‌లో లఖ్‌నవూ సాధించిన రెండో అత్యధిక లక్ష్య ఛేదన కూడా ఇదే కావడం విశేషం. గతేడాది బెంగళూరుపై 213 పరుగుల టార్గెట్‌ను ఛేదించి లఖ్‌నవూ విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు