Mary Kom: ‘నాకు మరో అవకాశం లేదు’: ఒలింపిక్స్‌ బాధ్యతల నుంచి వైదొలిగిన మేరీకోమ్‌

Mary Kom: పారిస్‌ ఒలింపిక్స్‌ కీలక బాధ్యతల నుంచి దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ వైదొలిగారు. వ్యక్తిగత కారణాలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Published : 12 Apr 2024 17:08 IST

దిల్లీ: ప్రపంచ ఛాంపియన్‌, దిగ్గజ బాక్సర్‌ మేరీ కోమ్‌ (Mary Kom) కీలక ప్రకటన చేశారు. వచ్చే పారిస్‌ ఒలింపిక్స్‌ (Paris Olympics)కు భారత్‌ తరఫున చెఫ్‌ డి మిషన్‌ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ మేరకు భారత ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ (IOA) అధ్యక్షురాలు పీటీ ఉషకు ఆమె లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, తనకు మరో అవకాశం లేదని మేరీ కోమ్‌ వెల్లడించారు.

పారిస్‌ ఒలింపిక్స్‌లో మేరీ కోమ్‌ను చెఫ్‌ డి మిషన్‌గా నియమిస్తూ మార్చి 21న భారత ఒలింపిక్స్‌ అసోసియేషన్ ప్రకటన చేసింది. జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే భారత బృందానికి ఆమె లాజిస్టికల్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఆ బాధ్యతల నుంచి ఆమె వైదొలిగారు.

‘వీడ్కోలు’ ఆలోచనే లేదు.. అప్పటివరకు విశ్రమించేదే లేదు: రోహిత్ శర్మ

‘‘ఈ దేశానికి సాధ్యమైనంతవరకు సేవ చేయడం నేను గౌరవంగా భావిస్తా. అందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నా. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రతిష్ఠాత్మక బాధ్యతను నేను నిర్వర్తించలేకపోతున్నా. అందుకే ఆ పదవి నుంచి వైదొలుగుతున్నా. ఈ పరిస్థితి నాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. మరో అవకాశం లేకుండాపోయింది. నా దేశం తరఫున ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న అథ్లెట్లను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందుంటా’’ అని మేరీ కోమ్‌ తన లేఖలో పేర్కొన్నారు. దీనిపై పీటీ ఉష స్పందించారు. దిగ్గజ బాక్సర్‌ ఈ బాధ్యతల నుంచి వైదొలగడం బాధాకరమన్నారు. అయితే, ఆమె నిర్ణయాన్ని, వ్యక్తిగత గోప్యతను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే మేరీ కోమ్‌ స్థానంలో కొత్త వారిని నియమిస్తామని వెల్లడించారు.

41 ఏళ్ల మేరీ కోమ్‌ గురించి ఇటీవల రిటైర్మెంట్‌ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాటిని ఆమె కొట్టిపారేశారు. తాను ఇప్పుడే బాక్సింగ్‌కు వీడ్కోలు పలకాలనుకోవడం లేదని, ఫిట్‌నెస్‌పై దృష్టిపెడుతున్నానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు