Mayank Yadav: అవకాశం అప్పుడే రావాల్సింది.. భారత జట్టులోకి మయాంక్‌ ఎంట్రీపై కోచ్‌ దేవేందర్‌

ఐపీఎల్‌లో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కుర్రాడు మయాంక్‌ యాదవ్. నిలకడగా 145 కి.మీ. వేగంతో బంతులను విసిరే అతడు ఏకంగా ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బాల్‌ను సంధించాడు.

Published : 01 Apr 2024 15:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా మయాంక్‌ యాదవ్‌ నిలిచాడు. లఖ్‌నవూకు ఆడుతున్న ఈ యువ క్రికెటర్‌కు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోనే అవకాశం రావాల్సిఉందట. అయితే, గాయం కారణంగా అతడిని పరిగణనలోకి తీసుకోలేదని మయాంక్‌ క్లబ్‌ కోచ్ దేవేందర్ శర్మ తెలిపారు. ప్రస్తుతం ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లోనే మంచి ప్రదర్శన చేసిన మయాంక్‌ బౌలింగ్‌ను పరిశీలించాలని టీమ్‌ఇండియా సెలక్షన్‌ కమిటీ చీఫ్‌ అజిత్ అగార్కర్‌కు దేవేందర్‌ విజ్ఞప్తి చేశాడు. 

‘‘జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు అదే. చీఫ్‌ సెలక్టర్‌ను మెప్పించాలని.. జాతీయజట్టులోకి రావాలని ఎవరికి మాత్రం ఆశ ఉండదు. మయాంక్‌ ఫిట్‌గా ఉండాలని.. నాణ్యమైన పేస్‌ సంధించాలని దేవుడిని ప్రార్థించా. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టు కోసం మయాంక్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. ఆ సమయంలో గాయం తిరగబెట్టడంతో అవకాశం చేజారింది. గుండె పగిలినంత పనవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. అయితే, అతడు అద్భుతమైన ఆటగాడే కాకుండా దృఢ సంకల్పం కలిగిన కుర్రాడు. అథ్లెటిక్‌ బాడీ. నిరంతరం శ్రమించే ఆటగాడు. తప్పకుండా సుదీర్ఘకాలం భారత జట్టుకు సేవలు అందించగల సత్తా ఉంది’’ అని దేవేందర్‌ తెలిపారు. 

దేవేందర్ సోనెట్‌ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. మయాంక్‌ను దిల్లీ కెప్టెన్ రిషభ్‌పంత్‌, మెంటార్‌ సౌరభ్‌ గంగూలీతోపాటు గుజరాత్ ప్రధాన కోచ్‌ ఆశిశ్‌ నెహ్రా తమ టీమ్‌లోకి తీసుకొనేందుకు ఆసక్తి చూపించారని దేవేందర్‌ వెల్లడించారు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో లఖ్‌నవూ రూ.20 లక్షలకే తీసుకుంది. ఆ సీజన్‌లో అవకాశాలు రాలేదు. గాయం కారణంగా గత సీజన్‌ నుంచి వైదొలిగాడు. మూడో సీజన్‌లో ఎట్టకేలకు ఛాన్స్‌ దక్కించుకున్న మయాంక్‌ మొదటి మ్యాచ్‌లోనే తన ప్రత్యేకతను చాటి చెప్పాడు. మూడు వికెట్లు తీసి పంజాబ్‌పై లఖ్‌నవూ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అప్పటికే క్రీజ్‌లో ఉన్న బెయిర్‌ స్టోను బెంబేలెత్తించాడు. శిఖర్ ధావన్‌ను కూడా ఇబ్బందిపెట్టాడు. మయాంక్‌ బౌలింగ్‌ను మ్యాచ్‌ అనంతరం ధావన్‌ కూడా ప్రశంసించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని