MS Dhoni: గాయం బాధతోనే ధోనీ సిక్సర్ల బాదుడు.. చెన్నై కోచ్‌ ఏమన్నాడంటే?

ధోనీ (MS Dhoni) మైదానంలో అడుగు పెడితే అభిమానుల నినాదాలతో దద్దరిల్లిపోతున్నాయి. బ్యాటింగ్‌కు దిగి సిక్స్‌ కొడితే ఫ్యాన్స్‌ ఉత్సాహం తారస్థాయికి చేరుతోంది.

Updated : 15 Apr 2024 13:57 IST

ఇంటర్నెట్ డెస్క్: ధోనీ (MS Dhoni) బ్యాటింగ్‌ను చూడటానికి స్టేడియాలు ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ‘కెప్టెన్ కూల్’ కూడా చెలరేగిపోతున్నాడు. తాజాగా వాంఖడే వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లోనూ హ్యాట్రిక్‌ సిక్స్‌లతో అభిమానులను అలరించాడు. నాలుగు బంతుల్లో 20 పరుగులు చేసి అదరగొట్టాడు. ముంబయిపై చెన్నై అంతే తేడాతో గెలవడం విశేషం. హైదరాబాద్‌, వైజాగ్‌ మ్యాచుల్లోనూ ధోనీ కోసం అభిమానులు బారులు తీరారు. ఓ వైపు గాయం నొప్పి బాధిస్తున్నా.. ఫ్యాన్స్‌ కోసం మైదానంలోకి అడుగు పెడుతున్నాడు. వైజాగ్‌లో మ్యాచ్‌ అనంతరం తన కాలికి ప్రత్యేకమైన పట్టీతో కనిపించాడు. తాజాగా ఆ నొప్పిని భరిస్తూనే ముంబయిపైనా హిట్టింగ్‌ చేశాడని చెన్నై బౌలింగ్‌ కోచ్‌ ఎరిక్ సిమన్స్‌ తెలిపాడు. 

‘‘ముంబయి బౌలింగ్‌ను చూస్తుంటే.. మా స్కోరు 200ల్లోపే ఉంటుందనిపించింది. ఒకే ఒక్క ఓవర్‌తో 206 పరుగులకు చేరాం. ప్రతి సారి ధోనీ మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాడు. అతడితో దగ్గరగా ఉండి పనిచేయడం అద్భుతం. క్రీజ్‌లోకి వెళ్లడంతోనే సిక్స్‌ బాదడం సులువేం కాదు. అప్పటికే ఆ బౌలర్‌ ఒక వికెట్‌ తీసి ఉత్సాహం మీదున్నాడు. కానీ, ధోనీ ముందు అతడి ఆటలేమీ సాగలేదు. నెట్స్‌లో ధోనీ ప్రాక్టీస్‌ను చూస్తే అసాధారణంగా ఉంటుంది. ఎలా ఆడాలని భావిస్తాడో.. మైదానంలో దానిని అమలు చేసేస్తాడు. అందుకే, అతడిని మా బ్యాటింగ్ వ్యూహంలో భాగంగా వాడుకుంటున్నాం. డెత్‌ ఓవర్లలో ఎలా బౌలింగ్‌ చేయాలో అతడి ఆటను చూసి నేర్చుకుంటున్నాం. సీజన్‌కు ముందు నిర్వహించిన సెషన్స్‌లో మా ప్లాన్లను అతడిపైనే ప్రయోగించేవాళ్లం. అప్పుడే మేం సరైన మార్గంలోనే వెళ్తామనే నమ్మకం కలిగేది. 

గత ఐపీఎల్‌ తర్వాత ధోనీ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. అప్పుడప్పుడు మళ్లీ నొప్పి తిరగబెడుతోంది. అయినా సరే అభిమానుల కోసం బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఇప్పటి వరకు నేను చూసిన క్రికెటర్లలో అరుదైన వ్యక్తి. నొప్పితో కూడా కెరీర్‌లో కొనసాగుతాడా? లేదా? అనే దానిపై ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ధోనీ నిర్ణయం అంత కచ్చితంగా ఉంటుంది. ఆడాలనుకుంటే వాటిని పట్టించుకోకుండా బరిలోకి దిగుతాడు. కొన్నిసార్లు ఇబ్బంది పడినా జట్టుకు ఏమీ అవసరం. ఏం చేయాలనే అంశంపై అతడికి స్పష్టత ఉంది. శివమ్‌ దూబెకు స్పిన్నర్లతో బౌలింగ్‌ వేయించేందుకు ప్రత్యర్థి కెప్టెన్లు జంకుతున్నారు. అతడి దూకుడు ఆ స్థాయిలో ఉంటుంది. ఈ మ్యాచ్‌లో మా బౌలింగ్‌ అత్యుత్తమంగా ఉంది. భారీ హిట్టర్లను కట్టడి చేయడం అభినందనీయం. శార్దూల్‌ కట్టుదిట్టంగా బంతులేశాడు. పతిరన ‘ఇంపాక్ట్’ ప్లేయర్‌గా అదరగొట్టాడు. మిడిల్ ఓవర్లలో పరుగులను నియంత్రించి ముంబయి ఓటమికి ప్రధాన కారణమయ్యాడు’’ అని ఎరిక్‌ తెలిపాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని