Sameer Rizvi: రషీద్‌ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ

తన అభిమాన క్రికెటర్‌తో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్‌ రిజ్వీ వ్యాఖ్యానించాడు.

Published : 28 Mar 2024 13:11 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ మినీ వేలంలో రూ.8.40 కోట్లు దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించిన కుర్రాడు సమీర్ రిజ్వీ (Sameer Rizvi). చెన్నై జట్టు భారీ మొత్తం వెచ్చించి అతన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. చివర్లో వచ్చిన రిజ్వీ (14), రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. ప్రపంచంలోనే టాప్‌ బౌలర్‌ అయిన రషీద్ ఖాన్‌ను ఎదుర్కొనేందుకు హేమాహేమీలే కాస్త జంకుతారు. అలాంటిది ఏమాత్రం బెరుకు లేకుండా రిజ్వీ ఆడటంపై సర్వత్రా ప్రశంసలు అందాయి. తాజాగా ఐపీఎల్ నిర్వాహకులు షేర్ చేసిన ఓ వీడియోలో రిజ్వీ తన బ్యాటింగ్‌ ప్రదర్శనతోపాటు చెన్నైకి ఆడటంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘నేను 19వ ఓవర్‌లో క్రీజ్‌లోకి వచ్చా. ఆ సమయంలో నేను అనుకున్నచోట బంతి పడితే మాత్రం సిక్స్‌ కొట్టేందుకే ప్రయత్నిస్తా. ఇక నేను ఎదుర్కొన్న  తొలి బంతిని స్టాండ్స్‌ అవతల పడేశా. దీనింతటికి కారణం ధోనీ (MS Dhoni) సలహాలే. అరంగేట్రం చేసేటప్పుడు ఒత్తిడి ఉంటుంది. ఆ సమయంలో సీనియర్లు ఇచ్చే సూచనలు కీలకం. ధోనీతో మాట్లాడితే ఎంతో ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. ‘నువ్వు ఎలా ఆడాలని భావిస్తావో అలా ఆడేందుకు ప్రయత్నించు. మ్యాచ్‌లు, నైపుణ్యం ఒకేలా ఉంటాయి. మన మైండ్‌సెట్‌ విభిన్నంగా ఆలోచిస్తుంది. అప్పుడే ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. పరిస్థితికి అనుగుణంగా ఆడితే చాలు. భారీగా ప్రేక్షకులు హాజరయ్యే టోర్నీలో ఆందోళన పడకుండా బ్యాటింగ్‌ చేయి’ ఇవీ ధోనీ చెప్పిన మాటలు. అవి నా తొలి మ్యాచ్‌లో ఎంతో ఉపయోగపడ్డాయి.

ఒరిజినల్‌గా నా జెర్సీ నంబర్‌ ఏడు. కానీ, నేను నంబర్‌ 1కి మారిపోయా. ఎందుకంటే అప్పటికే ఆ జెర్సీ ఎంఎస్ ధోనీ పేరిట ఉంది. దానిని మరెవరూ ధరించడం సరైంది కాదు. అందుకే జెర్సీని మార్చుకున్నా. చెన్నైలో ప్రతీ ఆటగాడికి సహచరుడి నుంచి మద్దతు లభిస్తుంది. నేను తొలిసారి ఐపీఎల్‌లోకి అడుగుపెట్టా. మినీ వేలంలో చెన్నై నన్ను తీసుకున్నప్పుడు చిన్నప్పటి కల నెరవేరిందనుకున్నా. ధోనీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ పంచుకోవడం జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం. తొలిసారి మైదానంలో అడుగుపెట్టినప్పుడు ప్రతిఒక్కరూ హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఎలాంటి సందేహమైనా సరే నిస్సంకోచంగా అడిగే స్వేచ్ఛ ఇక్కడ ఉంది. బ్యాటింగ్‌ లేదా ఇతర విషయాల గురించి తరచూ సీనియర్లతో మాట్లాడేస్తున్నా’’ అని రిజ్వీ వెల్లడించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు