MS Dhoni: వింటేజ్‌ లుక్‌లో ధోని.. కొత్త పాత్రకు సిద్ధం అంటూ ఎఫ్‌బీలో పోస్టు

ఐపీఎల్‌-17 కోసం వింటేజ్‌ లుక్‌లో చెన్నైకి వచ్చిన ధోనిని చూసి సీఎస్కే ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. కొత్త పాత్రకు సిద్ధం అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

Updated : 07 Mar 2024 14:18 IST

మహేంద్రసింగ్‌ ధోని.. ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది.. మెడ వరకు వేలాడే జట్టు.. బలమైన దేహం. కానీ, కెరీర్‌ గడుస్తున్నకొద్దీ మహీ మారుతూ వచ్చాడు. ఒకప్పటి ఆ జుట్టూ లేదు, ఆ బలమూ తగ్గింది. అయితే ఐపీఎల్‌-17 కోసం చెన్నైకి వచ్చిన ధోనిని చూస్తే ఒకప్పటి మహీ గుర్తొచ్చాడు. అదే పొడవైన జట్టు.. బలమైన దేహంతో వింటేజ్‌ ఎంఎస్‌డీలా కనిపిస్తున్నాడు.

కొత్త రూపం.. కొత్త పాత్ర

ఈసారి మహేంద్రసింగ్‌ ధోనిపై అభిమానుల దృష్టి ఎక్కువగా ఉండబోతోంది. బహుశా ఇదే అతడికి చివరి ఐపీఎల్‌ కావచ్చనే వార్తలే ఇందుకు కారణం. నిజానికి ఐపీఎల్‌-16తోనే ధోని ఆఖరి టోర్నీ ఆడేశాడని ఫ్యాన్స్‌ అనుకున్నారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ టైటిల్‌ గెలవడంతో ధోని అంతటితో ముగిస్తాడని భావించారు. కానీ అలాంటి సంకేతాలు ఇవ్వలేదు. 2024లోనూ ఆడతానని చెప్పాడు. చెప్పడమే కాదు ఈ టోర్నీలో బరిలో దిగేందుకు సర్వసిద్ధమై చెన్నైలో దిగిపోయాడు. ఒకప్పటి ధోనిని గుర్తుకుతెచ్చే రూపంలో అభిమానులను అలరిస్తున్నాడు.  గత మూడేళ్లతో పోలిస్తే ఎంతో బలంగా కనిపిస్తున్నాడు. దీంతో నాయకుడి ఉత్సాహం చూసి ఈసారి కూడా కప్పు మనదే అని ఫ్యాన్స్‌ ధీమాను ప్రదర్శిస్తున్నారు.

ఈ టోర్నీకి వచ్చే ముందు ఈ సీజన్లో కొత్త పాత్రకు సిద్ధం అని సామాజిక మాధ్యమంలో మహీ చేసిన పోస్టు వైరల్‌ అయింది. దీంతో ఆ కొత్త పాత్ర ఏంటి? అని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఎందుకంటే మహీకి దాదాపు ఇదే చివరి సీజన్ కావచ్చు. ఈనేపథ్యంలో కెప్టెన్సీని సగం నుంచే ఎవరికైనా అప్పజెబుతాడా? లేక ఇంకా ఏదైనా పాత్ర పోషిస్తాడా? అనేది చూడాలి. జడేజాకు కెప్టెన్సీ అప్పగిస్తే ఒత్తిడి భరించలేక మధ్యలోనే వదిలేశాడు. మరి ఈసారి అలాంటి ఇబ్బందిలేకుండా ఇంకొకరికి ఎవరికైనా ఆ బాధ్యతలను సాఫీగా బదలాయిస్తాడా అనేది ఆసక్తికరం.

అన్ని జట్ల కెప్టెన్లు మారినా..

ఐపీఎల్‌ మొదలై 16 సంవత్సరాలు అయిపోయింది. అన్ని జట్లు మారాయి. అన్ని జట్ల కెప్టెన్లు ఛేంజ్‌ అయ్యారు. ఆటగాళ్లు మారారు. మారనిది మహేంద్రసింగ్‌ ధోని ఒక్కడే. 2008లో చెన్నై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఇప్పటివరకు మహీ ప్రస్థానం చిరస్మరణీయం. ఏకంగా ఐదుసార్లు సీఎస్కేని విజేతగా నిలిపిన ధోని.. మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా నిలిచాడు. ముంబయి ఇండియన్స్‌ను అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్‌శర్మ కూడా ఈసారి సాధారణ ఆటగాడినే బరిలో దిగనున్నాడు. కానీ ధోని మాత్రం ఎవర్‌గ్రీన్‌ కెప్టెన్‌లా అలాగే ఉన్నాడు.

అందుకే ఐపీఎల్‌-17లో మహీ ఏం చేస్తాడో ఎలా రాణిస్తాడో?, చెన్నైని ఎలా ముందుకు తీసుకెళ్తాడో? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఐపీఎల్‌ సీజన్లో ధోని కొన్ని ఫినిషింగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈసారి బ్యాటర్‌గానూ అతడు సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అదంత తేలిక కాదు. ఎందుకంటే మహీ కాంపిటేటివ్‌ మ్యాచ్‌లో బరిలో దిగి ఏడాది అయింది. గత కొన్ని నెలలుగా బ్యాటింగ్‌ సాధన చేస్తున్నా కూడా మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండా నేరుగా ఆడడం ఇబ్బంది కలిగించేదే. మరి ఈ ప్రతికూలతలను తట్టుకుని ధోని అటు బ్యాటర్‌గా, కీపర్‌గా.. సారథిగా చెన్నైని ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.

-ఈనాడు క్రీడా విభాగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని