IND vs AUS: భారత్‌-ఆసీస్‌ టెస్టు మ్యాచ్‌.. స్టేడియంలో మోదీ, ఆల్బనీస్‌ సందడి

భారత్‌, ఆసీస్‌ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టును ఇరు దేశాల ప్రధానులు మోదీ (Modi), ఆల్బనీస్‌ ప్రత్యక్షంగా వీక్షించారు. మ్యాచ్‌కు ముందు వీరు మైదానంలో కలియదిరుగుతూ అభివాదం చేశారు.

Updated : 09 Mar 2023 11:07 IST

అహ్మదాబాద్‌: బోర్డర్‌ - గావస్కర్‌ (Border-Gavaskar series) సిరీస్‌లో భాగంగా భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ మరింత ప్రత్యేకత సంతరించుకుంది. 75 ఏళ్ల ఇండో-ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌ (Anthony Albanese) నేడు స్టేడియానికి వచ్చి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు.

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం (Narendra Modi stadium) వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్‌ గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు మోదీ, ఆల్బనీస్‌ నేడు స్టేడియానికి రాగా.. వారిని బీసీసీఐ (BCCI) ప్రత్యేకంగా సత్కరించింది. ఇరు దేశాల మధ్య 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా బీసీసీఐ తరఫున అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ.. ఆసీస్‌ ప్రధానికి ప్రత్యేక మెమొంటోను అందజేశారు. బీసీసీఐ కార్యదర్శి జై షా.. ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేశారు.

మ్యాచ్‌కు ముందు భారత జట్టు (Team India) సారథి రోహిత్‌ శర్మ (Rohit Sharma)కు ప్రధాని మోదీ (Modi).. ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith)కు ఆ దేశ ప్రధాని ఆల్బనీస్‌ టెస్టు క్యాప్‌లు అందించారు. ఆ తర్వాత ఇరు దేశాల ప్రధానులు బంగారు పూత పూసిన గోల్ఫ్‌ కారులో మైదానమంతా కలియదిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం ఆటగాళ్లతో కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను బీసీసీఐ (BCCI) ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. మ్యాచ్‌ (Test Match) ప్రారంభం కాగానే వీరిద్దరూ ప్రత్యేక గ్యాలరీలో కూర్చుని వీక్షించారు.

ఈ సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న నిర్ణయాత్మక నాలుగో టెస్టులో గెలిచి సిరీస్‌ విజయంతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తునూ సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని