IPL 2024: ధోనీని చూడాలని.. బ్లాక్‌లో రూ.64వేలు పెట్టి టికెట్లు కొని..

ఇదే చివరి సీజన్‌గా భావిస్తున్న తరుణంలో ఎంఎస్ ధోనీని (MS Dhoni) చూసేందుకు స్టేడియాలు అభిమానులతో పోటెత్తుతున్నాయి. ఫ్యాన్స్‌ కూడా ఎలాగైనా టికెట్లను దక్కించుకోవాలని శ్రమిస్తున్నారు.

Updated : 13 Apr 2024 16:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెటర్లను ప్రత్యక్షంగా చూసేందుకు మ్యాచ్‌ టికెట్ల కోసం ఎంతైనా ఖర్చు పెట్టే అభిమానులు ఉంటారు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు, చెన్నై జట్టుకు ఐదు టైటిళ్లను అందించిన ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం అతడు ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ టోర్నీలో ధోనీని చూడటానికే అభిమానులు వస్తున్నారనడంలో సందేహం లేదు. తాజాగా ఓ అభిమాని పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. అతడికి కొందరు మద్దతు తెలపగా.. మరికొందరు ఇదంతా ప్రమోషనల్‌ స్టంట్‌ అంటూ విమర్శలు గుప్పించారు.

ఏప్రిల్ 8న కోల్‌కతాతో చెపాక్‌ వేదికగా చెన్నై తలపడింది. ఆ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ధోనీని చూడటానికి ఓ అభిమాని తన ముగ్గురు కుమార్తెలతో కలిసివచ్చాడు. ‘‘ఆన్‌లైన్‌లో నాకు టికెట్లు దొరకలేదు. దీంతో బ్లాక్‌లో కొన్నా. ఇందుకోసం దాదాపు రూ.64 వేలు ఖర్చు పెట్టా. ఇంకా నా పిల్లల స్కూల్‌ ఫీజ్‌ కట్టలేదు. అయితే, ధోనీని దగ్గరగా ఒక్కసారైనా చూడాలని భావించాం. ఆ అవకాశం దక్కడంతో నాతోపాటు ముగ్గురు కుమార్తెలకు ఆనందంగా ఉంది’’ అని సదరు అభిమాని వ్యాఖ్యానించాడు. అదే వీడియోలో ఆ అభిమాని కుమార్తె కూడా మాట్లాడుతూ.. ‘‘టికెట్లను పొందడానికి మా నాన్న చాలా కష్టపడ్డారు. ధోనీ ఆటను ప్రత్యక్షంగా చూడటం ఆనందంగా ఉంది’’ అని తెలపడం విశేషం. ఆ వీడియోను పెట్టిన యూజర్‌ స్పందిస్తూ.. ‘‘ఓ తండ్రి ఇలా చెప్పడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. దీన్ని ఎలా వర్ణించాలో కూడా తెలియడం లేదు’’ అని రాసుకొచ్చాడు. అతడి పోస్టుపై కొందరు కామెంట్లు చేశారు.

‘‘సర్, అతడేమీ డబ్బు లేదని చెప్పలేదు. స్కూల్‌ ఫీజ్‌ తర్వాత కడతానని మాత్రమే చెప్పాడు’’

‘‘ఓ తండ్రిగా తన పిల్లలకు ఏం చేస్తే వారు ఆనందంగా ఉంటారో అతనికి తెలుసు. ఇలా చేయడం వల్ల ఇది వారికి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం అవుతుంది’’ 

‘‘అసలు ఎవరు ఇలా బ్లాక్‌లో అధిక ధరకు టికెట్లను అమ్మమని చెప్పారు. ప్రభుత్వం ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలి. సినిమా టికెట్ల విషయంలో మాత్రం ఉపేక్షించరు. ఇలా క్రికెట్‌ విషయంలోనే ఎందుకు నిబంధనలను అమలు చేయడం లేదు?’’

‘‘అదంతా అబద్ధమే. ఇదంతా సోషల్ మీడియాలో హైప్ కోసం చేస్తున్నారు’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని