T20 WC 2024: టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్‌

టీ20 ప్రపంచ కప్‌ కోసం భారత జట్టు సన్నాహకం జూన్ 1న బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఐదు రోజులకే తొలి పోరు జరగనుంది.

Published : 18 May 2024 18:08 IST

ఇంటర్నెట్ డెస్క్: జూన్ 2 నుంచి (భారత కాలమానం ప్రకారం) టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ప్రారంభం కానుంది. జూన్ 9న పాకిస్థాన్‌తో గ్రూప్‌ స్టేజ్‌లో టీమ్‌ఇండియా (IND vs PAK) తలపడనుంది. అయితే, ఆ ఒక్కసారే కాకుండా టైటిల్‌ పోరు దాయాదుల మధ్యే జరగాలని.. ఆ మ్యాచ్‌ వీక్షిస్తే అద్భుతంగా ఉంటుందని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా-విండీస్‌ సంయుక్త ఆతిథ్యంలో మెగా టోర్నీ జరగనుంది. 

‘‘టాప్‌-4లో న్యూజిలాండ్‌ దక్కించుకుంటుంది. ఐసీసీ ఈవెంట్లలో కివీస్‌ను తక్కువగా అంచనా వేయొద్దు. ఇక విండీస్‌ తమ స్వదేశంలో టోర్నీ జరుగుతుంది. ఆ జట్టులోని ప్రతీ ఆటగాడూ భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. అందుకే అత్యంత ప్రమాదకరమైన టీమ్‌. ఇక ఆసీస్‌, పాకిస్థాన్‌లో ఒక జట్టే నాకౌట్‌కు వస్తుంది. ఒకవేళ పాక్‌ వస్తే మాత్రం ఫైనల్‌ లేదా సెమీస్‌లో భారత్‌తోనే ఢీకొట్టే అవకాశం ఉంది. నాకు మాత్రం తుది పోరును ఇరు జట్ల మధ్యే చూడాలని ఉంది. ఇప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో మనదే ఆధిపత్యం. మరోసారి అదే కొనసాగుతుందని భావిస్తున్నా’’ అని కైఫ్‌ వివరించాడు. 

గతంతో పోలిస్తే..

‘‘గత టీ20 ప్రపంచకప్‌తో పోలిస్తే ఈసారి మన బౌలింగ్‌ ఎటాక్‌ మెరుగ్గా ఉంది. గతసారి చాహల్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఇప్పుడు మనకు అతడితోపాటు కుల్‌దీప్‌ కూడా జట్టులో ఉన్నాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వంటి స్పిన్ ఆల్‌రౌండర్లు ఉండటం అదనపు బలం. వీరంతా వికెట్లు తీయగల సత్తా ఉన్నవారే. ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులే. బుమ్రా ఈసారి కీలక బౌలర్‌ అనడంలో సందేహం లేదు’’ అని తెలిపాడు. దాదాపు 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు ఈసారైనా ముగింపు పలికాలని అభిమానులు కోరుతున్నారు. చివరిసారిగా 2013లో ధోనీ నాయకత్వంలో భారత్ ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. గతేడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరినప్పటికీ కప్‌ను అందుకోలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని