Team India: న్యూయార్క్‌ వీధుల్లో యశస్వి.. ఫొటోపై సూర్య కామెంట్ వైరల్!

యశస్వి జైస్వాల్‌ షేర్ చేసిన ఫొటోలకు సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. అదే సమయంలో జాగ్రత్త అంటూ కామెంట్ చేశాడు.

Updated : 29 May 2024 14:37 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20m World Cup 2024) కోసం దాదాపు భారత్ జట్టు అంతా ఇప్పటికే అమెరికా చేరింది. జూన్ 5న టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈలోగా ఒక వార్మప్ మ్యాచ్‌లో తలపడనుంది. దీంతో భారత క్రికెటర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, కాసేపు ఆటవిడుపు కోసం న్యూయార్క్‌ వీధుల్లో ప్లేయర్లు చక్కర్లు కొడుతున్నారు. తాజాగా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. దీనిపై అభిమానుల నుంచి విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి.

యశస్వి పోస్టుపై ‘మిస్టర్ 360’ క్రికెటర్ సూర్యకుమార్‌ యాదవ్ కూడా స్పందించాడు. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా కెప్టెన్ రోహిత్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘తోటల్లో తిరుగుతున్నట్లు తెలిస్తే..’ అంటూ మండిపడ్డాడు. ఆ మాటలు స్టంప్స్‌ మైకుల్లో రికార్డై వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు వాటిని గుర్తు చేస్తున్నట్లు.. ‘జాగ్రత్త. మీరు తోటల్లో తిరిగితే ఏమవుతుందో తెలుసుగా?’ అని సూర్యకుమార్‌ కామెంట్ చేశాడు. దానికి నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు.

అమెరికాలో హార్దిక్‌ పాండ్య

ఐపీఎల్‌లో ఘోర పరాభవం, జీవిత భాగస్వామితో విడాకులు తీసుకున్నాడనే కథనాల నేపథ్యంలో హార్దిక్‌ పాండ్య భారత్‌ నుంచి లండన్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి నేరుగా అమెరికాకు వచ్చి జట్టుతోపాటు కలిసిపోయాడు. టీమ్ సభ్యులతో ఉన్న ఫొటోలను పాండ్య షేర్ చేశాడు. టీ20 ప్రపంచ కప్‌ కోసం ప్రకటించిన జట్టుకు అతడు వైస్ కెప్టెన్. వన్డే ప్రపంచకప్‌ తర్వాత భారత జట్టుకు ఆడేందుకు సిద్ధం కావడం విశేషం. సంజూ శాంసన్, రింకు సింగ్‌ కూడా వేర్వేరుగా యూఎస్‌కి వచ్చినట్లు సమాచారం.

వార్మప్‌ మ్యాచ్‌ చూసేదెలా..?

జూన్ 1న బంగ్లాదేశ్‌తో భారత్‌ వార్మప్‌ మ్యాచ్‌లో తలపడనుంది. అన్ని వార్మప్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. కేవలం రెండు మ్యాచ్‌లను మాత్రమే చూసే అవకాశం ఉంది. అందులో ఒకటి భారత్ - బంగ్లా కాగా.. వెస్టిండీస్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. డిజిటల్ వెర్షన్‌లో డిస్నీ +హాట్‌స్టార్‌లో వీక్షించే అవకాశం ఉంది. టీవీల్లో ప్రధాన మ్యాచ్‌లను మాత్రమే ప్రసారం చేయనున్నారు. అదీనూ టీవీల్లో స్టార్ స్పోర్ట్స్‌ ఛానెళ్లలో చూడొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు