Mohammed Shami: నేను బ్రాంకో టెస్ట్‌ పాసయ్యాను: మహ్మద్‌ షమీ

Eenadu icon
By Sports News Team Published : 29 Aug 2025 00:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) స్టార్ బౌలర్‌ మహ్మద్‌ షమీ (Mohammed Shami) కొంతకాలంగా భారతజట్టుకు దూరంగా ఉంటున్నాడు. తాను మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉన్నానని అతడు చెబుతున్నప్పటికీ సెలక్టర్ల విశ్వాసాన్ని మాత్రం పొందలేకపోతున్నాడు. వరుస గాయాలు అతడి పునరాగమనానికి ఆటంకంగా నిలుస్తున్నాయి. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్‌ టూర్‌లోనూ అతడు కనిపించలేదు. అలాగే ఆసియా కప్‌ నేపథ్యంలో ఆగస్టు 19న ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ఇండియా స్వ్కాడ్‌లోనూ షమీ చోటు దక్కించుకోలేకపోయాడు.

రెండేళ్ల కిందట చివరిసారిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన షమీ.. అప్పటినుంచి టెస్ట్‌ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. టీమ్‌ఇండియా తరఫున చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో (ICC Champions Trophy) అతడు కనిపించాడు. ఐపీఎల్‌ (IPL) 2025 సీజన్‌లోనూ షమీ పెద్దగా రాణించలేదు. అయితే అతడు ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్‌ తరఫున బరిలోకి దిగాడు. దీనికంటే ముందు బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. 

ఈ నేపథ్యంలో జట్టులో తన పునరాగమనం గురించి కుండబద్దలు కొట్టినట్లుగా అతడు ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు. ‘ప్రస్తుతానికి టీమ్‌ ఇండియాలో చోటు దక్కించుకునే విషయమై నాకు ఎలాంటి ఆశలూ లేవు. ఒక వేళ నాకు అవకాశం ఇస్తే.. నేను నా పూర్తి శక్తి, సామర్థ్యాలతో ఆడటానికి ప్రయత్నిస్తా. ఒక వేళ వారు నాకు అవకాశం ఇవ్వకుంటే నేను.. ఏమీ చేయలేను. ఎందుకంటే సెలక్షన్‌ అనేది నా చేతిలో లేని వ్యవహారం. నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు నేను అందుబాటులో ఉన్నాను. నన్ను బెంగళూరుకు పిలిచారు. ఫిట్‌నెస్‌ టెస్ట్‌ (బ్రాంకో) కూడా క్లియర్‌ చేశాను’ అని షమీ పేర్కొన్నాడు.

అలాగే తనను ఎంపిక చేయని విషయమై ఎవరినీ తప్పు పట్టాలనుకోవడం లేదని అతడు అన్నాడు. ‘నన్ను సెలక్ట్‌ చేయని విషయమై ఎవరినీ తప్పుబట్టడం లేదు. అలాగే ఎవరినీ నిందించాలనుకోవడం లేదు. నేను టీమ్‌కు తగినవాణ్ని అనుకుంటేనే నన్ను ఎంపిక చేయండి. ఒక వేళ కాదు అనుకుంటే సెలక్ట్‌ చేయకండి. టీమ్ఇండియాకు ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసే గురుతరమైన బాధ్యత సెలక్టర్లకు ఉందన్న విషయం నాకు తెలుసు.  నా శక్తి, సామర్థ్యాల మీద పూర్తి నమ్మకం ఉంది. నేను చాలా కష్టపడుతున్నా.  అవకాశం లభిస్తే..  నా బెస్ట్‌ ఇస్తాను’ అని మహ్మద్‌ షమీ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు