MS Dhoni: నాతో ఎక్కువగా పరుగులు పెట్టించొద్దని చెప్పా: ఎంఎస్ ధోనీ

ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌ దిశగా సాగుతోంది. తాజాగా దిల్లీని 27 పరుగుల తేడాతో సీఎస్‌కే చిత్తు చేసింది.

Updated : 11 May 2023 10:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK vs DC) చిత్తు చేసింది. సీఎస్‌కే నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనలో దిల్లీ 140/8 స్కోరుకే పరిమితమై 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారీ టార్గెట్‌ లేకపోయినా బౌలింగ్‌ వనరులను అద్భుతంగా వాడుకొని మరీ దిల్లీని కట్టడి చేయడంలో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు బ్యాటింగ్‌లోనూ ధోనీ (20: 9 బంతుల్లో ఒక ఫోర్,  2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ తొలి మూడు బంతుల్లో కేవలం ఒక్క పరుగే చేశాడు. ఇక 18వ ఓవర్‌లో ఒక్క బాల్‌ను ఎదుర్కోని ధోనీ.. 19వ ఓవర్‌లో మాత్రం విజృంభించాడు. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఈ ఓవర్‌లో ధోనీ రెండు సిక్స్‌లు, ఫోర్‌ బాదేశాడు. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ.. తనను ఎక్కువగా పరుగెత్తించవద్దని సహచరులను కోరినట్లు పేర్కొన్నాడు. 

‘‘దిల్లీతో మ్యాచ్‌లో నన్ను ఎక్కువగా పరుగులు పెట్టించొద్దని మా బ్యాటర్లకు చెప్పా. అదే వర్కౌట్‌ అయింది. చివర్లో ధాటిగా ఆడాల్సిన అవసరం ఉందని తెలుసు. నేను చేయాల్సిన పని కూడా ఇదే. అందుకే పరుగెత్తి త్వరగా అలసిపోకుండా ఉంటేనే భారీ షాట్లు కొట్టేందుకు అవకాశం ఉంటుంది. జట్టు విజయానికి సహకరించడం ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం టోర్నీ చివరి దశకు చేరువగా వచ్చాం. ప్రతి ఒక్కరికీ ఇది చాలా కీలకం. మా బ్యాటింగ్‌ విభాగంపై సంతోషంగానే ఉంది. సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్ బ్యాటింగ్‌ అద్భుతంగా ఉంది. స్కోరు బోర్డును ఎలా ముందుకు తీసుకెళ్లాలో అతడికి బాగా తెలుసు. పరిస్థితులను వేగంగా అర్థం చేసుకుంటాడు. ఇలాంటి ఆటగాళ్లు ప్రతి జట్టుకు అవసరం. ద్వితీయార్థంలో బంతి మరీ ఎక్కువగా సుడులు తిరిగింది. మా స్పిన్నర్లు అదనంగా వేగంతో బంతులను సంధించారు. ఈ పిచ్‌పై 160 - 170 పరుగులను కాపాడుకోవచ్చని అర్థమైంది’’ అని ధోనీ తెలిపాడు. 

చెన్నై ఇలా.. దిల్లీ అలా

దిల్లీపై విజయంతో చెన్నై సూపర్ కింగ్స్‌ తన ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగు పర్చుకుంది. ప్రస్తుతం 12 మ్యాచుల్లో ఏడు విజయాలు, నాలుగు ఓటములు, ఒక మ్యాచ్‌ రద్దుతో మొత్తం 15 పాయింట్లతో చెన్నై కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. చివరి రెండు మ్యాచుల్లో కనీసం ఒక్కటి గెలిచినా సీఎస్‌కేకు ఢోకా ఉండదు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌తోనే చెన్నై ఆడాల్సి ఉంది. మరోవైపు దిల్లీకి ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపు ముగిసినట్లే.  చివరి మూడు మ్యాచుల్లోనూ గెలిచినా కష్టమే. ప్రస్తుతం దిల్లీ ఎనిమిది పాయింట్లతో అట్టడుగున ఉంది. ఇంకా మూడు మ్యాచుల్లో పంజాబ్‌ కింగ్స్‌తో రెండుసార్లు, మరోసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు