#HBDDhoni: మాహీ మ్యాజిక్‌ 7.. ఆచరించండి... అదరగొట్టేయండి!

టీమ్‌ ఇండియా మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ (Mahendra Singh Dhoni)కి బర్త్‌డే విషెష్‌ చెప్పారా? ఈ రోజు పుట్టిన రోజు కదా అని ధోనీ నుంచి మనం తీసుకోదగ్గ 7 బెస్ట్‌ క్వాలిటీస్‌పై ఓ లుక్కేద్దాం! (HBD Dhoni)

Updated : 07 Jul 2023 13:07 IST

మహేంద్ర సింగ్‌ ధోనీ... ఇది మూడు పదాల పేరు మాత్రమే కాదు అంతకుమించి. ఆటతీరుతో, వ్యక్తిత్వశైలితో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు, నిలుస్తున్నాడు, నిలుస్తాడు కూడా. మిస్టర్‌ కూల్‌గా అభిమానుల మనసులో పర్మినెంట్‌ ప్లేస్‌ సంపాదించుకున్న మాహీ... పుట్టిన రోజు (HBD Dhoni) నేడు. ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్‌ ధోనీ లైఫ్‌ నుంచి ఓ ఏడు ఆసక్తికర అంశాలు తెలుసుకుందామా..

వెనుకుండి నడిపించి...

నడిచే వాడిని సైనికుడు అంటే నడిపించేవాడిని నాయకుడు అంటారు. అలాంటి వ్యక్తి ధోనీ. ఎంతోమంది దిగ్గజ కెప్టెన్లకు వీలుకాని రీతిలో భారత జట్టుకు రెండు ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్‌ ట్రోఫీ అందించాడంటే ఆ నాయకత్వం గొప్పతనం తెలుస్తుంది. మీరు ఆడండి.. మీ వెనుక అండగా నేనుంటా అంటూ ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను గెలిపించాడు. సీఎస్కే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఆఖరులో బ్యాటింగ్‌కు రావడం వెనుక ఎవరు ఎన్నైనా అనొచ్చు, ధోనీపై ఎన్ని జోకులైనా చెప్పొచ్చు. కానీ నేనున్నా.. మీరు ఆడండి అని యంగ్‌ ప్లేయర్లకు మాహీ ఇచ్చిన భరోసా ఎంతటి ఫలితం ఇచ్చిందో చూశాం కదా.

వయసు పెరుగుతున్నా...

ఏజ్‌ ఈజ్‌ ఏ నంబర్‌.. ధోనీని గ్రౌండ్‌లో చూసినవాళ్లు కచ్చితంగా ఈ మాట అంటారు. కుర్ర ప్లేయర్లతో పోటీపడి మరీ షాట్లు కొట్టడమే కాదు, వికెట్ల మధ్య పరుగు కూడా పెడుతుంటాడు. గతంలో చాలా సందర్భాల్లో చేసి చూపించాడు. ఆ వీడియోలు వైరల్‌ కూడా అయ్యాయి. ఇప్పుడు అలాంటి ధోనిని మీకు 44 వచ్చాయి కదా అంటే.. ‘అవును అయితే’ అని అంటాడు. దీనికి ఉదాహరణ మొన్నటి ఐపీఎల్‌లో చేసిన జెట్‌ స్పీడ్‌ స్టంపౌట్‌.. ఎవరిదో ఆ వికెట్‌ గుర్తుందా? ఇంకెవరిది మన శుబ్‌మన్‌ గిల్‌ది. 

ఫ్యామిలీ మ్యాన్‌

క్రికెటర్లు ఎప్పుడూ టూర్లు, ప్రాక్టీస్‌లు అంటూ బిజీగా ఉంటారు. ప్రస్తుతం బీసీసీఐ ప్లాన్స్‌ చూస్తుంటే ఒక నెల రోజుల గ్యాప్‌ దొరకడం గగనం అయిపోయింది. ఇలాంటి సమయంలోనూ ఫ్యామిలీతో గడపడానికి ధోనీ పక్కా ప్లాన్స్‌ వేసుకునేవాడు. టీమిండియాకు బిజీగా ఆడుతున్న సమయంలో ఖాళీ రోజులను పక్కాగా ఆర్గనైజ్‌ చేసుకునేవాడు. ఇప్పుడు కేవలం ఐపీఎల్‌కు మాత్రమే ఆడుతుండటంతో వీలైనంతసేపు ఫ్యామిలీకే కేటాయిస్తున్నాడు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ఫ్యామిలీకి ధోనీ ఇస్తున్న సపోర్టు కూడా మనం చూస్తున్నాం.

మన పెద్దన్న

ధోనీ ఉంటే.. ఆ జట్టులో యువ ఆటగాళ్లకు పండగే అని చెప్పాలి. ఎలా బౌలింగ్‌ వేయాలి అనేది ఎవరైనా చెబుతారు, అయితే ఎలా బౌలింగ్‌ వేయకూడదు అని చెప్పేవాళ్లు చాలా తక్కువమంది. ఆ పని ధోనీ చేస్తాడు. అది కూడా ఇంట్లో మన పెద్దన్న మనకు చెప్పినట్లుగా.. అవసరమైతే కాస్త కఠువుగా కూడా చెబుతాడు. ఈ పెద్దన్న పాత్రను ఇన్నాళ్లూ టీమిండియాలో చేసిన మాహీ.. ఇప్పుడు చెన్నై టీమ్‌లో ‘తలా’గా చేస్తున్నాడు. తుషార్‌ దేశ్‌పాండే, మహీషా పతిరాన లాంటి వాళ్లకు పెద్దన్నగా మారి వాళ్లను ముందుకు నడిపిస్తున్నాడు. ఆ మాటకొస్తే ప్రతి టీమ్‌లో ఉన్న కుర్రాళ్లకు మ్యాచ్‌ తర్వాత పెద్దన్న అయిపోతుంటాడు. యువ ఆటగాళ్లకు మెలకువలు చెబుతుంటాడు. ఈ ఐపీఎల్‌లోనే ధోనీ.. కాస్త కఠువుగా ‘బౌలింగ్‌లో మార్పు రాకపోతే వేరే కెప్టెన్‌ వస్తాడు’ అని అన్న విషయం తెలిసిందే.

సరైన టైమ్‌లో నిర్ణయం 

ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవడం కాదు.. సరైన సమయంలో ప్లాన్‌ చేయడం ముఖ్యం అంటారు. ఆ గుణం ధోనీలా చాలా ఉంది. ఎప్పుడు జట్టులోకి రావాలి అనేది ఆయన చేతిలో లేదు కాబట్టి.. ఎన్నో ప్రయాసలకోర్చి వచ్చాడు. కానీ జట్టు నుండి తప్పుకోవడంలో మాత్రం ఆలోచించి సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నాడు.  జట్టుకు భారం అవుతున్నాడు అనే మాట రాకుండా జాగ్రత్తపడ్డాడు. ఇప్పుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ విషయంలోనూ అదే చేస్తాడు అంటున్నారు. అయితే వెళ్లిపోతూ టీమ్‌ ఇండియాకు మంచి కెప్టెన్‌ను ఇచ్చినట్లు.. చెన్నైకి ఎవరినిస్తాడో చూడాలి. 

వల్ల కాదు.. డైరీలో లేదు

ధోనీ డైరీ రాస్తాడో లేదో తెలియదు కానీ.. ఒకవేళ రాస్తుంటే అందులో ‘వల్ల కాదు’, ‘కుదరదు’, ‘అవకాశం లేదు’ లాంటి మాటలు కచ్చితంగా ఉండవు అని చెప్పొచ్చు. ఒకరు ‘నువ్వు చేయలేవు’ అని అంటే.. కచ్చితంగా అది చేసి చూపిస్తాడు. కావాలంటే చూడండి ‘డాడీస్‌ ఆర్మీ’ అంటూ అందరూ ఎగతాళి చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఐదు సార్లు టోర్నీ విజేతగా నిలిపాడు. గత ఐపీఎల్‌లో పాయింట్ల పట్టికలో టాప్‌ 4కి కూడా రావడానికి ఇబ్బందిపడిన చెన్నైని.. ఈసారి కప్‌ గెలిచేలా చేశాడు. కపిల్‌ తర్వాత ఎవరూ భారత్‌కు ప్రపంచకప్‌ తీసుకొచ్చేలా లేరు అంటే.. నేనున్నా అంటూ చేసి చూపించాడు. ఇంకా ఆడాలి అని అతడు సంకల్పం తీసుకుంటే వచ్చే ఏడాది ఐపీఎల్‌లోనూ ధోనీ మ్యాజిక్‌ చూసే అవకాశం ఉంది. 

కూల్‌ అండ్‌ కంపోజ్డ్‌

ఇక ఆఖరిగా చెప్పుకోవాల్సింది మాహీ ట్రేడ్‌ మార్క్‌ క్వాలిటీ.. కూల్‌ అండ్‌ కంపోజ్డ్‌. ‘ధోనీ గురించి రాయండి?’ అని ఎవరినైనా అడిగితే.. తొలుత ‘మిస్టర్‌ కూల్‌’ అంటూ ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆ పేరు అంతలా మారింది మహేంద్రుడికి. మైదానంలో యుద్ధం రేంజిలో మ్యాచ్‌ జరుగుతున్నా.. ఎక్కడా ముఖంలో టెన్షన్‌ కనిపించనివ్వడు. నాయకుడే కంట్రోల్‌ తప్పితే టీమ్‌ ఇంకా టెన్షన్‌లో పడుతుంది అనేమో అలా ఉంటాడు అంటుంటారు పరిశీలకులు. అయితే అదెలా సాధ్యం అంటే మాత్రం ఓ ట్రేడ్‌ మార్క్‌ నవ్వు నవ్వేస్తాడు. మిగిలిన క్వాలిటీల సంగతేమో కానీ.. ‘కూల్‌ అండ్‌ కంపోజ్డ్‌’ మాత్రం ధోనీని స్పెషల్‌గా మార్చింది. 

‘మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు ఆకాశం వైపు చూడకండి. పై నుంచి వచ్చి ఎవరూ మన కోసం ఆడరు, ఆడించరు. మనమే ఆడాలి, గెలవాలి, గెలిచి తీరుతాం’ ఇదీ ఓ మ్యాచ్‌ సందర్భంలో టీమ్‌కి ధోనీ చెప్పిన మాట. ఇదీ ధోనీ ఆలోచనా శైలి. అలా ఉన్నాడు, ఉంచాడు కాబట్టే.. టీమ్‌ను అన్నేళ్లు విజయపథంలో నడిపించాడు. ఇలా ఆలోచించాడు కాబట్టే ‘పడ్డప్పుడు లేచాడు, ప్రత్యర్థిని పడగొట్టాడు’. ఇంకెందుకు ఆలస్యం ఈ పాయింట్‌ను బోనస్‌గా తీసుకోండి ఆచరించేయండి, విజయం సాధించేయండి. 

ఇంత చెప్పాక ఆఖరిగా ఓ మాట చెప్పకపోతే ఎలా ‘హ్యాపీ బర్త్‌డే మాహీ... హ్యాపీ బర్త్‌డే’!

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని