Shami-Hasin Jahan: క్రిమినల్స్‌ను పెట్టి చంపాలనుకున్నాడు.. షమీపై మాజీ భార్య సంచలన ఆరోపణలు

Eenadu icon
By Sports News Team Updated : 05 Jul 2025 11:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీపై అతడి మాజీ భార్య హసీన్‌ జహాన్‌ సంచలన ఆరోపణలు చేశారు. అతడికి వ్యక్తిత్వం లేదని, క్రూరమైన మనస్తత్వంతో తనను ఎంతగానో వేధించాడని ఆమె ఆరోపించారు. వీరి విడాకుల కేసుకు సంబంధించి ఇటీవల కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షమీ (Mohammed Shami)ని విమర్శిస్తూ హసీన్‌ జహాన్‌ (Hasin Jahan) ఇన్‌స్టా వేదికగా సుదీర్ఘ పోస్ట్‌ చేశారు.

‘‘గత ఏడేళ్లుగా మన మధ్య న్యాయపోరాటం జరుగుతోంది. నీ క్యారెక్టర్‌ లేనితనం, దురాశ, క్రూరమైన మనస్తత్వంతో సొంత కుటుంబాన్నే చేజేతులా నాశనం చేశావ్‌. మమ్మల్ని చంపడానికి, మా పరువు తీసి వేధించడానికి, నన్ను ఓడించడానికి నువ్వు ఎంతమంది క్రిమినల్స్‌కు డబ్బు ఇచ్చి ఉంటావ్‌. దానివల్ల నువ్వు ఏమైనా సాధించావా? క్రిమినల్స్‌, వేశ్యలకు నువ్వు ఇచ్చిన డబ్బును.. మన కుమార్తె చదువు కోసం వెచ్చించి ఉంటే, మన భవిష్యత్తు కోసం ఉపయోగించి ఉంటే ఇప్పుడు మన జీవితం ఎంతో బాగుండేది. మనమంతా ఎంతో మర్యాదగా జీవించేవాళ్లం’’ అని హసీన్‌ జహాన్ రాసుకొచ్చారు.

‘‘నాకు ఆ భగవంతుడు ఎంత ధైర్యాన్ని, సహనాన్ని ఇచ్చాడో చూడు. నిజం కోసం నేను ఏళ్లతరబడి పోరాడుతూనే ఉన్నాను... ఉంటాను కూడా. అందుకే, నువ్వు ఎంతమంది క్రిమినల్స్‌తో చేతులు కలిపినా నన్ను ఏమీ చేయలేకపోతున్నావ్‌. ఈ పురుషాధిక్య సమాజంలో నాపై నిందలేసి నువ్వు మద్దతు కూడగట్టుకోగలవేమో..! కానీ, ఏదో ఒకరోజు నీకు కూడా కష్టకాలం మొదలవుతుంది. అప్పుడు నీకు అండగా నిలిచినవాళ్లే నిన్ను తరిమేస్తారు. చట్టంపై నాకు నమ్మకం ఉంది’’ అని షమీని ఆమె దుయ్యబట్టారు.

2014లో హసీన్‌తో షమీకి వివాహమైంది. వీరికి కుమార్తె జన్మించింది. అయితే, ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. 2018లో హసీన్‌ అతడిపై గృహహింస కేసు పెట్టింది. దీనిపై కొన్నేళ్లుగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల హసీన్‌, ఆమె కుమార్తె సంరక్షణ కోసం రూ.4 లక్షలను భరణం కింద చెల్లించాలని షమీని కలకత్తా హైకోర్టు ఆదేశించింది.

Tags :
Published : 05 Jul 2025 11:18 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు