IPL 2024: సీఎస్‌కేకు షాకింగ్‌ న్యూస్.. పతిరణ నాలుగైదు వారాలపాటు దూరం!

ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌కు అందుబాటులో ఉండని సీఎస్కే పేసర్ పతిరణ మరికొద్ది రోజులపాటు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 16 Mar 2024 17:46 IST

ఇంటర్నెట్ డెస్క్: మరో వారం రోజుల్లోపే ఐపీఎల్ 17వ (IPL 2024) సీజన్‌ ప్రారంభం కానున్న వేళ.. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు షాకింగ్‌ న్యూస్. ఆ జట్టు యువ పేసర్ మతీశా పతిరణ గాయం కారణంగా దాదాపు నాలుగైదు వారాలపాటు మైదానానికి దూరం కానున్నాడు. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం కష్టమేనని సీఎస్కే వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గాయం తీవ్రత కాస్త ఎక్కువగా ఉండటంతో మరికొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. మార్చి 6న బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్‌ సమయంలో తొడ కండరాలు పట్టేయడంతో మ్యాచ్‌ మధ్యలోనే వైదొలిగాడు. తన పూర్తి ఓవర్ల కోటాను కూడా వేయలేదు. 

సీఎస్‌కే తరఫున గతేడాది కీలక పాత్ర పోషించిన పతిరణ దూరం కావడం ఆ జట్టుకు నష్టమేనని క్రికెట్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఐపీఎల్ 2023 సీజన్‌లో 12 మ్యాచులకుగాను 19 వికెట్లు తీశాడు. ‘‘తొడ కండరాలు పట్టేయడంతో బంగ్లాతో మ్యాచ్‌కు దూరమైన పతిరణ సమస్య తీవ్రమైందే. అతడు కోలుకోవడానికి కనీసం ఐదు వారాలు పట్టే అవకాశం ఉంది. దీంతో అతడు ఎప్పుడు జట్టులో చేరతాడనేది ఇప్పుడే చెప్పడం కష్టమే’’ అని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సీఎస్‌కే జట్టులోని ఓపెనర్ డేవన్ కాన్వే దూరమైన సంగతి తెలిసిందే. తొలి సగం మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని ఇప్పటికే సీఎస్కే వెల్లడించింది. 


విరామం తీసుకుంటే కోహ్లీని ఆపడం కష్టం: కైఫ్

‘‘విరాట్ కోహ్లీ గత రెండేళ్ల నుంచి అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై సెంచరీ బాదిన తర్వాత మరింత దూకుడుగా ఉన్నాడు. ప్రతీ మ్యాచ్‌లో పరుగులు ఎలా రాబట్టాలో అతడికి తెలుసు. వన్డే ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్. విరాట్‌ ప్రత్యేకత ఏంటంటే.. విరామం తీసుకొని వచ్చాక అతడిని ఆపడం ఎవరితరమూ కాదు. కొందరు విశ్రాంతి తీసుకుని వచ్చాక కుదురుకోవడానికి సమయం తీసుకుంటారు. కోహ్లీ తీరు దానికి భిన్నం. మరింత ప్రమాదకరంగా ఆడతాడు. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే విరాట్ కీలకం’’ అని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్‌ వ్యాఖ్యానించాడు. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని