Mumbai Vs Bengaluru: ముంబయి X బెంగళూరు.. ఎవరు గెలిచినా ముందుకే!

ఐపీఎల్‌లో బెంగళూరుపై ముంబయి ఆధిపత్యం కొనసాగుతోంది. ఇరు జట్లూ 32 మ్యాచుల్లో తలపడగా.. ముంబయి 18-14 తేడాతో ముందుంది.

Updated : 11 Apr 2024 16:39 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో తొలి విక్టరీతో పాయింట్ల ఖాతా తెరిచిన ముంబయి.. హ్యాట్రిక్‌ ఓటములతో అట్టడుగు నుంచి రెండో స్థానంలో కొనసాగుతున్న బెంగళూరు జట్ల మధ్య ఇవాళ వాంఖడే వేదికగా మ్యాచ్‌ జరగనుంది. పాయింట్లపరంగా (2) సమంగా ఉన్నప్పటికీ.. నెట్‌ రన్‌రేట్ కారణంగా బెంగళూరు కంటే ముంబయి మెరుగైన స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఎవరు గెలిచినా ఒకడుగు ముందుకు వేయడం ఖాయం.

ఇరు జట్లకూ బౌలింగే సమస్య..

ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన ముంబయి తన పాయింట్ల ఖాతాను తెరవడానికి నాలుగు మ్యాచ్‌ల సమయం పట్టింది. దిల్లీపై భారీ స్కోరు చేయబట్టే అదైనా సాధ్యమైంది. హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) నాయకత్వంలోని ఆ టీమ్‌ బౌలింగ్‌ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. బుమ్రాపైనే అధికంగా ఆధారపడుతోంది. ఈ స్టార్‌ పేసర్‌ను వాడుకోవడంలోనూ పాండ్య విఫలమవుతున్నాడనే విమర్శలున్నాయి. కొయిట్జీ నిలకడగా రాణించడం లేదు. స్పిన్‌ విభాగంలో సీనియర్‌ బౌలర్ పీయూష్ చావ్లా అనుకున్నమేర సక్సెస్ కావడం లేదు. ముంబయి గత మూడు మ్యాచుల్లోనూ బౌలింగ్‌ లోపం స్పష్టంగా కనిపించింది. 

మరోవైపు బెంగళూరు జట్టులోనూ ఇలాంటి పరిస్థితి. ఆ జట్టు భారీ స్కోర్లు చేసినా కాపాడుకోవడంలో ఘోరంగా విఫలమై విమర్శలు ఎదుర్కొంటోంది. సిరాజ్ ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. నాణ్యమైన స్పిన్ లేదు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ అటు బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ నిరాశపరిచాడు. కోట్లు పెట్టి కొన్న కామెరూన్ గ్రీన్ కూడా మెరుగ్గా రాణించడం లేదు. లాకీ ఫెర్గూసన్‌కు అవకాశం ఇవ్వడం లేదు. అల్జారీ జోసెఫ్‌ స్థానంలో అతడికి ఛాన్స్‌ ఇస్తే బెటరని క్రికెట్ విశ్లేషకులు సూచించారు. యువ బౌలర్ విజయ్‌కుమార్ వైశాఖ్‌ ఫర్వాలేదనిపించినా అవకాశాలు ఎక్కువ ఇవ్వడం లేదు. బెంగళూరు బ్యాటింగ్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. విరాట్ (Virat Kohli), డీకే, అనుజ్‌ రావత్ మినహా మిగిలినవారంతా ఘోర ప్రదర్శన చేశారు. 

సూర్యపైనే దృష్టి..

బెంగళూరుతో పోలిస్తే ముంబయి బ్యాటింగ్‌కు ఢోకా లేదు. బెంగళూరులో ఒకరిద్దరిపైనే ఆ విభాగం ఆధారపడింది. కానీ, ముంబయిలో మాత్రం రోహిత్, ఇషాన్‌కిషన్‌ శుభారంభం అందిస్తుండగా.. తిలక్‌వర్మ, టిమ్‌ డేవిడ్ దానిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు సూర్యకుమార్‌ కూడా జట్టుతోపాటు చేరాడు. ఈ సీజన్‌ తన తొలి మ్యాచ్‌లో సూర్య డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అయితే, టీ20ల్లో నంబర్‌వన్ బ్యాటర్ అతడిని తక్కువగా అంచనా వేస్తే బెంగళూరు బౌలర్లకు చుక్కలు తప్పవు. హార్దిక్‌ పాండ్య ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేస్తున్నప్పటికీ భారీ ఇన్నింగ్స్‌గా మార్చడంలో విఫలమవుతున్నాడు. గత మ్యాచ్‌లో దిల్లీపై చివరి ఓవర్‌లో భీకర హిట్టింగ్‌ చేసిన రొమారియో షెఫర్డ్‌ నుంచి అభిమానులు మరోసారి అలాంటి ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు.

తుది జట్లు (అంచనా)

ముంబయి: రోహిత్ శర్మ, ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్‌ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), టిమ్ డేవిడ్, నబీ, రొమారియో షెఫర్డ్, పీయూశ్‌ చావ్లా, గెరాల్డ్ కొయిట్జీ, బుమ్రా

బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్‌ కార్తిక్ (వికెట్ కీపర్), సౌరభ్ చౌహాన్, మయాంక్ దగర్, సిరాజ్, యశ్‌ దయాల్, టోప్లీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని