MS Dhoni: ధోనీ క్రేజ్‌ మామాలుగా లేదుగా.. దద్దరిల్లిన స్టేడియాలు.. సాక్ష్యం ఇదిగో..

చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ (MS Dhoni)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడు సిక్సర్ బాదితే ‘ధోనీ ధోనీ’ అనే నినాదాలతో స్టేడియాలు హోరెత్తుతాయి.

Published : 14 Apr 2024 00:05 IST

ఇంటర్నెట్ డెస్క్: మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఈ పేరే ఒక బ్రాండ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ అభిమానించే క్రికెటర్లలో ఈయన ఒకరు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి చాలాకాలం అవుతున్నా ధోనీ క్రేజ్‌ తగ్గడం లేదు. అందుకు ఐపీఎల్‌-17 సీజన్‌ ఉదాహరణ. ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై జట్టు మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా అభిమానులు పోటెత్తుతున్నారు. ఇందులో సగానికంటే ఎక్కువమంది ధోనీని చూడటానికే వస్తున్నారడంలో సందేహం అక్కర్లేదు. కెప్టెన్‌ కూల్‌ మైదానంలోకి వచ్చే సమయంలో, ఫోర్‌ కొట్టినా, సిక్సర్‌ బాదినా అభిమానులు చేసే సందడి మామూలుగా ఉండదు. ‘ధోనీ ధోనీ’ అంటూ నినాదాలు చేస్తూ స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ధోనీ క్రేజ్‌ గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటికొచ్చింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో స్టేడియానికి వచ్చిన అభిమానులు వివిధ సందర్భాల్లో చేసిన శబ్ద స్థాయిలను ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ సాంకేతికతను ఉపయోగించి లెక్కించింది. ఇందులో మొదటి రెండు స్థానాల్లో ధోనీ ఉన్నాడు. 

ఐపీఎల్‌-17 సీజన్‌ ఆరంభపోరు చెన్నైలోని ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో జరిగింది. చెన్నై, బెంగళూరు తలపడిన ఈ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు. టాస్‌ పడటానికి ముందు ధోనీ మైదానంలోకి అడుగుపెడుతున్న సమయంలో ఫ్యాన్స్‌ ‘ధోనీ ధోనీ’.. అంటూ నినాదాలు చేస్తూ చెపాక్‌ స్టేడియాన్ని హోరెత్తించారు. ఈ దెబ్బకు ఆ సమయంలో శబ్ద తీవ్రత 130 డెసిబెల్స్‌ నమోదైందని స్టార్‌ స్పోర్ట్స్ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. 

వైజాగ్ వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 17వ ఓవర్‌ ఆరంభంలో బ్యాటింగ్‌కు వచ్చి అదరగొట్టాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది.. 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడు క్రీజ్‌లోకి వస్తున్న సమయంలో ఒక్కసారిగా స్టేడియంలోని అభిమానులు లేచి నిలబడి వారి సెల్‌ఫోన్‌లలో టార్చ్‌లైట్లు వేస్తూ ధోనీ .. ధోనీ అంటూ స్వాగతం పలికారు. స్టేడియం అంతా కరతాళ ధ్వనులతో హోరెత్తింది. ధోనీ 17 ఓవర్‌లో ఫోర్ బాదినప్పుడు అభిమానులు చేసిన నినాదాలకు శబ్ద తీవ్రత 128 డెసిబెల్స్‌ నమోదైంది. ఈ సీజన్‌లో బెంగళూరు, పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ భారీ శబ్ద తీవ్రత నమోదైంది. బెంగళూరు ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌లో దినేశ్ కార్తిక్‌ సిక్స్ కొట్టినప్పుడు అభిమానులు చేసిన నినాదాలకు 128 డెసిబెల్స్‌ శబ్ద తీవ్రత నమోదైనట్లు తేలింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని