CSK: చెన్నై సూపర్ కింగ్స్‌ సారథిగా రుతురాజ్‌ గైక్వాడ్

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను నడిపించేందుకు కొత్త సారథి వచ్చాడు. ఈమేరకు సీఎస్కే కీలక ప్రకటన చేసింది.

Updated : 21 Mar 2024 17:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) కొత్త సారథిని నియమించింది. యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ కీలక ప్రకటన చేసింది. భారత మాజీ కెప్టెన్, ఐదుసార్లు సీఎస్కేను ఛాంపియన్‌గా నిలిపిన ఎంఎస్ ధోనీ స్థానంలో రుతురాజ్‌కు బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఐపీఎల్ ట్రోఫీతో ఆయా జట్ల సారథులు పాల్గొన్న ఫొటోషూట్‌లోనూ రుతురాజ్‌ ఉన్నాడు. మార్చి 22న ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 17వ సీజన్‌ (IPL) తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో సీఎస్కే తలపడనుంది. ధోనీ ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా జట్టులో కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు.

రుతురాజ్‌ గైక్వాడ్‌ 2019 సీజన్‌లో సీఎస్కే తరఫున ఐపీఎల్‌లోకి వచ్చాడు. ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు. అయినా సరే జట్టును వీడకుండా కొనసాగాడు. మరుసటి ఏడాది కూడా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కానీ, 2021 ఎడిషన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం 635 పరుగులు చేశాడు. ఇక 2022 సీజన్‌లోనూ ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు (368) చేసిన బ్యాటర్‌ రుతురాజే. గతేడాది (2023) సీఎస్కే ఛాంపియన్‌గా నిలవడంలో గైక్వాడ్‌ కీలక పాత్ర పోషించాడు. 16 మ్యాచుల్లో 590 పరుగులు చేశాడు. డేవన్‌ కాన్వే తర్వాత (672) అత్యధిక పరుగులు చేసిన సీఎస్కే ఆటగాడు రుతురాజే. ఇప్పుడు ఏకంగా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటి వరకు 52 మ్యాచ్‌లు ఆడి 1,797 పరుగులు చేశాడు.

పంజాబ్‌ కింగ్స్‌ వైస్‌ కెప్టెన్‌గా జితేశ్‌ శర్మ

శుక్రవారం నుంచి టోర్నీ మొదలుకానున్న నేపథ్యంలో కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. సీఎస్కే నుంచి కెప్టెన్‌గా రుతురాజ్‌ హాజరు కాగా.. పంజాబ్‌ కింగ్స్‌ తరఫున వైస్‌ కెప్టెన్ వచ్చాడు. పంజాబ్‌కు శిఖర్‌ ధావన్‌ సారథి. కానీ, అతడికి డిప్యూటీగా యువ ఆటగాడు జితేశ్‌ శర్మను జట్టు యాజమాన్యం నియమించింది. దీంతో ఫొటోషూట్‌కు ధావన్‌ బదులు జితేశ్ పంజాబ్‌ తరఫున వచ్చేశాడు. ముంబయి ఇండియన్స్‌కు హార్దిక్‌ పాండ్య, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శ్రేయస్‌ అయ్యర్, రాజస్థాన్‌ రాయల్స్‌కు సంజూ శాంసన్, దిల్లీ క్యాపిటల్స్‌కు రిషభ్‌ పంత్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్యాట్ కమిన్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఫాఫ్‌ డుప్లెసిస్‌, గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్‌ గిల్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని