MS Dhoni: రెండు మ్యాచుల్లో ఒక్క బంతినీ ఎదుర్కోని ధోనీ.. కారణమేంటో చెప్పిన మైక్ హస్సీ!

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ధోనీ (MS Dhoni) బ్యాటింగ్‌ను చూసే అవకాశం ఇప్పటి వరకూ రాలేదు. తొలి రెండు మ్యాచుల్లోనూ మహీ వికెట్‌ కీపింగ్‌కే పరిమితమయ్యాడు.

Published : 27 Mar 2024 13:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో చెన్నై రెండు మ్యాచ్‌లు ఆడింది. రెండింట్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్‌ విభాగాల్లో అదరగొట్టేస్తోంది. కొత్త కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ నాయకత్వ పటిమ అందర్నీ ఆకట్టుకుంటోంది. వికెట్‌ కీపింగ్‌లో మునుపటిలా అదరగొట్టిన ధోనీ బ్యాటింగ్‌ను చూసే అవకాశం మాత్రం అభిమానులకు ఇంకా దక్కలేదు. గుజరాత్‌తో మ్యాచ్‌లో 19వ ఓవర్‌లో ఐదో వికెట్‌ పడిన తర్వాత మహీ వస్తాడనుకుంటే.. యువ ఆటగాడు రిజ్వీని పంపించారు. ఇన్నింగ్స్‌ ఆఖర్లోనూ క్రీజ్‌లోకి రాలేదు. రవీంద్ర జడేజా వచ్చాడు. దీంతో ధోనీ ఎందుకు బ్యాటింగ్‌కు రావడం లేదని అభిమానులు ఆలోచనలో పడ్డారు. దీనికి కారణం ఏంటనేది చెన్నై కోచ్ మైక్‌ హస్సీ వెల్లడించాడు.

‘‘ధోనీ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఇంపాక్ట్‌ రూల్‌ను సద్వినియోగం చేసుకోవాలని చూశాం. అందుకే మహీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పు జరిగింది. ఇదంతా మా ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ సూచనల మేరకు చేశాం. మ్యాచ్‌ ముందుకు వెళ్లే కొద్దీ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ కీలకమవుతుంది. అదనంగా బ్యాటర్‌ లేదా బౌలర్‌ అవసరమైతే అప్పుడు ఆ నిబంధనను ఉపయోగించుకోవాలని భావించాం. అదే సమయంలో మా బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలాన్ని పరీక్షించుకున్నాం. ధోనీ 8వ స్థానంలో వచ్చేవాడే. ఆ ప్లేస్‌లో దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తాడు. జట్టులోని ప్రతి బ్యాటర్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించాలని ఫ్లెమింగ్ చెప్పేవాడు. మ్యాచ్‌పై పట్టు సాధించాలంటే ఇది తప్పదు. ఒకవేళ దూకుడుగా ఆడుతూ ఔటైనా ఫర్వాలేదు.. కొనసాగాలని ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తాం’’ అని మైక్‌ హస్సీ వ్యాఖ్యానించాడు. 

చెపాక్‌ను ఉర్రూతలూగించాడు: రచిన్‌పై ప్రశంసలు

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 206 పరుగుల భారీ స్కోరు సాధించడంలో శివమ్‌ దూబె (51)తోపాటు రచిన్‌ రవీంద్ర (46: 20 బంతుల్లో) కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ రుతురాజ్‌తో (46)తో కలిసి తొలి వికెట్‌కు ఐదు ఓవర్లలోనే 60 పరుగులు రాబట్టాడు. ‘‘తొలి సీజన్‌లోనే రచిన్‌కు అద్భుతమైన ఆరంభం దక్కింది. అతడి ఆటను చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఎంతో ఉత్సాహంగా టోర్నీలోకి అడుగు పెట్టాడు. జట్టులో మంచి వాతావరణం కల్పించడంలో అతడి పాత్ర తక్కువేం కాదు. ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నాడు. వీలైనంత ఎక్కువ అనుభవాన్ని గడించేందుకు శ్రమిస్తున్న అతడు అభిమానులను ఉత్సాహపరుస్తున్నాడు’’ అని హస్సీ తెలిపాడు. రచిన్‌ రెండు మ్యాచుల్లో కలిపి 86 పరుగులు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని