MS Dhoni: నువ్వేమీ భయపడొద్దు.. నేనున్నా.. అభిమానికి ధోనీ భరోసా

మ్యాచ్‌ జరుగుతుండగా ఓ అభిమాని కంచె దూకి ధోనీ వద్దకు పరిగెత్తి అతడి పాదాలు తాకిన విషయం తెలిసిందే. నాడు తనతో మహీ ఏం మాట్లాడాడో ఆ అభిమాని పంచుకున్నాడు.

Published : 30 May 2024 00:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ (IPL 2024)17వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌.. గుజరాత్‌ టైటాన్స్‌తో ఇటీవల తలపడిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ మధ్యలో ఎమ్‌ఎస్‌ ధోనీ (MS Dhoni) అభిమాని ఒకరు మైదానంలోకి దూకి అందరి దృష్టిని ఆకర్షించాడు. నేరుగా మహీ పాదాలను తాకాడు. అనంతరం ‘మిస్టర్‌ కూల్‌’ కూడా అభిమానిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని కాసేపు ముచ్చటించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, తనతో ధోనీ ఏమీ మాట్లాడాడో స్వయంగా ఆ అభిమాని తెలియజేశాడు.

‘‘ధోనీ ఒక లెజెండ్‌. మ్యాచ్‌ జరుగుతుండగా.. ఆయన మైదానంలోకి వచ్చారు. ఏది ఏమైనా మహీని కలవాలని అనిపించింది. అందుకే కంచె దూకి మైదానంలోని ధోనీ దగ్గరకు పరిగెత్తా. ఆయన పాదాలను తాకా. మహీని చూడగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పుడు.. నాకున్న సమస్యను ఆయన పసిగట్టారు. ఎందుకు అంత వేగంగా ఊపిరి పీల్చుకుంటున్నావ్‌ అని అడిగారు. నాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని చెప్పా. ‘దీని గురించి నువ్వేమీ భయపడకు. నీకు నేనున్నా. నీ సర్జరీ బాధ్యత నాది. నీకేమీ కానివ్వను’ అని మహీ ధైర్యమిచ్చారు’’ అని అతడు నాడు జరిగిన సంఘటనను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు ఈ విషయాలు వెల్లడించాడు.

న్యూయార్క్‌ వీధుల్లో యశస్వి.. ఫొటోపై సూర్య కామెంట్ వైరల్!

అభిమాని ధోనీ వద్దకు వెళ్లడంతో అక్కడున్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అతడిని మహీకి దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీనిపై ధోనీ స్పందిస్తూ.. ‘అతడిని జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లండి. ఏం జరగనివొద్దు’ అని సిబ్బందిని కోరినట్లు తెలిపాడు. ధోనీతో జరిగిన చర్చకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మహీ మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

‘‘ధోనీ మనసు చాలా గొప్పది’’

‘‘అభిమానులంటే మహీకి ఎంతో గౌరవం. లవ్‌ యూ ధోనీ’’

‘‘బ్రదర్‌.. మీరు చాలా లక్కీ’’ అంటూ కామెంట్లు గుప్పించారు.

కాగా.. ఇటీవల ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. ఫలితంగా సీఎస్కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. దాని తర్వాత ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై మహీ ఇంతవరకు స్పందించలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని