WPL 2024: డబ్ల్యూపీఎల్ 2024.. ఉత్కంఠపోరులో దిల్లీపై ముంబయి విజయం

డబ్ల్యూపీఎల్‌ 2024 (WPL 2024) రెండో ఎడిషన్‌లో తొలి మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతికి దిల్లీపై ముంబయి అద్భుత విజయం సాధించింది.

Updated : 23 Feb 2024 23:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇది కదా అసలైన క్రికెట్‌ మజా. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) రెండో ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లోనే అభిమానులకు కావాల్సినంత ఫన్‌ లభించింది. చివరి బంతి వరకు సాగిన పోరులో దిల్లీ క్యాపిటల్స్‌పై ముంబయి ఇండియన్స్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దిల్లీ నిర్దేశించిన 172 పరుగుల టార్గెట్‌ను ముంబయి సరిగ్గా 20 ఓవర్లలో పూర్తి చేసింది. ఐదు పరుగులు అవసరమైన సందర్భంలో.. సజన (6*) చివరి బంతిని సిక్స్‌గా మలిచి ముంబయిని గెలిపించింది. ముంబయి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (55), యస్తికా భాటియా (57) హాఫ్ సెంచరీలు సాధించారు. నాట్ స్కివెర్ (19), అమెలియా కెర్ (24) కీలక పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లు అరుంధతి రెడ్డి 2, ఎలీస్‌ కాప్సే 2.. మరిజన్నె, షికా పాండే చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది.

రెండో బంతికే ఎదురు దెబ్బ

దిల్లీ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబయికి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. పరుగుల ఖాతా కూడా తెరవకుండానే హీలే మాథ్యూస్ (0) డకౌట్‌గా పెవిలియన్‌కు చేరింది. అయితే యస్తికా భాటియాతో కలిసి నాట్‌ స్కివెర్ రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టింది. స్కివెర్ ఔటైన తర్వాత కెప్టెన్ హర్మన్‌తో యస్తికా జతకలిసింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. హాఫ్ సెంచరీ తర్వాత యస్తికా పెవిలియన్‌కు చేరింది. అమెలీ కెర్ దూకుడుగా ఆడింది. కానీ, దిల్లీ బౌలర్లు ఆఖర్లో కట్టుదిట్టంగా బంతులేయడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. చివరి ఓవర్‌లో పన్నెండు పరుగులు చేయాల్సి ఉండగా.. పూజా వస్త్రాకర్ (3)తోపాటు హాఫ్ సెంచరీ సాధించి ఊపు మీదున్న హర్మన్ ఔట్‌ కావడం అభిమానుల్లో ఉత్కంఠను తారస్థాయికి తీసుకెళ్లింది. చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. సజన సిక్సర్‌తో మ్యాచ్‌కు ముగింపు పలికింది. దీంతో డబ్ల్యూపీఎల్‌లో తొలి విజయంతో పాయింట్ల పట్టికలో ముంబయి బోణీ కొట్టింది.

కాప్సే దూకుడు

ఎలీస్ కాప్సే (75: 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ చేసింది. ఓపెనర్‌, కెప్టెన్ మెగ్‌ లానింగ్‌ (31: 25 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌)తోపాటు జెమీమా రోడ్రిగ్స్‌ (42: 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా పరుగులు రాబట్టారు. మరిజన్నె కాప్‌ (16: 9 బంతుల్లో 3 ఫోర్లు) వేగంగా ఆడింది. ముంబయి బౌలర్లు నాట్ స్కివెర్ బ్రంట్ 2, అమేలియా కెర్‌ 2, షబ్నిమ్‌ ఇస్మాయిల్ ఒక వికెట్‌ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు