Rohit Sharma: ‘వీడ్కోలు’ ఆలోచనే లేదు.. అప్పటివరకు విశ్రమించేదే లేదు: రోహిత్ శర్మ

భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తాజాగా ఓ ఇంటర్వ్యూలో రిటైర్‌మెంట్ గురించి స్పందించాడు. అలాగే తన లక్ష్యాలను కూడా వెల్లడించాడు.

Published : 12 Apr 2024 15:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబయి స్టార్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) అదరగొట్టేస్తున్నాడు. గత వన్డే వరల్డ్‌ కప్ ముగిశాక హిట్‌మ్యాన్‌ ఒక్కో ఫార్మాట్‌ను వదిలేస్తాడనే కథనాలూ వచ్చాయి. వాటన్నింటినీ కొట్టిపడేస్తూ భారత జట్టుకు టీ20 పగ్గాలను కూడా అందుకొన్నాడు. వచ్చే టీ20 ప్రపంచకప్‌లోనూ అతడి నాయకత్వంలోనే టీమ్‌ఇండియా బరిలోకి దిగుతుందని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించిన సంగతి తెలిసిందే. 36 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పట్లో క్రికెట్‌కు వీడ్కోలు పలికే ఆలోచన తనకు లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ‘బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌’ కార్యక్రమంలో రిటైర్‌మెంట్, భవిష్యత్తులో సాధించాల్సిన వాటి గురించి రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘ఇప్పటికిప్పుడు నాకేమీ క్రికెట్‌ను వదిలేయాలనే ఆలోచన లేదు. అయితే, జీవితం ఎలా సాగుతుందనేది మనకు తెలియదు. ఇప్పటికీ అత్యుత్తమ ఆట తీరునే ప్రదర్శిస్తున్నా. మరికొన్నేళ్లు తప్పకుండా ఆటలో కొనసాగుతా.  భారత్ తరఫున భారీ టోర్నీలు గెలవాలనేదే నా కోరిక. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నా. టీమ్‌ఇండియా మరో వరల్డ్‌కప్‌ సాధించాలి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 2025లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి జట్టును గెలిపించాలి. ఆ రెండూ నెరవేరుతాయని ఆశిస్తున్నా’’ అని రోహిత్ తెలిపాడు. 

అదే అసలైన వరల్డ్‌ కప్‌

‘‘నా వరకు వన్డే ప్రపంచకప్‌ మాత్రమే అసలైన టోర్నీ. మేమంతా 50 ఓవర్ల క్రికెట్‌ను చూస్తూ పెరిగాం. మన దేశంలో మన అభిమానుల మధ్య గతేడాది జరిగింది. అద్భుతంగా ఆడి ఫైనల్‌కు చేరుకున్నాం. సెమీస్‌ గెలిచిన తర్వాత ఒకే ఒక్క అడుగు మాత్రమే టైటిల్‌ను అందుకోవడానికి ఉందని భావించా. అయితే ఫైనల్‌లో మాకు పరాభవం ఎదురైంది. ఆ సమయంలో ఎన్నో ఆలోచనలు నా మనసులోకి వచ్చాయి. అన్ని విభాగాల్లోనూ బాగానే ఆడాం కదా.. ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఎందుకు ఇలా జరిగిందని మదనపడ్డా. ఒకేఒక్క చెడ్డ రోజు మాకు కప్‌ను దూరం చేసింది. అయితే, ఫైనల్‌లో మేం సరిగా ఆడలేదని మాత్రం భావించడం లేదు. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. ఆసీస్‌ మాకంటే కాస్త బెటర్‌గా ఆడింది కాబట్టే విజేతగా నిలిచింది’’ అని రోహిత్ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని