IPL 2024: అందరి కళ్లూ వీరి పైనే.. ‘అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్ల’కు అవకాశం ఇస్తారా?

జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించకుండానే.. భారీ మొత్తం దక్కించుకున్న ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఎలా ఆడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉండటం సహజం. అలాంటి వారిలో టాప్‌ ఎవరంటే?

Published : 20 Mar 2024 10:11 IST

అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోనక్కర్లేదు. ఎప్పుడైనా తమ సత్తా చూపిస్తారు. ఇప్పుడిప్పుడే క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకుని దేశవాళీలో అదరగొట్టిన ‘అన్‌క్యాప్‌డ్’ (జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని) ప్లేయర్లు.. ఐపీఎల్ మినీ వేలంలో భారీ మొత్తాలను దక్కించుకొని రికార్డులు కొల్లగొట్టారు. వారికి తుది జట్టులో అవకాశం వస్తుందో..? లేదో? ఇప్పుడే చెప్పలేం. కానీ, వారి ప్రస్తుత ఫామ్‌ను బట్టి ఓ అంచనా వేయొచ్చు. 

దూకుడైన ఆటగాడు సమీర్ రిజ్వీ 

చెన్నై సూపర్ కింగ్స్‌ ఓ కుర్రాడిపై భారీ మొత్తం వెచ్చించడానికి ప్రధాన కారణం అతడి టాలెంట్. యువ క్రికెటర్లను ఎంపిక చేసుకుని తర్ఫీదు ఇచ్చి మరీ అద్భుతమైన ప్రదర్శనను వెలికితీస్తుంటుంది. మరి సమీర్ రిజ్వీ కోసం సీఎస్కే రూ 8.40 కోట్లు వెచ్చించడం విశేషం. ఇటీవల జరిగిన సీకే నాయుడు ట్రోఫీలో ఉత్తర్‌ప్రదేశ్‌ తరఫున సెంచరీతో మెరిశాడు. అంతకుముందు యూపీ టీ20 లీగ్‌లో అతను 9 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు సహా 455 పరుగులు చేశాడు. అందుకే రిజ్వీని సీఎస్కే ఎంపిక చేసింది. స్టార్‌ ఆటగాడు అంబటి రాయుడు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో రిజ్వీని ఆడించాలనేది ఆ జట్టు ప్రణాళికగా క్రికెట్ విశ్లేషకుల అంచనా. 20 ఏళ్ల రిజ్వీ ఇప్పటివరకు 7 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లను మాత్రమే ఆడాడు. 


భారీ హిట్టర్.. వికెట్ టేకర్ షారుక్ ఖాన్ 

షారుక్ ఖాన్ ఇప్పటికే ఐపీఎల్‌లో ఆడిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్. పంజాబ్‌ కింగ్స్‌కు (2021-23) ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకూ 33 మ్యాచ్‌ల్లో 134.81 స్ట్రైక్‌రేట్‌తో 426 పరుగులు చేశాడు. గత మినీ ఐపీఎల్‌కు ముందు అతడిని పంజాబ్‌ వదులుకుంది. అది పెద్ద పొరపాటే అవకాశం లేకపోలేదు. మినీ వేలంలో రూ.7.40 కోట్లు పెట్టి గుజరాత్ దక్కించుకుంది. ఎందుకంటే ఆ తర్వాత జరిగిన తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో షారుఖ్‌ అదరగొట్టాడు. బౌలింగ్‌ కూడా చేయగల సమర్థుడు. టీఎన్‌పీఎల్‌లో టాప్‌ వికెట్‌ టేకర్‌ కూడా షారూకే.  మొత్తం 17 వికెట్లు పడగొట్టాడు. లోయర్‌ ఆర్డర్‌లో భారీ సిక్స్‌లు కొట్టే షారుక్ తమ జట్టులో ప్రధాన పాత్ర పోషిస్తాడని ఇప్పటికే గుజరాత్‌ ప్రధాన కోచ్‌ ఆశిశ్ నెహ్రా ఆశాభావం వ్యక్తం చేశాడు. 


కుశాగ్ర.. 17 ఏళ్లకే డబుల్‌ సెంచరీ

ఝార్ఖండ్‌కు చెందిన కుమార్ కుశాగ్ర రంజీ మ్యాచ్‌లో 17 ఏళ్లకే డబుల్‌ సెంచరీ బాదాడు. నాగాలాండ్‌పై భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇప్పటికే 19 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లో 1,245 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోరు 266. ఈ యంగ్‌ వికెట్‌ కీపర్‌ను దిల్లీ రూ.7.20 కోట్లకు తీసుకుంది. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే కుశాగ్ర విలువైన ఇన్నింగ్స్‌లు ఆడతాడు. అయితే, దిల్లీ తరఫున యువ వికెట్‌ కీపర్ అభిషేక్ పోరల్‌తో కుశాగ్రకు పోటీ తప్పదు. గత సీజన్‌లో పోరెల్ కేవలం నాలుగు మ్యాచ్‌లను మాత్రమే ఆడి 33 పరుగులు చేశాడు. మరో స్టార్‌ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఉన్నప్పటికీ అతడు ఆ బాధ్యతలను చేపట్టే అవకాశాలు చాలా తక్కువ. ఐపీఎల్‌లో రాణించి జాతీయ జట్టుకు ఎంపికయ్యేందుకు ప్రయత్నిస్తాననే నమ్మకంతో కుశాగ్ర ఉన్నాడు.


టీ20ల్లో అదరగొట్టే శుభమ్‌ దూబె

‘‘కోట్లు వస్తాయని నేనూ ఊహించలేదు’’ ఇవీ మినీ వేలంలో రూ.5.80 కోట్లు శుభమ్‌ దూబె చేసిన వ్యాఖ్యలు. రాజస్థాన్‌ రాయల్స్‌ అతడిని భారీ మొత్తం పెట్టి దక్కించుకోవడానికి కారణం లేకుండా ఉండదు. విదర్భకు చెందిన ఈ ఆటగాడు ఇప్పటివరకు కేవలం మూడు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మొత్తం 75 పరుగులు చేశాడు. ఎడమచేతివాటం కలిగిన బ్యాటర్‌ను రాజస్థాన్‌ ఎంచుకుంది. అయితే, దేశవాళీ టీ20ల్లో మాత్రం అదరగొట్టేశాడనే చెప్పాలి. 20 మ్యాచుల్లో 485 పరుగులు చేశాడు. 145 స్ట్రైక్‌రేట్‌తో దూకుడుగా ఆడాడు. ఇందులో 30 సిక్స్‌లు, 26 ఫోర్లు ఉండటం గమనార్హం. బౌండరీల ద్వారానే 380+ పరుగులు రాబట్టాడు. 


ఝార్ఖండ్‌ నుంచి రాబిన్‌ మింజ్‌ 

‘కెప్టెన్ కూల్‌’ ఎంఎస్ ధోనీ స్వరాష్ట్రం ఝార్ఖండ్‌ నుంచి మరో వికెట్‌ కీపర్‌ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌ రూ.3.60 కోట్లు వెచ్చించి మరీ రాబిన్‌ మింజ్‌ తీసుకుంది. ఈసారి ఐపీఎల్‌లో ఆడే అవకాశం చాలా తక్కువే. కొద్ది రోజుల కిందట మింజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ ఐపీఎల్ నాటికి కోలుకొని ఫిట్‌నెస్‌ సాధించడం కష్టమే. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ ఆశిశ్ నెహ్రా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశాడు. తొలి షెడ్యూల్‌లోని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని తెలిపాడు. రాబిన్‌ మింజ్‌ తండ్రి మాత్రం ‘అతడికి స్వల్ప గాయాలయ్యాయి. ఇప్పుడు ఫర్వాలేదు. త్వరలోనే కోలుకుని వస్తాడు’’ అని చెప్పారు. మరి ఫిట్‌నెస్‌ సాధించి వస్తాడో? లేదో? చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని