Marnus Labuschagne: కలిసొచ్చిన కంకషన్‌.. మరోసారి వెలుగులోకి వచ్చిన లబుషేన్

అనుకోకుండా కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. తానేంటో క్రికెట్‌ ప్రపంచానికి తెలియజేశాడు.. స్థిరంగా రాణిస్తున్నా వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కలేదు మళ్లీ కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. తానేంటో సెలక్టర్లకు తెలియజేశాడు. ఇలా రెండు సందర్భాల్లో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా సత్తా చాటిన ఆ ఆటగాడే ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ (Marnus Labuschagne). ఇతడికి కలిసొచ్చినట్లుగా ఈ నిబంధన ఎవరికీ కలిసి రాలేదేమో! 

Published : 09 Sep 2023 16:16 IST

అనుకోకుండా కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. తానేంటో క్రికెట్‌ ప్రపంచానికి తెలియజేశాడు.. స్థిరంగా రాణిస్తున్నా వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కలేదు మళ్లీ కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. తానేంటో సెలక్టర్లకు తెలియజేశాడు. ఇలా రెండు సందర్భాల్లో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా సత్తా చాటిన ఆ ఆటగాడే ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ (Marnus Labuschagne). ఇతడికి కలిసొచ్చినట్లుగా ఈ నిబంధన ఎవరికీ కలిసి రాలేదేమో! 

క్రికెట్లో మైదానంలో ఎవరికైనా బంతి తలకు తగిలితే ఆ గాయపడిన ఆటగాడి స్థానంలో వేరొకరు బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌ చేయడానికి నిర్దేశించిందే కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ నిబంధన. అయితే ఈ స్థానంలో వచ్చిన ఆటగాడు ఏదో అలా తాత్కాలికంగా ఉపయోగపడతారు కానీ లబుషేన్‌లా మ్యాచ్‌లను ప్రభావితం చేయలేదు. జట్టులో పాతుకుపోలేదు. 

2019 యాషెస్‌ టెస్టు సిరీస్‌లో లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ పేసర్‌కు స్టీవ్‌ స్మిత్‌ తలకు తగలడంతో బ్యాటింగ్‌ కొనసాగించలేకపోయాడు. ఆస్ట్రేలియా పరిస్థితి చూస్తే ఓడిపోయేలా ఉంది. ఇంతటి క్లిష్ట స్థితిలో.. ఒత్తిడిలో స్మిత్‌కు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లబుషేన్‌ అద్భుతంగా ఆడాడు. 59 పరుగులు చేసి జట్టును ఓటమి నుంచి తప్పించాడు. క్రికెట్‌ చరిత్రలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ను ఉపయోగించిన తొలి సందర్భం అదే. అప్పటి నుంచి లబుషేన్‌ ఆస్ట్రేలియా జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా మారిపోయాడు. మిడిలార్డర్‌లో కీలక బ్యాటర్‌గా ఎదిగాడు. 43 టెస్టుల్లో 11 సెంచరీలతో 3789 పరుగులు చేసిన మార్నస్‌.. 31 వన్డేల్లో ఒక సెంచరీ, 7 అర్ధసెంచరీలతో సహా 927 పరుగులు సాధించాడు. తన లెగ్‌స్పిన్‌తోనూ భాగస్వామ్యాలు విడగొట్టగల ఉపయుక్తమైన బౌలర్‌గానూ పేరు సంపాదించాడు. 

మళ్లీ కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గానే

స్థిరంగా రాణిస్తున్నా భారత్‌లో జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో లబుషేన్‌కు చోటు దక్కలేదు. అతడికి బదులు భారత మూలాలు ఉన్న తన్వీర్‌ సంఘాపై సెలక్టర్లు నమ్మకముంచారు. వన్డే ఫార్మాట్‌కు బాగా సరిపోయే లబుషేన్‌కు సెలక్టర్ల నిర్ణయం శరాఘాతంలా తగిలింది. దీనికి తోడు దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కూ అతడు ఎంపిక కాలేదు. అయినా అతడేం కుంగిపోలేదు. జట్టులో ఆడాలన్న అమ్మ ఆశను తీర్చడం కోసం నెట్స్‌లో కష్టపడ్డాడు. చిత్రం ఏమిటంటే యాషెస్‌ సిరీస్‌లో ఏ స్మిత్‌ గాయపడితే తొలిసారి కంగారూ జట్టులోకి వచ్చాడో అదే స్మిత్‌ గాయంతో వైదొలగడంతో సఫారీ పర్యటనలో పునరాగమనం చేశాడు.

అవకాశాన్ని అందిపుచ్చుకుని

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో తుది జట్టులో లబుషేన్‌కు చోటు దక్కలేదు. ఇక్కడా అతడికి అదృష్టం కలిసొచ్చింది. ఈసారీ కంకషన్‌ పేరిటే అతడు జట్టులోకి వచ్చాడు. ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ గాయపడడంతో అతడికి బదులు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దిగిన లబుషేన్‌ ఓటమి కోరల్లో ఉన్న జట్టుకు విజయాన్ని అందించాడు. అస్టన్‌ అగర్‌తో కలిసి ఆసీస్‌కు అనూహ్య విజయాన్ని అందించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన లబుషేన్‌.. మొక్కవోని పట్టుదల ప్రదర్శించి టెయిలెండర్‌ సాయంతో ఆసీస్‌ను గట్టెక్కించాడు. తొలి వన్డేలో ప్రదర్శనతో సెలక్టర్లను ఆలోచనలో పడేశాడీ స్టార్‌ బ్యాటర్‌. మిగిలిన బ్యాటర్లు తడబడిన కఠినమైన పిచ్‌పై అతడు షాట్లు ఆడిన తీరు ఆకట్టుకుంది. మిడిల్‌ ఓవర్లలో ఓపిగ్గా ఆడే సత్తా ఉన్న లబుషేన్‌ పక్కకు పెట్టాలన్న సెలక్టర్ల నిర్ణయం వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

 - ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని